పంచేంద్రియాల బందిఖానా

       మానవుడి దేహం పంచభూతాత్మకం. పంచేంద్రియ సహితమైన దేహం పంచేంద్రియాలకే లోబడి యుండి రకరకాల ప్రలోభాలకు లొంగుతూ ఉంటుంది. మానవుడు తన విచక్షణా జ్ఞానాన్ని వినియోగించి పంచేంద్రియాల మాయలో పడకుండా తప్పించుకోగలిగితే మనిషి మహనీయుడే. పంచేంద్రియాల మాయ ఎలా ఉంటుందో " వివేక చూడామణి" లో వివరించారు. ఒకసారి మనం పరిశీలిద్దాం.
       శబ్ద, రూప, రస, స్పర్శ, గంధాలకు వశమై జీవులు ఎలా ప్రాణాలు కోల్పోతున్నాయో చూడండి.
       జింకలు అడవిలో తిరుగుతూ ఉండగా వేటగాడు ఊదుతున్న వేణునాదం విని శబ్దానికివశమై అలా అలా వచ్చి వేటగాడికి చిక్కుతుంది.
       మిడుతలు చీకటిలో మండుతున్న మంటలను చూసి  ’రూపానికిఆకర్షితమై మంటలు ప్రమాదకరం అన్న విషయం తెలియక మంటలలో పడి మాడి మసి అవుతాయి
       మగ ఏనుగులు ఆడఏనుగు యొక్క పొందుతో కలిగే " స్పర్శా సుఖం" కోసం పరితపిస్తూ దానిని వెతుకుతూ దారి చూసుకోక వేటగాడు తయారుచేసిన ఆకులు, కొమ్మలతో కప్పి యున్న గోతిలో పడుచున్నది.
       చేపలు మనం వేయు గేలానికి తగిలించిన ఎర యొక్కరుచికి ఆశ పడి గేలానికి తగులుకొనుచున్నది.
       తేనెటీగలు పువ్వుల యొక్క " గంధానికి" ఆకర్షింపబడి పుష్పంలోనికి దూరి అక్కడ మకరందాన్ని గ్రోలుతూ మైమరచి ఉండిపోతాయి. సాయంసమయానికి పువ్వులు ముడుచుకుపోవటం వలన అందులో బంధింపబడి చనిపోతాయి.

       విధంగా అల్పజీవులు ఏదో ఒక విధమైన పంచేంద్రియ సుఖాలకు ఆశపడి తనువు చాలిస్తుంటే, బుద్దిజీవి అయిన మానవుడు పంచేంద్రియాల బందిఖానా లో బంధింపబడి అన్ని రకాల ఇంద్రియసుఖాలకు అలవాటుపడి భోగలాలసలో కొట్టుకొనిపోతూ తన జీవితంలో ముఖ్యమైనవి కోల్పోతున్నాడు. నిజమైన మోక్షమును పొందే మార్గం బదులు ఇంద్రియసుఖాలకు బానిస అవుతున్నాడు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం