మీకుందా ఇ.క్యూ ?


        సాధారణంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నపుడు కాని పోటీ పరీక్షలలో గాని మన యొక్క . క్యూ ( ఇంటెలిజెన్స్ కోషంట్) ను పరీక్షిస్తారు. మన తెలివితేటలు, చదువు, సృజనాత్మక శక్తి, జ్ఞాపకశక్తి, కష్టపడే స్వభావం, అందరినీ కలుపుకుపోగల తత్వం, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ అర్హతలుగా చూస్తారు. అయితే వీటన్నిటికీ మించి రోజుల్లో అందరికీ కావలసినదీ, తప్పక ఉండవలసినదీ మరొకటుంది. అదే . క్యూ ( ఎమోషనల్ కోషంట్) . అదేనండీ ఉద్వేగ ప్రజ్ఞ .

       కోపం, భయం, సంతోషం, దుఃఖం, ఆశ్చర్యం, ప్రేమ .... ఇలా మనలో అనేక రకాల భావాలు కలుగుతుంటాయి. ఇవి ఇతరులతో మనకు గల సంబంధాలతో ఏర్పడే అతి సహజమైన ప్రతిస్పందనలు. అందరిలో మామూలుగా కలిగేవే ఇవన్నీ . కాని సాధారణాన్ని మించి భావోద్వేగాలు ఉన్నాయనుకోండి అది ప్రమాదమే. అంటే సంతోషం వస్తే పట్టలేరు. కోపం వస్తే తాళలేరు. మన పురాణాలను చూడండి. పరమశివుడు భక్తులు ఎవరైనా ఎలాటి వారైనా సరే ఎక్కువుగా భక్తిని ప్రదర్శిస్తే కరిగిపోతాడు. తగని కోరికలైనా వరాలుగా ఇచ్చేస్తాడు. తరువాత రాబోయే పరిణామాలను ఏమాత్రం ఆలోచించడు. బోళాశంకరునిగా పేరు పొందాడు. అంతే కాదు కోపం వచ్చినా తాళలేడు. ఆగ్రహావేశాలతో ఊగిపోతాడు. మూడోకన్ను తెరుస్తాడు. భస్మం చేసేస్తాడు. మనకు అదీ మంచిది కాదు. ఇదీ మంచిది కాదు.

       భావోద్వేగమైనా తీవ్రత పెరిగితే కష్టమే. వాటిని నియంత్రించుకో లేకపోతే ఎదురయ్యేది నష్టమే. మనకు మితిమీరిన ప్రేమ కలిగితే దాని నుంచి అది పొందలేక పోతే ఏర్పడేది ద్వేషమే. అలాగే ఎక్కువైన భయం లోంచి ఆత్మన్యూనతా భావం, అభద్రతా భావం ఏర్పడతాయి. కోపం నుంచి అసూయ,ద్వేషం పుడతాయి. ఆశ పెరిగినపుడు అది దురాశ, లేదా నిరాశగా మార్పు చెందుతుంది. అవధులు లేని ఆనందం కూడా ప్రమాదమే అది అహంభావానికి దారి తీస్తుంది. అంతే కాక మన స్థాయికి మించిన వాగ్దానాలకు దారి తీస్తుంది.  ( అనుకోని బోనస్ వచ్చిందనుకోండి, మామూలు చీర బదులు పట్టుచీర కొంటామని భార్యలకు మాటిచ్చేస్తారన్నమాట).
       దుఃఖం ఎక్కువైతే అది నిస్పృహ, ఆత్మన్యూనతాభావాలకు దారితీస్తుంది. ఆత్మహత్యలకూ, హత్యలకూ అదే కారణం అవుతూ ఉంటుంది. చాలామందిని చూడండి కోపంవస్తే రెచ్చిపోతారు. సంతోషం కలగగానే హడావిడి చేసేస్తారు. బాధ కలిగిందంటే వారున్న పరిస్థితి ఏవీ గమనించక బోరున ఏడ్చేస్తారు. అలా కాకుండా మనలో కలిగే భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి. అనేక రకాల ఉద్వేగాలు ఏర్పడినా వాటిని వ్యక్తపరచే విధానాన్ని నియంత్రించుకోగలగాలి. వాటిని సరి అయిన సమయంలో, సరి అయిన మార్గంలో వ్యక్తం చేయాలి. అదే మనలో ఉన్న, మనకి ఉండవలసిన ఉద్వేగ ప్రజ్ఞ.

       మనలో ఉన్న ఉద్వేగాలను మనం గుర్తించాలి. మన బలాలు ఏమిటో, మన బలహీనతలు ఏమిటో గమనించాలి. భావోద్వేగాలను వ్యక్తపరచేముందు వాటి ఫలితాన్ని కూడా ఊహించాలి. అలా చేయకపోవడం వలనే భార్యాభర్తలు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములుకార్యాలయంలో తోటి ఉద్యోగులు, మన ఇంటి ఇరుగుపొరుగులు, ఇలా అందరితో మన సంబంధాలు దెబ్బతింటాయి. అందరిలో మనలను ఏకాకిని చేస్తాయి. ఆవేశపరుడు, అసూయాపరుడు, కోపిష్టివాడు, బలహీన మనస్కుడు గా ముద్రలు వేయిస్తాయి. అంతే కాదు మన శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యమూ కూడా దెబ్బతింటాయి. మానవ సంబంధాలు పాడవుతాయి. కొంతమంది తాగుడు మొదలయిన దురలవాట్లకు బానిస అవుతారు కూడా. మనకు వచ్చే అనేక వృత్తి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలను కోల్పోతాము.
       అందుకే మనకందరికీ కావాలి భావోద్వేగ ప్రజ్ఞ ( .క్యూ).


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం