కాకాయణం


కాకాయణం అంటే కాకా పట్టడం గురించి చెపుతాను అనుకొంటున్నారా? కాదు కాకుల గురించి కాసేపు చెప్పుకుందాం. మధ్యన అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పిచుకలు, రాబందులతో పాటు కాకులు కూడా చేరుతున్నాయి. కాకులను పాపం అపశకునంగా భావిస్తారు చాలామంది, కాని కాకులు మనకు చేసే ఉపకారం ఎక్కువే. అవి మనం పారేసే ఆహారవ్యర్ధాలను తిని బతుకుతాయి. విధంగా పరిసరాలను శుభ్రం చేస్తాయి. అంతే కాదు పైరు పంటల మీద మొక్కలను ఆశించే పురుగులను తిని మనకు మేలు చేస్తాయి. కాకి శనీశ్వరుని వాహనం అంటారు. కాకులను మన పితృదేవతలుగా కొందరు భావిస్తారు.

  ఒక కాకి చనిపోతే వంద కాకులు వస్తాయి. దాని చుట్టూ చేరి అరుస్తూ సంతాపాన్ని ప్రకటిస్తాయి. అందుకే  కాకులను ఐకమత్యానికి ప్రతీకగా చెప్పవచ్చును. ఎంతో గొప్పవాళ్ళం అని భావించే మనం కూడా ఐకమత్యాన్ని చూపము. బాగా దట్టంగా ఉన్నదని చెప్పడానికి కాకులు దూరని కారడవి అంటారు. కాకులు "కావ్..కావ్" మని అరుస్తే చుట్టాలు వస్తారని అంటారు. ఇంతకీ కాకులు లోకంలో భార్య, పుత్రులు,చుట్టాలు, భోగభాగ్యాలు ఏవీ నీవి కావు.. కావు అని మనకు చెప్తున్నాయని  పెద్దాయన చెప్పారు. పిసినారుల గురించి చెప్తూ వాళ్ళు ఎంగిలి చేత్తో కాకులను కూడా తోలరు అంటారు. చిన్న చిన్న వాళ్ళ దగ్గర దోచి పెద్దవాళ్ళకు పెట్టేవాళ్ళనుకాకులను కొట్టి గద్దలకు వేశారుఅంటారు. పెద్దల పట్ల వినయాన్ని చూపటానికికాకితో కబురు పంపితే వస్తాను " అంటారు. మేము స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తుంటే కాకిగోల చేయకండి అంటాము
కోకిల తన గుడ్లను కాకి గూటిలో పెట్టి వదలివేస్తుంది. కాకి తన గుడ్లతో పాటు కోకిల గుడ్లను కూడా పొదిగి పిల్లలను చేస్తుంది

మా చిన్నపుడు సాయంత్రం కరెంట్ తీగల మీద, ప్రహారీ గోడల మీద చాలా కాకులు వరసగా కూచుంటే మేము దాన్ని "కాకుల బడి " అనేవాళ్ళం.

చింపిరి తలతో ఉన్నవాడిని' కాకి గూడు' లా ఉంది అంటాము. మంచి పేరు తెచ్చుకోవాలని చెపుతూ కాకిలా కలకాలం బతికే బదులు హంస లా ఆరు నెలలు బతికితే చాలు" అంటారు. మా చిన్నపుడు ఆరుబయట సబ్బుబిళ్ళలు, స్పూన్ లు, చిన్నచిన్న నూనె గిన్నెలు అలాంటివి వదిలేస్తే కాకులు ఎత్తుకుపోయేవి. పక్క ఇంటిలోనో ఎక్కడో దొరకడం కూడా అప్పుడప్పుడు జరిగేది. అలా మన ఇంట్లోకి కూడా కొన్ని వస్తువులు చేరేవి. పాపం అవి గూడు కట్టుకోడానికి చెట్లు లేకపోవడం వల్ల కాకుల సంతతి తగ్గిపోతోంది. అరణ్యాలను కూడా జనారణ్యాలుగా  మార్చేస్తున్నాము. నేటి కాంక్రీట్ జంగిల్స్ లో అవి మనలేక మనలను ఏమనలేక కనుమరుగవుతున్నాయి.

ఇంతసేపూ నా "కాకి గోల " విన్నందుకు మీకుకా.. కా..’ . కంగారు పడకండి కాకి భాషలో ధాంక్స్ అని అంతే !




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం