తెలుగు పీతలు.





ఢిల్లీ నగరంలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచీ అక్కడ దొరికే పీతలను తెచ్చి గాజు జాడీలలో ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం అయింది. స్టాల్స్ కట్టేసి వెళుతున్నారు. అందరూ వాళ్ళు తెచ్చిన పీతల జాడీలను జాగ్రత్తగా మూతలు పెట్టి వెళుతున్నారు. ఒకతను మాత్రం జాడీలను అలాగే మూతలు ఏమీ లేకుండా వదిలేసి వెళుతుంటే పక్కతను అడిగాడు. మూతలు పెట్టలేదేమని. అపుడు అతను చెప్పాడు. అబ్బే అవి తెలుగు పీతలు. అంత సాహసం చేసి బయటకు పోవు. ఒకవేళ ఏదైనా పీత పైకి ఎగబాకుతోంది అనుకోండి. మిగిలిన పీతలన్నీ కలిసి దానిని కిందకు లాగేస్తాయి భయం లేదు ఎక్కడికీ పోవు అని. నిజమే మిగిలిన రాష్ట్రాల వాళ్ళతో పోలిస్తే మన వాళ్ళకి బయటకు వెళ్ళి బతికే ధైర్యం తక్కువ అని చెప్పచ్చు. దేనికీ తెగించి ముందుకు రారని ఒక నానుడి. ఒక వేళ మన వాళ్ళు ఎవరైనా కొత్త దారులు వెతికి వెళితే వెనక నుండి లాగేవాళ్ళే కాని ముందుకు వెళ్ళమని ప్రోత్సహించే వాళ్ళు ఉండరు.

       మిగిలిన వాళ్ళను చూడండి. ఎక్కడికైనా తెగించి వెళ్ళి బతికి చూపిస్తారు. రాజస్తాన్ జైన్స్ చూడండి. ఎక్కడి నుంచో వస్తాడు. చిన్న టీస్టాల్ తెరుస్తాడు. నెమ్మదిగా సాయంత్రం జిలేబి, సమోసా వెయ్యడం మొదలు పెడతాడు. దాన్ని స్వీట్ స్టాల్ గా మారుస్తాడు. పనిచేయడానికి రాజస్తాన్ నుంచి కుర్రాళ్ళను తెచ్చుకుంటాడు తప్పితే ఇక్కడి వాళ్ళను పెట్టుకోడు. తను బాగా వృద్ధి అయాక తను తెచ్చిన వాడికి చేయూతనిచ్చి వాడిని నిలబెడతాడు. అలా వాళ్ళందరూ ఒకరికొకరు సహాయం చేసుకొని ఇక్కడికొచ్చి బతికేస్తారు. కావాలంటే రోజు కాకినాడ  మెయిన్ రోడ్, దేవాలయం వీధి, మొదలైన మంచి బిజినెస్ సెంటర్స్ అన్నీ ఇళ్ళు, షాప్ లు, స్థలాలు అన్నీ ఎవరివో గమనించండి . అన్నీ జైన్స్ వి కావా? వాళ్ళలో ఉన్న ఐక్యత అది, మనకి లేనిదీ అదే.

       ఇది ఉదాహరణ మాత్రమే అన్ని చోట్లా , అన్ని రంగాలలోనూ అంతే. మనం ఒక రంగంలో బాగా స్థిరపడితే దానిలోకి కొత్తగా వచ్చే వారికి చేయూతనిచ్చి ప్రోత్సహించాలి అంతే కాని వాళ్ళు ఎక్కడ మనకి పోటీ అయిపోతారో అని చూడకూడదు. అలాగే కొత్తదారులలో వెళ్ళే వారికి కూడా సహాయసహకారాలు అందించాలి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం