మౌనమేలనోయి (పెద్దలకు మాత్రమే )



మౌనమేలనోయి అని మీరడిగితే ఏమని చెప్పను. కొన్నిసార్లు మౌనంగా ఉండటం మంచిదని మా గురువుగారు చెప్పేవారు. ఆయనెవరు అంటారా! అదేనండీ తొలి తెలుగు ప్రధానమంత్రి శ్రీ పి. వి. నరసింహరావు గారు. ఆయన ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులలో కూడా చలించేవారు కాదు. కొన్ని కొన్ని విషయాలలో ఏమీ నిర్ణయం తీసుకోకుండా ఉంటే పత్రికల వాళ్ళు అడిగితే విషయంలో నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించు కొన్నాను అనేవారట. అదే పద్ధతిని నేనూ పాటిస్తా. ఇంతకీ ఏమి జరిగిందో చూడండి.
        తెల్లవారుఝామున లేచి చడి చప్పుడు కాకుండా మంచం దిగాను. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. నా భార్య, పిల్లలు అందరూ నిద్రావస్థే. నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ హాల్ లోకి వచ్చి , సోఫాలోకి చూస్తే   ’తను’  అక్కడే ఉంది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాను. పైనున్న వస్త్రాన్ని తొలగించి తదేకంగా చూస్తూ నిలుచున్నా. సోఫాలో కూర్చుని ’ తనని’  ఒళ్ళో చేర్చుకొని చేతులతో మృదువుగా రాస్తూ ఆనందాన్ని అనుభవించాను. నాలో ఎన్నాళ్ళగానో  'తనపై'  ఉన్నకోరిక ఇప్పటికి తీరిందని ఆనందించాను. ఎప్పటినుంచో పెంచుకున్నా' తనపై'  వ్యామోహాన్ని. అటూ ఇటూ చూసి ముద్దు పెట్టుకున్నాను. హృదయానికి హత్తుకున్నాను. ఇలాతనతోమౌనంగా ఊసులాడుతుంటే ఇంతలో ఎప్పుడు లేచి వచ్చిందో నా భార్య ఎదురుగా నుంచుంది. ఏమిటి ? అంత ముద్దు వచ్చేస్తోందా ఉదయాన్నే దాన్ని హత్తుకుని కూర్చున్నారు. లేచి బ్రష్ చేస్తే కాఫీ ఇస్తాను తాగండి. అయినా ఇరవైనాలుగు గంటలూ ఇంక దానితోనేనా గడపటం. కట్టుకున్న ఇల్లాలిని నేనొకదాన్ని ఉన్నానని గుర్తుందా? ఇంట్లో సహాయం చేసేదేమీ లేదా ఆదివారం కదా కాస్త బజారుకు వెళ్ళి కూరలూ అవీ తేరా? అలా దాన్ని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ రేపు స్కూల్ కి కేరేజ్ లోకి కూరలెవడు తెస్తాడు. అంటూ ఏకధాటిన సణుగుతుంటే మౌనంగా ఉండిపోయా, మా గురువు గారిని గుర్తుకు తెచ్చుకొని . ఇంక తప్పదనుకొని అప్పటిదాకా ఎంతో అపురూపంగా చూసుకొంటున్న , ఎన్నాళ్ళగానో కొనాలనుకొంటూ ఎట్టకేలకు నిన్ననే కొనుక్కున్న నా కొత్త లాప్ టాప్ ని టీపాయ్ మీద పెట్టి మళ్ళీ గుడ్డకప్పేసా . దుమ్ము పడుతుందని.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం