మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....
పిల్లి పిల్లల్ని పెట్టి ఏడు ఇళ్ళు తిప్పుతుంది అంటారు. మీరు ఎప్పుడైనా పిల్లి తన పిల్లల్ని తీసుకువెళ్ళటం చూసారా? తన నోటితో జాగ్రత్తగా కరిచి పట్టుకొని తీసుకువెళ్తుంది. ఇక్కడ పిల్లిదే బాధ్యత. పిల్లలదేమీ ఉండదు. దీనినే మార్జాల కిశోరన్యాయం అంటారు. అదే మర్కటం అంటే కోతి విషయంలో చూసారా? అది పిల్లలతో సహా గోడలు ఎక్కి, చెట్టు కొమ్మలు, ఇంటి కప్పులు ఎక్కడికి వెళ్ళినా చిన్నచిన్న పిల్లలు తన తల్లిని వీపునకు గాని, తల్లి పొట్టను కాని గట్టిగా పట్టుకొని ఉంటాయి. ఇక్కడ బాధ్యత తల్లిది కాదు, పిల్లలదే. దీనినే మర్కట కిశోరన్యాయం అంటారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకొంటున్నారు కదా. ఈ రోజులలో పిల్లల్ని మనం పిల్లి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తుందో అంతలా చూస్తున్నాం . చూడండి వాళ్ళకు ఉదయం లేపడం దగ్గరనుంచి, స్నానాలు చేయించడం, టిఫిన్స్ బతిమాలి తినిపించడం , బస్ వచ్చేస్తుందని వాళ్ళని తరుముతూ రెడీ చేయడం అన్నీ తలితండ్రుల బాధ్యతగా తీసుకొంటున్నాం. వాళ్ళకి పరీక్షలు వస్తే మనకే అన్నట్లు దగ్గర కూచుని చదివించడం , వాళ్ళ హోమ్ వర్క్ లు దగ్గర ఉండి చేయించడం, ట్యూషన్స్ గాని, సంగీతం, డాన్స్, కరాటే క్లాసులు ఉంటే తీసుకువెళ్ళడం, తీసుకు రావడం చేస్తున్నాం. వాళ్ళ స్కూల్స్ కోసం, కాలేజీలకోసం వంద ఎంక్వయిరీలు చేసి అక్కడ బాగుందంట, ఇక్కడ బాగుందంట అనుకొంటూ చేరుస్తున్నాం. వాళ్ళకి ఎమ్ సెట్లు, ఇతర సెట్లు అయేవరకూ మనకే సీట్ అన్నట్లుగా ఎదురుచూస్తున్నాం. బయటకు పంపాలంటే భయపడుతూ తిరిగి వచ్చే వరకూ వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నాం. ప్రతీ పనికీ మనమే చేసి పెడుతున్నాం. దాని వలన వాళ్ళు కొంత తమంతట తాము స్వయంగా అన్ని పనులూ చేసుకొని, ఎవరింటికైనా గాని, ఏదైనా హాస్టల్ కి గాని వెళ్ళవలసి వస్తే అక్కడ తమపనులు చేసుకోలేకపోవడం, ఇతరులతో ఎడ్జస్ట్ కాలేకపోవడం జరుగుతోంది. అలాగే ఎవరిపిల్లలు వాళ్ళ ఇంట్లోనే పెరుగుతున్నారు. చుట్టాల ఇళ్ళకి వెళ్ళి ఉండటం, సెలవులు గడిపి రావటం జరగటం లేదు. ఇవన్నీ నేడు ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటం వల్ల జరుగుతోంది. తలితండ్రులకు మా చిన్నపుడు మాకు జరగలేదు కాబట్టి వాళ్ళకి మనం జరపాలి అని కొంత చేస్తున్నాం.
అలాగే నేటి విద్యావిధానం వల్ల కూడా సెలవులు ఎక్కువ లేక పోవడం, ఉన్నా సెలవుల్లో ఏదో ఒక కొత్తది నేర్చుకోవాలనో , తరవాత క్లాస్ మొదలు పెట్టేసారనో కనీసం అమ్మమ్మ, నాయనమ్మల ఇళ్ళకి కూడా వెళ్ళడం జరగటం లేదు. దాని వలన పిల్లలకు ఇతరులతో సర్దుబాటు చేసుకోవడం, పంచుకోవడం అలవాటు పడటం లేదు.
అదే మన చిన్నతనం రోజులు గుర్తు తెచ్చుకోండి. స్కూల్ నుంచి వస్తే ఆటలే చీకటి పడ్డాక ఇంటికి చేరటం, పెట్టింది తినేయడం అంతే , బతిమాలడాలు , తినిపించడాలు లేవు. మన స్కూల్ కి, కాలేజీకి మనమే నడచి పోవడం. ఆఖరికి కాలేజీలో చేరటానికి అప్లికేషన్స్ కూడా మేమే తెచ్చుకొని , మేమే నింపి ఇచ్చేవాళ్ళం. ఫీజ్ కట్టడం ఒకటే మా నాన్నగారు చేసేవారు. నలుగురు పిల్లలం అవడం వల్ల అయి ఉండవచ్చును. హఠాత్తుగా రోడ్డుమీద ఎవరైనా మీ రెండో పిల్లాడు ఏ క్లాస్ అంటే కూడా ఆలోచించి చెప్పేవారు. ఆయన ఉద్యోగం ఏదో ఆయనది అన్నట్లుగా ఉండేవారు. ఇంట్లో కావలసిన సరుకులు తేవడం, రేషన్ షాప్ కి వెళ్ళి తేవడం అన్నీ మేమే చేసేవాళ్ళం. సెలవులు వస్తే పెద్దమ్మ, పిన్నమ్మ పిల్లలు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావడం, పోవడం జరిగేది. లేకపోతే అందరూ అమ్మమ్మ, నానమ్మ ఇళ్ళకి వెళ్ళి గడిపేవాళ్ళం. అక్కడ కూడా వాళ్ళు ఏం పెడితే అది తినే వాళ్ళం అంతే కాని ఇది తినం అది తినం అనేవాళ్ళం కాదు. తినకపోతే బతిమాలడాలూ లేవు. ఆకలి వేస్తే వాళ్ళే తింటారులే అని ఊరుకొనే వారు పెద్దవాళ్ళు. ఇంట్లో పనులు కూడా అందరూ పంచుకొని చేసేవాళ్ళం. కాదంటారా? ఒకసారి గుర్తుతెచ్చుకోండి.
అందుకే అన్నాను మన చిన్నపుడు మర్కటకిశోరన్యాయం, ఇప్పుడు మన పిల్లలకు జరిగేది మార్జాల కిశోరన్యాయం.