పరీక్షల్లో విజయానికి “సక్సెస్ మంత్ర”

  


ఇది మార్చి నెల ఎండాకాలం. అంతేకాదు పరీక్షల కాలం కూడా. మార్చి అనగానే విద్యార్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతాయి. పరీక్షలు అనగానే ఒత్తిడి మొదలవుతుంది. చదివే విద్యార్ధికి, చదవని విద్యార్ధికీ కూడా మనసులో అనవసరంగా ఆందోళనతో నిండి పోతుంది. పరీక్షలు అనగానే అదేదో జీవన్మరణ సమస్యగా భావించకూడదు. అది మన జీవనసోపానపటంలో ఒక నిచ్చెనగా భావించాలి. దాన్ని ఎక్కడం వలన మనం ఒక మెట్టు ఎక్కినట్లుగా అనుకోవాలి. తద్వారా మనం మరో తరగతికి వెళ్ళడమో, ఉద్యోగం పొందటమో జరుగుతుంది. దీనిలో కొంత శ్రమ ఉంటుంది. కాని శ్రమ తరువాత మనం పొందే విజయం మరింత మధురంగా ఉంటుంది. " ఎండ వెనుక వానలా". మరి విజయాన్ని అందుకోడానికి క్రింది సూత్రాన్ని పాటించండి.
E = P 3
ఎగ్జామినేషన్ = ప్లానింగ్ + ప్రిపరేషన్ + ప్రెజెంటేషన్
       ముందు మనం వ్రాయబోయే పరీక్షల గురించి చక్కని  " ప్లానింగ్" ఉండాలి. దానికి పుస్తకాలు అవసరం, ఎవరి గైడెన్స్ తీసుకోవాలి అనే ప్లానింగ్ మనకి ఉండాలి. మనం చదువుకొనే చోటు, సమయం, అవసరమైన సామగ్రి, అందుబాటులో ఉంచుకోవాలి. ఇంక మనం యుద్ధానికి సిద్ధం అయినట్లే. అందుకేవెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ " అంటారు.
       మనం సిద్ధం చేసుకొన్న ప్లాన్ ప్రకారం టైమ్ టేబుల్ తయారుచేసుకోవాలి. వివిధ సబ్జెక్టులకు మనం కేటాయించుకొన్న సమయం ప్రకారం " ప్రిపరేషన్ " ఉండాలి. కష్టమైన సబ్జెక్ట్ అనుకొన్నదాన్ని సాధారణంగా పక్కన పెట్టి తరవాత చదువుదాం అని దాటేస్తుంటారు చాలామంది. కాని అలా వద్దు. ముందు దాని పని పట్టండి. మిగిలిన సబ్జెక్ట్స్ చదవటం నల్లేరు మీద నడకలా ఉంటుంది. చదివేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్ బోర్ అనిపించినపుడు మనసుకు హాయి గొలిపే సంగీతం వినండిమళ్ళీ రీచార్జ్ అవుతారు. ఏడాది అంతా చదివిన దానిని పునశ్చరణ చేయడం , నమూనా ప్రశ్న పత్రాలు ఆన్సర్ చేయడం, సందేహాలు కలినపుడు వెంటనే వచ్చిన వారి దగ్గర నివృత్తి చేసుకోవడం, సమాధానాలను కొన్ని చిట్కాల ద్వారా గుర్తు పెట్టుకోండి. టైమ్ మేనేజ్ మెంట్ తెలుసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి

       విజయానికి చక్కని ప్లానింగ్, ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో దానిని పరీక్షపేపర్ మీద "ప్రజంట్" చేయడం కూడా అంత ముఖ్యమే. చక్కని ప్రజంటేషన్ చేయగలిగితే మంచి మార్కులు మీవే. ముందు నుంచీ చక్కని దస్తూరీ అలవాటు చేసుకోవాలి. పరీక్ష పేపర్ లో మార్జిన్స్ గీసుకొని, సమాధానానికి, సమాధానానికీ మధ్య పెన్సిల్ తో గీతలు గీయండి. అక్షరాలు గుండ్రంగా, స్పుటంగా, దూరదూరంగా వ్రాయండి. మన దస్తూరీ పేపర్ దిద్దేవాళ్ళ మనసులను గెలిచేలా ఉండాలి. సాధారణంగా మంచి దస్తూరీ గలవాళ్ళు బాగా చదువుతారనే సదభిప్రాయం ఉంటుంది. బాగా మార్కులు పడతాయి. బాగా వచ్చిన సమాధానాలు ముందు వ్రాయండి. ముఖ్యమైన విషయాలను అండర్ లైన్ చేయండి. సైడ్ హెడ్డింగ్స్ పెట్టి వివరించండి. కొట్టివేతలు, దిద్దుబాట్లు రానివ్వకండి. సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి.
విజయం మీదే. " ఆల్ బెస్ట్ " .


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం