అమెరికాలో ముష్టివాళ్ళు....


మా చిన్నపుడు అమెరికాలో ముష్టివాళ్ళు కారుల్లో వస్తారుట అనేవారు. మాకు ఆశ్చర్యంగా ఉండేది. అపుడు ఇక్కడ కారు అంటేనే పెద్ద విచిత్రం. కాకినాడ మొత్తానికే పది కార్లో వుండేవేమో మరి. మేము రామారావు పేటలో ఉండేవాళ్లం. అక్కడ గారపాటిబిల్డింగ్స్ అని ఉంది. వాళ్ళకి ఒక పెద్ద కారు ఉండేది. దానిపేరు ప్లిమత్ దానిని అందరూ విమానం కారు అనేవారు. వాళ్ళు బయటకు తీస్తున్నా, బయటనుంచి వస్తున్నా మేము వింతగా చూసేవాళ్ళం కారు కనుమరుగు అయేదాకా . నాకు గుర్తున్నమటికి ఏరియాలో ఇంకో కారు ఉండేది కాదు. టాగూర్ కాన్వెంట్ జ్ఞానపతి గారు గుర్రం మీద ఉదయం, సాయంత్రం సవారీ చేసేవారు. ఏమైనా పది కార్లు కూడా ఉండేవి కావనుకొంటాను. అపుడు అమెరికా వెళ్ళడం అంటే ఇప్పటిలా హైదరాబాద్ వెళ్ళి వచ్చినట్లు కాదు కదా! అక్కడి వాళ్ళ చుట్టాలు, తెలిసిన వాళ్ళు వాళ్ళే వెళ్ళి చూసినట్లుగా చెప్పేవారు. అమెరికాలో ముష్టి వాళ్ళు అడుక్కోడానికి కారుల్లో వస్తారుట. పనిమనుషులు కూడా కార్ లో వచ్చి పని చేసిపోతారుట అని. మాకు అనిపించేది. కార్లు ఉన్నవాళ్ళు పనిచేసుకోవడం ఎందుకు, అడుక్కోవడం ఎందుకు అని. అందులో ఎంత నిజమో తెలీదు అనుకోండి.
       మరి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఒకసారి చూడండి రిక్షావాలా నుంచి వీధుల్లోచెత్తకాగితాలు ఏరుకొనే వాళ్ళకి కూడా చేతిలో పెద్ద ఫోన్ ఉంటుంది. అందులో కనీసం రెండు, మూడు సిమ్ లు ఉంటాయి. ముష్టి వాళ్ళ దగ్గర కూడా ఫోన్లే నేను వీధిలో ఉన్నా, నువ్వు వీధికి వెళ్ళు అని చెప్పుకుంటారేమో మరి. పల్లెటూరులో గేదెలు కాసుకొనేవాళ్ళు కూడా ఫోన్ లు కొంటున్నారు. గోపాలుడు మురళీ గానం వినిపించేవాడు. వీళ్ళు లేటెస్ట్ సాంగ్స్ వినిపిస్తారేమో. సరే ఇది ఇలా ఉంచండి.

మొన్న ఒక రోజు మా అబ్బాయి, నేను టాబ్ కొందామా, ఐపాడ్ కొందామా అని మాట్లాడుకుంటున్నాము. ఇంతలో మా పని మనిషి కలిగించుకొని టాబ్ ఎందుకండీ ఐపాడ్ కొనండి బాగుంటుంది. నేను మొన్నే తెప్పించుకొన్నాను అంది. ఇంతకీ వాళ్ళ ఆయన షిప్ మీద పని చేస్తాడుట. కాళీ సమయంలొ పాటలు వినడానికి, చూడటానికి ఉంటుందని ఆపిల్ ఐపాడ్ కొనుక్కొందిట. మరి మన దేశం కూడా చాలా ముందుకు వెళ్ళింది కదా!





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం