హరిదాసు కీర్తనలు
హరిదాసు కీర్తనలు
సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేది హరిదాసు కీర్తనలు కూడా. తెలతెల వారుతూనే , మంచుతెరలు చీల్చుకొంటూ నును వెచ్చని సూర్యకిరణాలు సుతారంగా తాకుతుండగా "హరిలో రంగ హరి " అంటూ హరినామ స్మరణతో వచ్చే హరిదాసులు గుర్తుకు రాక తప్పరు. పట్టుపంచె కట్టుకొని, ఉత్తరీయం కప్పుకొని, కాళ్ళకు ఘల్లు ఘల్లున గజ్జెల రవాలతో, నుదుట వైష్ణవ నామాలతో, నెత్తిన శుభ్రంగా మిలమిలలాడేలా నున్నగా తోమిన ఇత్తడి లేదా రాగి కూష్మాండ పాత్ర, చుట్టూ చుట్టిన రంగు రంగుల పూలదండతో, మెడలో పువ్వుల హారంతో, చేతిలో చిడతలు వాయిస్తూ
వస్తారు హరిదాసులు. హరిదాసును సాక్షాత్తు ఆ వైకుంఠ వాసి లక్ష్మీపతి శ్రీమన్నారయణునిగా పూజించటం మన సాంప్రదాయం. ఏ ఇంటి ముందు ఆగి యాచించరు వీరు. మనమే ముందుగా చేత పాత్రతోబియ్యం పట్టుకొని నిలబడితే మాత్రమే ఆగుతారు.
చిన్నతనంలో హరిదాసు ఏ రంగు పట్టుపంచె కట్టుకొని వస్తాడు ఈ రోజు అనుకొంటూ ఆత్రుతగా ఎదురుచూసేవాళ్ళం. ఆయన పాత్రలో బియ్యం నేను వేస్తానంటే నేను వేస్తానని పిల్లలం పోటీ పడేవాళ్ళం. అందుకే బయట గుమ్మం పక్కన పెద్ద పాత్రతో నిండుగా బియ్యం పోసి ఉంచేవారు రోజూ. ఈ నెలంతా పిల్లలం తలో పిడికెడు బియ్యం పోసేవాళ్ళం. వీధి మొదట్లో చిడతల శబ్దం విన్న దగ్గరనుంచీ, వీధి దాటే వరకూ చూస్తూ నిలబడేవాళ్ళం.
మీరూ చూసేఉంటారు కదూ హరిదాసుల్ని గుర్తుకొచ్చారా?
కామెంట్‌లు