కుంచం అంత కూతురుంటే .......


కుంచం అంత కూతురుంటే మంచం మీదే కూడు అంటారు. అంటే అన్ని పనులు చేసి పెడుతుంది అని. నిజమే పాపం మా అమ్మాయి మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉంటే వేడి వేడిగా టీ పెట్టి ఇస్తుంది. ఒకో సారి సేమియా ఉప్మానో చేసి ఉంచుతుంది కూడాను. కూతురు పెరిగితే గుడ్డకు లోటు, కొడుకు పెరిగితే కూడుకు లోటు అని కూడా అంటారు. అంటే కూతురు పెద్దదైతే అమ్మా నీది చీర బాగుందే, చీర బాగుందే అని పట్టుకు పోతుంది అని. అదే కొడుకు పెద్దయితే కోడలు వచ్చి అన్నం పెట్టదని . ఇవన్నీ పూర్వం చెప్పిన మాటలు లెండి. మా అబ్బాయి మాత్రం నాకు కుడి చేయి లాటి వాడు ఎక్కడికెళ్ళాలన్నా హాయిగా కారులో తనే డ్రైవ్ చేసుకొని తీసుకొని వెళతాడు. వాడు ఊర్లో ఉన్నపుడు నేను కారు తీయనక్కరలేదు. రోజు అన్నవరం వెళ్ళాము. హాయిగా ఇంటి దగ్గర కారు ఎక్కితే మళ్ళీ ఇంటికి వచ్చేవరకు వాడే డ్రైవింగ్ . మరి వెళ్ళి వచ్చిన వివరాలు మీకు చెప్పేవరకు నాకు తోచదు కదా!   వివరాలలోకి వెళ్దామా మరితెల్లవారుతుండగా బయలుదేరాము.
సినిమా హాల్ స్ట్రీట్ లో ఉన్న సి.ఎన్.జి బంక్ కి వెళ్ళి  టాంక్ ఫుల్ చేయించుకొని బయలుదేరాము. ఒక గంటలోపే అన్నవరం తీసుకువెళ్ళిపోయాడు.

అదుగో అన్నవరం వచ్చేసాము . కొండ మీదకు ఒక దారి , దిగడానికి ఒక దారి. అదుగో కొండపైకి వెళ్ళే దారి ఇది. పదండి.
అదుగో ముఖద్వారం.


 పంపానదిలో నీళ్ళు ఎండి పోయాయి చూడండి.


కంగారు పడకండి మా అబ్బాయి స్టీరింగ్ పట్టుకొంటే జల్సా సినిమాలో గాల్లో తేలినట్లుందే పాట పాడుకోవడమే. అదుగో కొండమీదికి వచ్చేసాము. ప్రకాష్ సదన్ ఎదురుగా పార్క్ చేసాము. అదే మా కొత్త కారు.


 ప్రకాష్ సదన్ గుర్తుందా నువ్వే నువ్వే సినిమాలో తరుణ్ శ్రేయ కోసం వెతుకుతూ అన్నవరం వచ్చి నిద్దురపోతున్న రాతిరి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా పాటను ఇక్కడే చిత్రీకరించారు.


అదుగో గుడి వెనుక భాగం , ముందుకు వెళ్ళాం. అదుగో రాజగోపురం

దర్శనం త్వరగానే అయింది. గుడి లోపల లైన్ ని నియంత్రించే ఒకతను చెప్పాడు. వందరూపాయల టికట్టు కొనుక్కోండి త్వరగా దర్శనం అవుతుంది, అంతరాలయ దర్శనం చేసుకోవచ్చును అని. నేను ఇలా చెప్పకూడదు గాని ఎలా అయినా మీ డబ్బులు దేవుడికే వెళతాయి కదండీ అన్నాడు. సరే నని అలాగే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. బయటికి వచ్చాము.




 అదుగో గోకులం అక్కడ సుమారు పది ఆవులు వరకు పెంచుతున్నారు. రెండు రూపాయలకు ఒక చిన్న కట్ట చొప్పున గడ్డి అమ్ముతున్నారు. కొని ఆవులన్నింటికీ వేశాము. అదుగో మధ్యలో గోపాలుడు.

అది చూసుకొని పక్కనే ఉన్న ఫలభాయంత్రం చూసాము.




 అది సూర్యుని కాంతి ఆధారంగా నీడతో పనిచేసే గడియారం. నెలలో రోజు ఎంత సమయాన్ని కలుపుకోవాలి, ఎంత సమయాన్ని తీసేయాలి పక్కన టేబుల్ వేసి ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొంటే కరెక్ట్ సమయాన్ని చూపిస్తుంది. పూర్వం ఇలాటి నీడ గడియారమే ఆధారం సమయాన్ని తెలుసుకోడానికి. ప్రసాదాలుకొనుక్కొని తిన్నాము. మీకు పెట్టలేను కాని చూపెట్టగలను.

కళ్ళకద్దుకోండి. తిన్నట్లే.

 తిరిగి బయలు దేరాం. దిగేటప్పుడు వేరే దారి.

 ఎలక్షన్స్ కోసమేమో కాకినాడ ఎంట్రన్స్ లో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడూ కూడా కార్లు ఆపి డిక్కీ ఓపెన్ చేసి చెక్ చేసారు. ఇంటికి వచ్చేసాము. ముందుగా చెప్పినట్లుగానే మా కుంచం అంత కూతురు మాతో రాలేదు కాబట్టి వేడి వేడిగా వండి వుంచింది. హాయిగా భోజనం చేసాము. ఇది చదవగానే మీకు ఆవు వ్యాసం గుర్తుకు వచ్చిందా?





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం