మూడో కన్ను

      

  " మూడోకంటికి తెలియకుండా చేయాలి" అని మనం ఏదైనా రహస్యంగా చేయాలి , ఎవరికీ తెలియకుండా అన్నపుడు వాడుతూ ఉంటాము కాని రోజుల్లో మూడోకంటికి తెలియకుండా ఏదీ చేయలేము అనిపిస్తుంది. పార్క్ కి వెళ్ళినా పార్లమెంట్ కి వెళ్ళినా మనం తప్పించుకోలేని "మూడో కళ్ళు" వాడకం ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. అదేనండీ సి.సి. కెమెరాలు . మొదట్లో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లో దొంగతనాల నివారణ కోసం వాడేవారు. ఖరీదైన సెంట్ బాటిల్స్, చిన్న చిన్న వస్తువులు ఎవరికీ తెలియకుండా జేబులో వేసుకుపోయే వారుంటారని. నెమ్మదిగా అది విశ్వవ్యాప్తమయింది. సినిమా హాల్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ప్రముఖ కూడళ్ళు, హాస్పిటల్స్ చివరికి చిన్నచిన్న కిరాణా షాపులకు కూడా ఇప్పుడు స్పై కెమెరాలు అమర్చు కొంటున్నారు. భద్రతకోసం చాలా మంది ఇళ్ళల్లో కూడా అమర్చుతున్నారు. భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళవలసిన వారు ఇంటి భద్రత కోసం వీటిని వాడుతున్నారు. ఇంట్లో చిన్నపిల్లలని ఆయాలకి అప్పచెప్పి వెళ్ళేవారు కూడా వీటిని ఆశ్రయిస్తున్నారు. ఆయా తమ పిల్లలను ఎలా చూసుకొంటోందో గమనించవచ్చని. ఇంట్లో కెమెరాలు పెట్టి మనం ఎక్కడినుంచి అయినా సరే చూడగలిగే సదుపాయం కూడా ఉంది.
       పెద్దపెద్ద నగరాలలో ప్రధాన రహదారులలో, కూడళ్ళలో వీటిని అమర్చడం ద్వారా రోడ్డుపై వెళ్ళే అందర్నీ కంట్రోల్ రూమ్ నుంచి గమనించే అవకాశం కలుగుతోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని, మితిమీరిన వేగంతో వెళ్ళేవారిని, సిగ్నల్స్ జంప్ చేసేవారిని గమనించి వారి వాహనం నెంబర్ ఆధారంగా ఇంటికి ఛలాన్ లు పంపుతున్నారు కూడా. అదే కాదు ఏదైనా గొడవలు జరిగినపుడు కారకులను గుర్తించవచ్చును . హైదరాబాద్ బాంబు పేలుళ్ళ కేసు పురోగతి సాధించడానికి మూడోకన్ను చాలా సాయం చేసింది. సి.సి. కెమెరాలలోని పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు.
       అనేక ఆఫీస్ ల్లో ఉద్యోగుల కాబిన్స్ లో ఇవి అమర్చడం ద్వారా వారి పని తీరుపై కన్ను వేసి ఉంచుతున్నారు. మధ్యన కొన్ని స్కూళ్ళలో తరగతి గదుల్లో కూడా వీటిని అమరుస్తున్నారు. చివరికి అందరినీ కాపాడే దేవదేవుని ఆలయాలలో కూడా అడుగడుగునా నిఘానేత్రాలే. గర్భ గుడిలో సైతం వీటిని అమరుస్తున్నారు.
       వీటి వలన ఉపయోగాలు ఉన్నపటికీ కొన్ని అసౌకర్యాలు కూడా ఉంటాయి. మన ఎక్కడికి వెళ్ళినా , ఏం చేసినా మనలను ఎవరో గమనిస్తున్నారు అన్న భావన మనలో ఫ్రీ నెస్ ని పోగొట్టుతుంది. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కూడా. దీనిని దుర్వినియోగం చేసేవారు తయారయారు కూడా. హోటల్ రూమ్స్, బట్టలషాపుల్లో ట్రయల్ రూమ్స్, బాత్రూమ్స్ లోపల వీటిని ఉంచి దృశ్యాలను చిత్రీకరించే అవకాశాలు కూడా వున్నాయి. అందుకే మూడో కన్నుతో బహుపరాక్.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం