మనసు పలికే మౌనరాగం
ఫేస్ బుక్ లో మిత్రులెవరో పోస్ట్ చేసిన ఈ ఫోటో చూసి రాస్తున్నా. ఈనాటి ఆధునిక యాంత్రిక యుగంలో మనుషులు కూడా యంత్రాలు అయిపోతున్నారు, జీవితం అంతా యాంత్రికమయిపోతోంది. ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ అవటం ఏమో గాని ముక్కు మొహం తెలియని వారితో స్నేహాలు, ప్రేమలు, మనసు పంచుకోడాలు పెరిగాయి. కాని నిత్యం మనం మనచుట్టూ ఉన్నవారిని మాత్రం దూరం చేసుకొంటున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే రోజూ చూస్తుంటాం రైలు, బస్సు, ఆటో, ఇలా వివిధ ప్రయాణాలలో మనమంతా వెళుతున్నపుడు చూడండి. ఎవరికి వారు చెవులకు కర్ణాభరణాలు (అవేనండీ ఇయర్ ఫోన్స్ ) తగుల్చుకొని ఎవరి లోకంలో వాళ్ళు ఉండటం, లేదా సెల్, టాబ్ ల్లో నెట్ లో విహరించడం చేస్తుంటారు. పక్కనున్న వాళ్ళతో మనకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా. చివరికి కాలేజ్ బస్ లో కూడా ఆ ప్రయాణసమయంలో స్నేహితులతో కూడా మాట్లాడటం తక్కువ . అదే అలవాటు ఇంట్లో కూడా అవుతోంది. తల్లి తండ్రి టి. వి చూస్తుంటే , పిల్లలు ఎవరి ఫోన్ కబుర్లు వాళ్ళో, లేక నెట్లో చాటింగ్స్ తో సరిపోతోంది. అందరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకొనే సమయం తగ్గిపోతోంది. భోజన సమయంలో కూడా తీరిక లేనట్లు చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకొనే గడుపుతారు కొందరు. దీని వలన కుటుంబంలో కాని మిగిలిన చోట్ల కాని సాంఘిక సంబంధాలు తగ్గిపోతున్నాయి. సోషల్ నెట్ వర్కింగ్ మీడియాల వాడకం పెరిగింది కాని మన చుట్టూ ఉన్న వాళ్ళతో సోషల్ గా ఉండటం పిల్లలకు అలవాటు అవడం లేదు. మనుషులు దగ్గరగా ఉన్నా మనసులు దూరంగా ఉంటున్నాయి. అందుకే ముక్కూ మొహం తెలియని వారితో గంటలు గంటలు చాటింగ్స్ కాకుండా మన ఇంట్లో వాళ్ళతో, మన పక్కింటి వాళ్ళతో, మన తోటి ప్రయాణీకులతో సామరస్యంగా ఉంటూ కనీసం పలకరించుకుంటూ ఉంటే పరిచయాలు పెరుగుతాయి. ఊహాలోకంలో విహరించడం మానేసి వాస్తవ జీవితానికి విలువిచ్చి అందరితో కలుపుగోలుగా ఉండటం మంచిది కదా!