ఒకే టికెట్ట్ పై రెండు సినిమాలు చూసారా?


       కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్తే వెయ్యి రూపాయలకు తక్కువ అవదు రోజుల్లో కదా! మా చిన్నపుడు మా ఊరులో ఒక టూరింగ్ టాకీస్ ఉండేది. దాని పేరు లక్ష్మీగణపతి టూరింగ్ టాకీస్. అంటే పెద్దబిల్డింగ్ అది ఊహించుకోకండి. చుట్టూ మట్టి గోడలు పైన రేకులు ఉన్న హాల్ అన్నమాట. పగలు సినిమా వేయటానికి కుదరదు ఖాళీలలోంచి వెలుతురు వచ్చేసేది. కాబట్టి ఏమి వేసినా రాత్రి మాత్రమే వెయ్యాలి. అందులో వారానికి ఒక సినిమా మారుతుండేది. రోజుకు రెండు ఆటలు మాత్రమే. అందులో ఎన్ని సినిమాలు చూసామో. అప్పుడప్పుడు ప్రత్యేక ఆఫర్ ఇస్తుండే వారు. అదేమిటంటే ఒకే టికెట్ పై రెండు సినిమాలు. అలా వచ్చిన సినిమాలు మాత్రం వదిలేవాళ్ళం కాదు. మా ఇంట్లో నేనే కాషియర్ లెండి. అంటే ఏమీకాదు. వారం వారం సంత చేయడం, కిరాణా సామానులు అవీ తేవడం అన్నీ నేనే చేసేవాడిని. అప్పుడు మిగిలిన చిల్లర నా దగ్గరే ఉండేది. ఎక్కువ ఊహించుకోకండి. అర్దరూపాయో అరవై పైసలో అలాగన్నమాట. ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ ఆఫర్ ఉండేది. అప్పుడు నేను ఎనిమిదో తరగతి, పెద్ద తమ్ముడు ఆరో తరగతి , చిన్న తమ్ముడు ఒకటో తరగతి చదివేవాళ్ళం. మేము ఇద్దరం టికెట్ కొంటే చిన్నాడికి ఫ్రీ. అంటే రెండు టికెట్ల్ కొంటే ఆరు సినిమాలు చూసినట్లు కదా ! అందుకే అసలు వదిలే వాళ్ళం కాదు.  ఇంక ఇలా ఆఫర్ వచ్చినపుడు ఎలాగైనా చూసేయాలని మొదలయ్యేది తపన. అపుడు నేల టికెట్ నలభై అయిదు పైసలు మాత్రమే ( హాల్ లో ఎక్కువ మంది చూసేది నేల టికెట్ లోనే) సరే ఎదో ఒక లాగా అమ్మ నాన్నలని పీడించి రూపాయి వరకు అయేలా సంపాదించే వాళ్ళం. అంతే రోజు రాత్రి రెండు సినిమాలు చూసేయడమే. సాయంత్రం ఆరు అయేటప్పటికి మైక్ లో పాటలు వెయ్యటం మొదలుపెట్టేవారు. మొదటి పాట దినకరా! శుభకరా! అంటూ ఘంటసాల వారి పాట . అక్కడి నుంచి వరసగా రోజూ ఒకే పాటలు. ఏడు గంటలు అయ్యేసరికి పనుల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇళ్ళకు చేరి స్నానాలు, భోజనాలు చేసి ఇక్కడికి చేరేవారు.
       నెమ్మదిగా ఏడు దాటాకా మొదలయ్యేది సినిమా. అది సింగిల్ ప్రొజెక్టర్ హాల్. ఒకరీల్ అయేకా రెండో రీల్ పెట్టలంటే కాసేపు ఆగిపోయేది. మధ్యలో రీల్ తెగిపోతే ఆగిపోయేది. ఇలా ఆగినపుడల్లా అందరూ ఈలలు, అరుపులతో హాల్ దద్దరిల్లిపోయేలా చేసేవారు. దానికి ద్వారాలు , తలుపులూ ఉండవు. గోనె సంచులే తలుపులు.  సినిమా మొదలైనకొంతసేపటికి అవి కూడా పైకి ఎత్తేసేవారు. ఆఫర్ ఉన్నపుడు స్కూల్లో పిల్లలందరూ తప్పకుండా అక్కడే ఉండేవారు. అలా ఆగుతూ, ఆగుతూ రెండు సినిమాలు అయేసరికి రాత్రి రెండు, మూడు అయేది. సినిమాలమీద చర్చలు జరుపుతూ ఇంటికి చేరి నిద్రపోయేవాళ్ళం. రోజులు మళ్ళీ రావు కదా! మీలో ఎవరన్నా అలా చూసారా?


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం