ఐస్ .. ఐస్


ఒంటి పూట బడులు వస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో
 రేకు మూతను డబ... డబ ఆడిస్తూ ఐస్, ఐస్ అంటూ వస్తారు. ఇప్పుడు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ చిన్నపుడు పుల్ల ఐస్ కొనుక్కుని తిన్నవాళ్ళే. ఇపుడు పదులు , వందలు పెట్టి ఐస్ క్రీమ్ లు కొని పిల్లలకు ఇస్తున్నాం కానీ అపుడు ఐస్ ప్రూట్ లు ఐదు పైసలు, పది పైసలే. మామూలు నీళ్ళలో రంగు కలిపి కూల్ చేస్తే ఐస్ ప్రూట్ తయారయేది. స్కూల్ దగ్గర ఇంటర్ వెల్ టైమ్ లోనూ, స్కూల్ వదిలే సమయానికి గేట్ దగ్గర ఒకరిద్దరు ఐస్ అమ్మేవాళ్ళు ఉండే వారు. మమూలుగా ఉండేవి ఐదు పైసలే. పాల ఐస్ పది పైసలు.

ఒకో దాని మీద సేమియా, కొబ్బరి వేసేవారు. తెల్ల ఐస్ మీద రెండు, మూడు రంగులు వేసి ఇచ్చేవారు. ఒక్కడు అయితే రెండు ఐసులను కలిపి ప్లాస్టిక్ కాగితంలో చుట్టి చెక్కతో కొట్టి ఉండలా చుట్టి , పుల్ల గుచ్చి ఇచ్చే వాడు. ఏమైనా పుల్ల ఐస్ రుచే వేరు.
       బాగా చదివేవాడిని కదా! పరీక్షలలో సాయం చేస్తానని నాకు ఇంచుమించు రోజూ ఎవడో ఒకడు ఐస్ ఇప్పించే వాడు. ఒకోసారి అప్పు అంటే  రోజు ఒకడు ఇప్పిస్తే, మరో రోజు నేను ఇప్పించాలి అలాగైనా పుల్ల ఐస్ తినేయాలి అంతే. ఎవడు ఇప్పించక పోతే ఐస్ బండి వాడే అరువు ఇచ్చేవాడు మరి రెగ్యులర్ గా కొనేవాళ్ళం కదా. ఇపుడు ఐస్ క్రీం బండి శబ్దం విన్నపుడు నాకు చిన్నప్పటి ఐస్ ఫ్రూట్ వాళ్ళే గుర్తొస్తారు. మీరూ తిన్నారా పుల్ల ఐస్ ఫ్రూట్  ?
  ఇంకొకటి గుర్తొస్తోంది.  

కలర్ సోడా...
చిన్నపుడు వేసవి కాలంలో ఎక్కువ కొనేవి కలర్ సోడాలు, డ్రింక్ లు. ప్రతీ స్కూల్ దగ్గర తప్పకుండా ఉండే అమ్మకం వాళ్ళలో వీరొకరు.

తోపుడు బండి మీద అంచు చుట్టు రెండు చెక్కలతో కట్టిన నిలువువరుసల మధ్యన వరసగా రంగు రంగుల కలర్ సోడాలు ఉండేవి

అప్పట్లో అవే పెద్ద సాఫ్ట్ డ్రింక్స్ మాకు . అన్నీ రంగు నీళ్ళే , అందులో ఏవో ఎసన్స్ కలిపే వారు. ఒక సీసాలో సబ్జా గింజలు నానబెట్టి అవి కలిపి, ఐస్ ముక్కని పరపరా రజనులా చెక్కి ముక్కలను గాజు గ్లాసులో వేసి కలర్ వేసి , నీళ్ళు పోసి నిమ్మకాయ పిండేవాడు. అపుడు సబ్జా గింజల నీళ్ళు పోసేవాడు అంతే కలర్ డ్రింక్ రెడీ. అవి తాగటానికి మేమూ రెడీనే


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం