మన డప్పు మనమే కొట్టుకోవాలి.


       రోజు ఉదయం ఒక సంఘటన జరిగింది. నేను పనిచేసేది ఒక పల్లెటూరి పాఠశాలలో. అది మా ఊరి మొదట్లోనే ఉంటుంది. చుట్టూ పొలాలు, ఎదురుగా చెరువు, దూరంగా ఇళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం మామూలుగా మా క్లాసులు చెప్పుకుంటున్నాము. ఒక పక్కన పదవతరగతికి ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంతలో హారనులు కొట్టుకుంటూ సుమారు ఇరవై, ముప్పై మోటారుసైకిళ్ళు వరసగా వచ్చేసాయి. అందులో ఒకటి , రెండు బళ్ళు సైలెన్సర్లు తీసేసారనుకొంటాను కూడాను. విపరీతమైన శబ్దం చేసుకొంటూ వేగంగా ఊర్లోకి వెళ్ళారు. పిల్లలందరూ పాఠాలు వదిలేసి బయటకు చూడటం మొదలు పెట్టారు. కొంతసేపటికి మళ్ళీ తిరిగి వస్తున్న శబ్దం వినబడింది. దూరంగా ఉండగానే గబగబ బయటకు వెళ్ళి ఆపాను. ఏమిటయ్యా అంటే, ఏదో పురుగుల మందు ప్రచారం కోసం వచ్చారుట. అంతా బాగానే ఉంది. శబ్దకాలుష్యం ఏమిటి ఇంకో విధంగా ఏమీ చెయ్యలేరా అని గట్టిగా అడిగితే సారీ చెప్పి నిశ్శబ్దంగా వెళ్ళి పోయారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు, చెట్లకు చిన్నచిన్న బోర్డులు ఇన్ని రకాలు పెడుతున్నారు. మళ్ళీ గోల ఏమిటో అనుకున్నా.
       అప్పుడు గుర్తుకొచ్చింది మా చిన్నపుడు పల్లెటూరులో కొంతకాలం ఉన్నాము లెండి. అప్పుడు రెండు, మూడు నెలలకు ఒక సారి ఎరువుల కంపెనీల వాళ్ళు వచ్చి సాయంత్రం హైస్కూల్ వదిలే సమయానికి వచ్చేవారు . వారి వాహనంతో పాటు చాలా సామగ్రి వచ్చేది. ఊరి మధ్యలో ఖాళీగా ఉన్నచోట సామగ్రి అంతా దింపేవారు. అంతే మా పిల్లలందరికీ రోజు కాలక్షేపం దొరికినట్లే అప్పటినుంచి చీకటి పడే వరకు వాళ్ళ ప్రచార సామగ్రి అంతా వరసగా పేర్చడం వారి వాహనానికి అమర్చి ఉన్న మైకులో పాటలు వేయడం చేసేవారు. ప్రచారచిత్రాలు ప్రదర్శించడానికి అవసరమైన తెరకట్టేవారు. అదో పండగలా చూస్తూ ఉండే వాళ్ళం. చీకటి పడ్డాక అందరూ చేరే సమయానికి వాళ్ళ ప్రచార చిత్రం మొదలు పెట్టే వారు. దాన్ని కూడా బాగానే జనం చేరి చూసేవారు. నాకు బాగా గుర్తుఉన్నది గ్రోమోర్ వారి చిత్రం గ్రోమోర్ చేనుకు చేవ - రైతుకు రొఖ్ఖం అంటూ స్లోగన్ తో ఉండేది. మేము సినిమా అంతా అయి వాళ్ళు అన్నీ సర్దుకుని వెళ్ళేదాకా ఉండేవాళ్ళం. చివర్లో మాత్రం చేనుకు చీడ - రైతుకు దుఃఖం అంటూ వెళ్ళేవాళ్ళం.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం