మన 'ఘన' దేశం


ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను చూసి వ్రాస్తున్నా. మన దేశ 
జనాభా సుమారు నూట పది కోట్లు దాటింది. కాని మన దేశం నుంచి ఒలింపిక్స్ లో పతకాలు సాధించే వారెందరు, నోబెల్ బహుమతులు సాధించిన శాస్త్రవేత్తలు ఎందరు, అని చాలామంది బాధ పడుతుంటారు. మన దేశంలోనూ గుర్తించదగిన పరిశోధనలు చేసే సంస్థలు, శాస్త్రవేత్తలు ఉన్నారు. కాని ఇంకా సాధించాల్సిన మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయి. పరిశోధించాల్సిన అంశాలు ఉన్నాయి. నిజానికి మన దేశం గతమెంతో ఘనకీర్తి కలిగినది. మరి గతాన్ని మర్చిపోకుండా, వర్తమానంలో తగిన కృషి చేస్తే భవిష్యత్తు మనదే. ఒకసారి వెనక్కి చూస్తే ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలచిన రంగాలెన్నో.



       తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలలో వేలమంది విద్యార్ధులు దేశ విదేశాలనుంచి వచ్చి చదువుకొన్నారు. అశోకుడు విద్యాభ్యాసం చేసింది తక్షశిల విశ్వవిద్యాలయంలోనే. అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు ఇక్కడే ఆర్ధికశాస్త్ర విభాగ అధిపతిగా పనిచేసారు. గురుకుల విద్యావిధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మనమే . మన దేశంలో రాజులయినా, సామాన్యుడైనా గురువుల వద్ద ఉంటూ , వారు పెట్టింది తింటూ విద్యాభ్యాసం చేయవలసినదే.



       నలంద విశ్వ విద్యాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినది, ప్రపంచంలోనే మొట్టమొదటిదీనూ. ఇక్కడ మనదేశం వారే గాక చైనా, ఇరాన్, ఇరాక్, టిబెట్ మొదలైన విదేశాలనుంచి కూడా విద్యార్జనకు వచ్చేవారు.

       మన దేశ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉండేది. చక్కని పనితనంతో, పలుచని, తేలికైన దుస్తులు మన చేనేత పనివారు నేసేవారు. విదేశాలలో రాజులందరూ వాటినే ధరించేవారు. మన దేశ వ్యాపారులు అవి తీసుకొనే ఇతర దేశాలకు వెళ్ళేవారు వ్యాపారనిమిత్తం.

మన దేశం మణి మాణిక్యాలకు, వజ్ర వైడూర్యాలకు పెట్టింది పేరు. పేరు పొందిన వజ్రాలెన్నో మనదేశంలో దొరికినవే, మన దేశ పనివారిచే సానపెట్టబడినవే. ఉదాహరణకు కోహినూర్ చాలదా? .

       భూమి గుండ్రంగా ఉందని, సూర్యుని చుట్టూ తిరుగుతుందనీ ఆర్యభట్ట ఎప్పుడో చెప్పారు. గ్రహణాలు, రాహుకేతువులవల్ల కాదని సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైన ఉన్నపుడు సంభవిస్తాయని కూడా ఆయన చెప్పారు. ’ పైవిలువ  3.1416 గా  క్రీ. ఆరో శతాబ్దంలోనే ఆయన నిర్దారించారుఅసలు సున్నా అనే భావనను పరిచయం చేసింది మన భారతీయులే. సున్నా లేనిదే రోజు కంప్యూటర్స్ ఉన్నాయా? సున్నా అనేది మన దేశం నుంచి అరబ్ వ్యాపారుల ద్వారా పశ్చిమదేశాలకు తెలిసింది.


వైద్యశాస్త్రంలో సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు మన ఆయుర్వేదమే. సహజమైన మొక్కల వేర్లు, బెరడు, ఆకులు, గింజలు మొదలైన వాటితో చేసే వైద్యమే ఆయుర్వేదం. మన దేశ వైద్యులు ఇందులో ప్రసిద్ధి గాంచినవారు

చరకుడు ఎన్నో వేల సంవత్సరాల మునుపే అన్ని రకాల జబ్బులకు తగిన వైద్యాన్ని చేసేవాడు. ఆయన తన చరకసంహితలో అనేక రకాల రోగాలకు తగిన నివారణోపాయాలను విశదపరచాడు.

        ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో మొదటి సారిగా శస్త్రచికిత్సలు చేసింది మన దేశ ప్రముఖ వైద్యుడు శుశ్రుతుడే. వివిధ రకాల అవయవాలకు శస్త్రచికిత్స చేసే విధానాన్ని ఆయన తన శుశ్రుత సంహిత లో వివరించాడు.


అంతే కాదు ఆయన స్వయంగా శస్త్రచికిత్సా పరికరాలను తయారుచేసుకొన్నాడు కూడా. ఇవి ఆయన తయారు చేసుకొన్న పరికరాలు 

.    ప్రపంచంలో ప్రస్తుతం మంచి ఆదరణ పొందినది మరొకటి ఉంది. అదే మన యోగ . యోగ కూడా రకరకాల పేర్లతో పిలవబడుతూ ఉన్నా అన్నరకాల యోగ విధానాలకూ మూలం మన పతంజలి మహర్షి రచించిన యోగశాస్త్రమే కదా! రకరకాల శారీరక, మానసిక రుగ్మతలకు యోగాను మంచి చికిత్సగా భావించేవారెందరో ప్రపంచవ్యాప్తంగా.

       మన మేధస్సుకు పదును పెట్టే క్రీడలలో చదరంగానిదే అగ్రతాంబూలం. మరి చతురంగ బలాలతో రాజు, మంత్రి నడపే యుద్ధతంత్రమే చదరంగం దీని పుట్టిల్లు మనదేశం కాదా? ఒకరిని మించి మరొకరు ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ సాగే క్రీడను మించినది ఏదీ లేదు.


మనిషికి ఆహార,నిద్రా,మైధునాలు అత్యంతావశ్యకాలు, సహజ క్రియలు . మరి అటువంటి శృంగారానికి పెద్దపీట వేసారు మన ఋషులు అందుకే అదొక శాస్త్రంగా గుర్తించారు. అదొక పవిత్రకార్యంగా ఉండాలనే దేవాలయాల గోడలపై చిత్రాలుగా వేయించారు. వాత్సాయనుడు దానికి బాగా గుర్తింపును తీసుకువచ్చాడు. ఆయన రెండో శతాబ్దంలోనే రచించిన వాత్సాయన కామసూత్రాలు నేటికీ ప్రజాదరణ పొందుతున్నాయి, ప్రపంచంలోని ముఖ్యభాషలన్నింటిలోనికీ అనువదింపబడ్డాయి. అనేక భాషలలో సినిమాలగా కూడా తీయబడ్డాయి.
       మన దేశ వారసత్వసంపద ఎంతో ఉంది. దాన్ని కాపాడుతూ, ఇంకా ఇనుమడింపచేసేలా మనందరం కృషి చేయాలి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం