టామ్ & జెర్రీ



ఒక వారం రోజులనుంచి నిద్ర పట్టడం లేదు సరిగా. అబ్బే ఉక్కపోత అదీ కాదండీ. మా ఇంట్లోకి ఎలా చేరిందో కాని ఒక ఎలుక పిల్ల చేరిందండీ బాబూ! ఇంక దానితో నాకు సమస్యలు మొదలయ్యాయి. ఒకసారి పుస్తకాల అలమారులో చేరి శబ్దం చేయడం, మరోసారి ఫ్రిజ్ పైకి ఎక్కి తొంగిచూడటం , డైనింగ్ టేబుల్ మీద ఏమైనా వదిలేసినవి తిని పాడు చేయడంతో దాని లీలలు బయటపడ్డాయి

మొదట్లో అంత పట్టించుకోలేదు దాన్ని మేము. దాని ఆగడాలు అంతకంతకు మించి పోతున్నాయి. ఒకరోజు మా అమ్మాయి అమెరికన్ టూరిస్టర్ బాగ్ కి కన్నం, మరో రోజు మా శ్రీమతి హేండ్ బేగ్ కి కన్నం అలా మొదలయింది. ఇల్లంతా బాగా పరిచయం అయిపోయిందేమో ఇంక చూడండి. ఇక్కడ అక్కడ అని లేదు ఇల్లంతా దాని ఇష్టారాజ్యమే. బట్టలు కొట్టేయడం మొదలుపెట్టింది. అందరూ ఉండగానే దైర్యంగా తిరగటం మొదలయింది. చూసి మాకు ఇంక సీరియస్ గా తీసుకోవాలని అర్ధం అయింది.

       బ్లూక్రాస్ వాళ్ళు ఏమన్నా అననీ గాని దాని అంతు చూడకపోతే మా పని పట్టేసేటట్టు ఉంది దీని వాలకం చూస్తే అనిపించింది. ఇంక దాని వేట మొదలుపెట్టాము. ఎవరో ఎలుకల మందు పెట్టమంటే అది తెచ్చి మంచి ఉల్లిపాయ బజ్జీలు రెండు తెచ్చి దానిలో పెట్టాము ఒక రాత్రి. ఉదయానికి బజ్జీ మాయం. అహహ .. అనుకొని నేను లాప్ టాప్ లో ఏదో పని చేసుకొంటుంటే అది ఎదురుగా టీపాయ్ మీద కెక్కి చూడటం, సోఫా వెనకాల అంచుల మీద పరుగులు తీస్తూ, కిటికీ ఎక్కడం ఇలా రకరకాల విన్యాసాలు చేస్తుండటం చేస్తోంది. నాకు షాక్ ఇదేమిటీ బజ్జీ తిని కూడా ఎలా బతికింది అని. ఇంతలో నా ఎదురుగానే అది నా పుస్తకాల అలమరాలోకి దూరటం చూసాను. వెంటనే లేచి అలమారకున్న కన్నాన్ని కాగితాలు కుక్కి , దానిపై టేప్ వేసేసి నెమ్మదిగా అలమర తలుపు తెరిచాను. అది అలికిడికి పుస్తకాల వెనక్కి నక్కింది. వెంటనే నేను పుస్తకాలను బలంగా నొక్కి దాన్ని ఎలాగైనా చంపాలని చూస్తూండగా అది మూల నుంచో చటుక్కున బయటకు వచ్చి నా చేతిమీదుగా ఎక్కి, బుజాలపైనుంచి దిగి వేగంగా సోఫా వెనక్కు పోయి మాయమయింది. మరోసారి పడక కుర్చీ మీద కెక్కి ఠీవిగా చూస్తూ ఉంటే నన్ను చూచి గర్వంగా నవ్వినట్లు అనిపించింది.

       మరొకరు టి.వి లో యాడ్ లో చూపించిన దేదో బాగా పనిచేస్తోంది పెట్టి చూడండి అన్నారు. సరే అదేదో చూద్దామని షాప్ లో అడిగితే వాడు కూడా అబ్బే ఇది ఎందులోనూ కలపక్కరలేదండి దీన్ని ఎలుక తింటుంది, తరవాత ఎలుకను ఇది తింటుంది అన్నాడు. సరే అని కొని అయిదు ముక్కలు అయిదుచోట్ల పెట్టాను. ఎక్కడా నీళ్ళు, ద్రవ పదార్దాలు అందుబాటులో లేకుండా చూసాను . అర్ధరాత్రి మెలకువ వచ్చి చూస్తే అయిదు ముక్కలు మాయం అయాయి. ఒహో ఇదేదో బాగుంది. ఎలుక చచ్చినట్లే అనుకుంటూ అంతా వెతికా ఎక్కడా కనపడలేదు. సరే పడుకుని ఉదయాన్నే మళ్ళీ వెతికా అబ్బే ఎక్కడా జాడ లేదు. మామూలుగా నా బ్లాగ్ పని చూసుకొంటుంటే, అలికిడికి తలెత్తి చూస్తే విజయ గర్వంతో చూస్తూ ఎదురుగా ఎలుక. నాకు ఈగ సినిమా లో ఈగ చేసిన డాన్స్ గుర్తుకు వచ్చింది.

       కాని మళ్ళీ రోజంతా ఎక్కడా ఎలుక జాడ తెలియలేదు. మర్నాడు ఉదయాన్నే సోఫా కింద చచ్చి పడున్న ఎలుక కనిపించింది. నేను ఆనందంతో డాన్స్ చేయడం ఒక్కటే తక్కువ. పూర్వం పులిని, సింహాన్ని చంపిన వీరులు దానితో ఎలా ఫోటో తీయించుకొనేవారో అలా నేను కూడా ఫోటో తీసుకున్నాను. ఇదండీ మా ఇంట్లో జరిగిన టామ్ & జెర్రీ కధ.





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం