అమ్మలు అందరూ ఇంతేనా ?
సాధారణంగా పిల్లలు అన్న తరవాత పేచీలు పెట్టరా చెప్పండి. అందులోనూ స్కూల్ కి వెళ్ళడానికి పేచీ పెట్టని కుర్రాడు ఉంటాడా? ఏ చుట్టాలు వచ్చినపుడో ఎలాగూ వాళ్ళ ముందు ఏమీ అనరులే ( చుట్టాలు వెళ్ళిన తర్వాత వీపు విమానం మోత ఎక్కిస్తారు అనుకోండి ) అన్న ధైర్యంతో స్కూల్ ఎగ్గొట్టమా. హోమ్ వర్క్ చేయకుండా టి.వి లో సినిమా చూసినపుడు అర్జంటుగా స్కూల్ టైమ్ కు కడుపు నొప్పిలు రావటం సహజం కదా! స్కూల్ టైమ్ దాటాక అదే తగ్గుతుంది. ఇదేం కొత్త కాదు కదా. ఈ మధ్యన రకరకాల బంద్ ల వల్ల స్కూల్ సరిగా జరగలేదని ఆదివారాలతో సహా అన్ని సెలవు రోజులలో స్కూల్ పెట్టేస్తున్నారు. రోజూ వెళ్ళి వెళ్ళి బోర్ కొట్టింది. పోనీ ఒకరోజు స్కూల్ ఎగ్గొట్టేద్దాం అని రాత్రే ప్లాన్ వేసుకొని ఉదయం లేవకుండా పడుకున్నా. పోనీ కుర్రాడు వారం అంతా అలిసిపోయి ఉన్నాడు. అని ఊరుకోవచ్చు కదా!. అమ్మ లేపేసింది. నేను లేవనని పేచీ మొదలు పెట్టాను. రోజూ స్కూల్ కి
వెళ్ళాలా? ఏం ఒకరోజు మానేస్తే కొంపమునిగిపోతుందా అని అడిగాను. మీ అమ్మ లు అయితే ఏమంటారు? తప్పమ్మా రోజూ స్కూల్ కి వెళ్ళి బాగా చదువుకోవాలి. అలా చదువుకొంటే పెద్ద అయాక పెద్ద డాక్టర్, పెద్ద ఇంజనీర్, పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి ఎడా పెడా సంపాదించుకోవచ్చు . అని చెపుతారు కదా? మరి మా అమ్మ ఏమిటండీ ఇలా చెప్పింది. నాన్నా, నువ్వు రోజూ తప్పకుండా స్కూల్ కి వెళ్ళాలమ్మా ! నీకు ఇప్పుడు నలభై ఏళ్ళు కదా! అయినా నువ్వు ఆ స్కూల్ కి హెడ్ మాస్టర్ వి కూడాను. నువ్వు వెళ్ళకపోతే తాళాలు ఎవరు తీస్తారు. పిల్లలకి పాఠాలు ఎవరు
చెప్తారు చెప్పు. అంటుంది ఏమిటండీ ?
అమ్మలు అందరూ ఇంతేనా?