మేలుకొలుపు
లోకంలోని ప్రతి ప్రాణిని మేలుకొలిపి ప్రాణాధారం అయిన కాంతిని ఇచ్చే సూర్యునికి
మనం పలికే మేలుకొలుపు ఇది.
శ్రీ సూర్య నారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా మేలుకో !
పొడుస్తూ బాలుడూ పొన్న పూవూ ఛాయ !! శ్రీ సూర్య !!
ఉదయిస్తు బాలుడూ ఉన్ని పూవూ ఛాయ
ఉన్నిపూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ
!! శ్రీ సూర్య !!
గడియొక్క బాలుడూ కంబ పూవూ ఛాయ
కంబపూవూ మీదా కాకారి పూఛాయ
!! శ్రీ సూర్య !!
మధ్యాహ్న బాలుడూ మల్లెపూవూ ఛాయ
మల్లెపూవూ మీదా మంకెన్న పొడి ఛాయ
!! శ్రీ సూర్య !!
మూడు ఝాముల బాలుడూ ములగపువ్వు ఛాయ
ములగపువ్వూ మీద ముత్యంపు పొడి ఛాయ
!! శ్రీ సూర్య !!
అస్తమాన బాలుడూ ఆవపూవూ ఛాయ
ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ
!! శ్రీ సూర్య !!
వాలుచూ బాలుడూ వంగ పండు ఛాయ
వంగపండూ మీద వజ్రంపు పొడి ఛాయ
!! శ్రీ సూర్య !!
గ్రుంకుచూ బాలుడూ గుమ్మడి పూవూ ఛాయ
గుమ్మడి పూవూ మీద కుంకుంపు పూఛాయ
!! శ్రీ సూర్య !!