ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే !



       నిన్న సాయంత్రం ఇంటికి రాగానే నా భార్యామణి వేడివేడిగా పకోడీలు అందించింది. ఏవో కులాసాగా కబుర్లు చెపుతు, మళ్ళీ వారం మీ పుట్టినరోజు కదా బట్టలు కొనుక్కోరా అంది. నాకు అంత ఇంట్రస్ట్ లేదులే అన్నాను. అలా కాదు తయారవండి వెళ్దాం అందినేను అయిష్టంగానే రెడీ అయాను. కళామందిర్ కు వెళ్ళాం. ద్వారం దగ్గరే అతివినయంగా రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతూ ఆహ్వానించింది ఒక అమ్మాయి. దేనికోసమండి అని అడిగింది. మగవాళ్ళ బట్టలు కావాలి అంది నా భార్య. అయితే మూడో ఫ్లోర్ కి వెళ్ళండి అంది అమ్మాయి. సరేనని లిఫ్ట్ కేసి నడుస్తుంటే మెట్లు ఎక్కుదాం రండి అని అలా నడిచింది నా భార్య . ఇంతలో మొదటిఫ్లోర్ లోనే నలుగురు అమ్మాయిలు చుట్టు ముట్టి రండి మేడమ్  చీరలు కొత్త వెరైటీలు రోజే వచ్చాయి అంటూ లాక్కెళ్ళారు. మా ఆవిడ కూడా ఇష్టం లేనట్లుగానే అలా నడుచుకొంటూ వెళ్ళి కూచుంది. వాళ్ళు చీర చూడండి, చీర చూడండి అంటూ వందరకాల చీరలు మా ముందు పడేయడం, ఈవిడ ఒక్కో చీర చూస్తూ దాని ధర, డిజైన్ లు పరిశీలిస్తూ అవును వేసవి వస్తోంది కదండీ నాలుగు కాటన్ చీరలు కొనాలి అనీ, పెళ్ళిళ్ళు, పంక్షన్ల్ ఉన్నాయి వాటికి కూడా నాలుగు మంచి చీరలు లేకపోతే ఎలాగా అంటూనూ మొత్తానికి మూడు గంటలు చీరలన్నీ తీయించి ఆరేడు చీరలు వరకూ కొనేసింది. ఇంక వాళ్ళు షాప్ మూసే సమయం అయింది. ఇంక మళ్ళీ నా బట్టలు సెలెక్ట్ చేసే సమయం నాకూ, బిల్లు చెల్లించే ఓపిక నా కార్డ్ కూ లేకపోవడంతో బిల్లు చెల్లించి బయటకు వచ్చాము. అపుడు   అయ్యో ఇంతకీ మీ డ్రెస్ లు కొననే లేదు అంటోంది. అపుడు రెండు విషయాలు నాకు అర్ధం అయాయి. ఒకటి షాప్ వాళ్ళు ఫస్ట్ ప్లోర్ లో చీరలు పెట్టి మగ వాళ్ళ బట్టలు పైన ఎక్కడో ఎందుకు పెడతారో అన్నది. రెండు ఆడవాళ్ళు మనని అంత ప్రేమగా బట్టలు కొనుక్కోరా అంటే వాళ్ళకి షాపింగ్ పని ఉందని. ఆడ వారి మాటలకు అర్ధాలే వేరులే అనుకొంటూ ఇంటి దారి పట్టాను.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం