ఎరక్కపోయి చేసాను ఇరుక్కుపోయాను.
నేను మూడో తరగతి అనుకుంటా చదువుతున్నాను. రామారావుపేట మున్సిపల్ స్కూల్లో.
దానినే ఇసకతిప్ప స్కూల్ అనేవారు. అప్పుడు ఈశ్వరపుస్తక భాండాగారం, స్కూల్ మాత్రమే ఉండేవి. ప్రహారీ కూడా ఉండేది కాదు. స్కూల్ లోపల, బయట అంతా ఇసుక ఉండేది. మేము రామారావుపేట శివాలయం ఎదురు వీధిలో ఉండేవాళ్ళం. ఇంటికి తాతగారో ఎవరైనా చుట్టాలో వచ్చినపుడు అయిదు పైసలో, పది పైసలో పిల్లల చేతిలో పెట్టేవారు. ( అపుడు ఒక పైసా , రెండు పైసలు, మూడు పైసలు, అయిదు, పది , ఇరవై పైసల బిళ్ళలు ఉండేవి లెండి వాటికి విలువ కూడా ఉండేది ). ఎవరైనా మన చేతిలో డబ్బులు పెట్టడం ఆలశ్యం. అవి వీధి చివర సత్యం కిళ్ళీకొట్టులో బిస్కట్లుగా గాని బిళ్ళలుగా గాని రూపాంతరం చెందేవి. అప్పడప్పుడు స్కూల్ దగ్గర దుంపలుగా కూడా ఖర్చు అయేవి. పాపం మా అమ్మ మాకు డబ్బులు జాగ్రత్త చెప్పాలని దేముడి దగ్గర ఒక చిన్న చెంబు పెట్టి ఎవరైనా డబ్బులు ఇస్తే దానిలో వేయాలని చెప్పేది. అలాగే వేసేవాళ్ళం. రోజూ ఒకసారి ఆ డబ్బులు ఉన్నాయో, లేవో అని చూసేవాళ్ళం. ఎవరూ తీసేవాళ్ళు కాదు. నాలుగు రోజులు గడిచేటప్పటికి ఏదో ఒకటి కొనుక్కోవాలనిపించేది. దేముడు ఎలాగు వాడుకోవటం లేదు. మనమేనా వాడుకోవాలి కదా! అని నెమ్మదిగా అమ్మ చూడకుండా అయిదో, పదో పైసలు తీసి ఖర్చు పెట్టేవాళ్ళం. ఇది చూసి పక్కింటి పిన్నిగారు ( మా చిన్నపుడు ఈ ఆంటీలు,అంకుల్స్ పిలుపులు లేవు కదా! మనకంటే కొంచెం పెద్దవాళ్ళు అక్కలు , పెళ్ళయిన వాళ్ళు పిన్నిలు, అత్తలు బాగా పెద్దవాళ్ళు
అమ్మమ్మలు, మామ్మ గార్లు అంతే ) మా అమ్మకి ఒక ఉపాయం చెప్పారు. అపుడు ఫేస్ పౌడర్ లు రేకు డబ్బాలలో వచ్చేవి లెండి అలాటి డబ్బా ఒకటి ఇచ్చి దానికి పైన నిలువుగా ఒక గాడిలా కన్నం పెట్టి ఒక హుండీలా తయారుచేసి ఇచ్చారు. మా దగ్గర డబ్బులు ఉన్నపుడు అందులో వేయాలి అన్నమాట. అందులో వేయటానికే కాని తీయటానికి ఉండదు. డబ్బా నిండిపోతే పగలకొట్టడమే శరణ్యం. దానికి కూడా చిట్కాలు ఉండేవి లెండి. దాన్ని వంచి పుల్ల పెట్టి ఒకటో, రెండో కాయిన్స్ లాగేవాళ్ళం. మొదట్లో అందులో వేసేవాళ్ళం. కొన్నాళ్ళకి అది కష్టం అనిపించింది. వచ్చినవి వచ్చినట్లు డబ్బాలో వేసేస్తే మాకు చేతిలో కొనుక్కోడానికి అసలు డబ్బులు ఉండేవి కాదు. అపాయంలో ఉపాయం ఉండాలని ఆలోచిస్తే చక్కటి ఆలోచన వచ్చింది. కిళ్ళీకొట్ల దగ్గర డ్రింక్ సీసామూతలు సేకరించి వాటిని జాగ్రత్తగా సుత్తితో కొట్టి కాయిన్స్ లాగా చేసుకొన్నాం. డబ్బులు వేయాల్సి వచ్చినపుడు అమ్మ ఎదురుగా కాకుండా పక్కకు తిరిగి ఒక రేకు బిళ్ళ వేసేవాళ్ళం. చప్పుడు అయేది. ఇలా కాలక్షేపం అయిపోతోంది. ఎన్నో రోజులు అవలేదు. డబ్బా రేకు బిళ్ళలతో నిండిపోతోంది. డబ్బులు మామూలుగానే ఖర్చు అవుతున్నాయి. ఒకసారి అమ్మ పిండి ఆడించడానికి డబ్బాలో డబ్బులు తీసుకు వెళ్ళమని చెప్పింది . ఏమి చెయ్యాలి అనవసరంగా ఇరుక్కుపోయాము . డబ్బాలో ఏమున్నాయి రేకుబిళ్ళలు తప్ప . సరే పిండిమిల్లు వాడిని బతిమాలి తరవాత ఇస్తామని చెప్పి ఆ రోజుకు గండం గట్టేక్కాము. మళ్ళీ మళ్ళీ ఇదేలాగా పంపేది. వాడు మమ్మల్ని పాత డబ్బులు ఇమ్మనేవాడు. దానితో మా జబ్బు కట్టేసి దారిలో కొచ్చాము. నిజంగానే డబ్బులు దాయడం మొదలుపెట్టాము.