చదవండి ... చదివించండి... చదివింపించండి...
నేను 10వ తరగతి చదువుతున్నపుడు మాకు ఒక హిందీ మాస్టారు ఉండేవారు. ఆయన రామకృష్ణ పరమహంస భక్తులు. ఆజన్మ బ్రహ్మచారి. నిరాడంబరజీవి. చూడటానికి బక్కపలచగా తెల్లటి గడ్డంతో అచ్చం రామకృష్ణ పరమహంస లాగే ఉండేవారు. ఆయనకు రెండు, మూడు ధోవతులు, పైన కప్పుకోడానికి ఉత్తరీయాలు, రెండు, మూడు లాల్చీలు తప్ప ఏమీ
బట్టలు ఉండేవి కాదు. ఆయన గదిలో సామానులు కూడా ఎక్కువ కాదు. ఒక స్టౌవ్, ఒకటి, రెండు గిన్నెలు , ఒక చాప అదే సామానులు. కాని గది నిండా రామకృష్ణ పరమహంస, వివేకానందుని పుస్తకాలు, ఇతర పుస్తకాలు నిండి ఉండేవి. మితభోజనం కేవలం బ్రతకడానికి మాత్రమే అది కూడా పులుపు, ఉప్పు, కారం లేని చప్పిడిది. ఎవరేమి ఇచ్చినా తీసుకొనేవారు కాదు. గది లోని చాపమీద పుస్తకాలు, డబ్బులు అలా వదిలేసి ఉండేవి. ఆయన డబ్బును కూడా పట్టించుకొనేవారు కాదు కాని పుస్తకాలను మాత్రం జాగ్రత్తగా చూసేవారు. ఆయన జీతం అంతా రామకృష్ణ మఠం, పేద విద్యార్ధుల ఫీజులకు, ఇతర సేవాకార్యక్రమాలకు ఖర్చు పెట్టేవారు. ఒకోసారి ఆయనకు నెల గడవడం కూడా కష్టమయేది. అంతా పరులకోసం, పుస్తకాల కోసం ఖర్చు పెట్టేవారు. మేము ఆయన దగ్గర కూచుని పుస్తకాలు చదివేవాళ్ళం. అవి ఇంటికి ఇచ్చి చదవమనే వారు. ప్రతిపుస్తకంపైన ఇలా వ్రాసి ఉండేది. " చదవండి... చదివించండి... చదివింపించండి... " అని. అంటే అది మనం చదవాలి, నచ్చితే ఇతరులచేత చదివించాలి. ఇంకొకరి చేత వాళ్ళు చదివించేలా చేయాలి అన్నమాట. అలా మేము చాలా పుస్తకాలు చదివాము.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నా బ్లాగ్ చదివే ఒకాయన పేరు వెంకట్ టేకుమళ్ళ . ఆయన ఫేస్ బుక్ లో పలకరించారు. ఇదే మా తొలి పరిచయం మాట్లాడుతూ ఆయన బ్లాగ్ చాలా నచ్చిందని చెపుతూ , ఆశువుగా ఈ క్రింది పద్యం చెప్పారు. అంత నచ్చినందుకు ధన్యత చెందినట్లుగా భావిస్తున్నాను. ఆ పద్యం చదవండి.
తే!గీ! కాకినాడకు పేరొచ్చె కాజ వలన
కాజ రూపును కృత్తిక కనుల నిలిపె
కాకినాడన కమనీయ కధలు యెన్నొ
వినగ తలపించు మదినెంతొ విస్మయంబు!
చాలా బాగా వ్రాసారు కదూ! ఇది నా బ్లాగ్ ను పొగుడుతున్నందుకు కాదు. ఆయన ప్రతిభను అందరికీ చెప్పాలని అంతే. నిజంగా నా బ్లాగ్ నచ్చితే మా హిందీ మాస్టారు చెప్పినట్లు మీరు "చదవండి, ఇతరుల చేత చదివించండి". వారే మరొకరితో చదివిస్తారు.
మీ కాకినాడ కాజా.