వంటెద్దు బండి.


       శివరాత్రి అనగానే అందరికీ శివుడు గుర్తువస్తాడు. నాకు సామర్లకోటలో భీమేశ్వరాలయానికి తెల్లవారుఝామున వంటెద్దుబండిలో వెళ్ళడం గుర్తుకు వస్తుంది. మా తాతగారిది సామర్లకోట. మేము ఊరులో ఉన్నా శివరాత్రికి సామర్లకోట వెళ్ళేవాళ్ళం. నేను బాగా చిన్నవాడిని. మా తాతగారి ఇంటికి ముందురోజు వెళ్ళేవాళ్ళం. ఆయన మామూలుగానే తెల్లవారుఝామున మూడు గంటలకి లేచి పొయ్యి వెలిగించి నీళ్ళు కాచేవారు. ఇంక అప్పటినుంచి అందర్నీ లేపడం మొదలుపెట్టేవారు. అందుకే అలవాటు అయిపోయే మీకు తెల్లవారకుండా పేపర్ వాడి కంటే ముందు నా పోస్ట్ పంపడం జరుగుతోంది. సరే ఇంక శివరాత్రి అంటే రెండు, మూడు అయేసరికి ఒక వంటెద్దు బండి వాడు వచ్చి గుమ్మం ముందుండేవాడు. అందర్నీ లేపేసి, భీమేశ్వరాలయానికి స్నానాలకి తీసుకుపోయేవారు. అప్పటికి నాకు నాలుగు, అయిదేళ్ళు ఉండేవి అనుకుంటా. గతుకుల రోడ్డు మీద వంటెద్దు బండిలో ప్రయాణం. అసలే నిద్ర మత్తు దానికి తోడు  గతుకుల్లో పడటం, రాళ్ళు ఎక్కడం జరిగినపుడల్లా అటూ ఇటూ తూలుతూ ఉండేవాళ్ళం. మూడు, నాలుగు కిలోమీటర్ల ప్రయాణం సుమారు ఒక గంట పట్టేది. చలిలో శివాలయం ముందున్న కోనేట్లో ముంచి స్నానం చేయించేవారు. శివరాత్రికి చలి శివ, శివా అంటూ పోతుందంటారు. కాని మా నిద్రమత్తు కాస్తా వదలి పోయేది. చాలా రష్ గా ఉండేది. పాకుడు కట్టిన రాళ్ళతో పావంచాలు జర్రున జారుతూ ఉండేవి. తలారా స్నానంచేసి వజవజ వణకుతూ తడి బట్టలతోనే దర్శనానికి తీసుకువెళ్ళేవారు. నాకైతే స్నానం చేసే సరికే శివుడి దర్శనం అయిపోయేది. మళ్ళీ మద్యాహ్నం మా నాన్నగారితో సైకిల్ మీద వెళ్ళి తీర్థం అంతా తిరిగి జీళ్ళు, ఖర్జూరాలు, బొమ్మలు, బుడగలు కొనుక్కుంటే ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ శివరాత్రి ఎప్పుడొస్తుందో అని చూసేవాళ్ళం అనుకోండి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం