ఎరక్కపోయి చేసాను ఇరుక్కుపోయాను.
నేను మూడో తరగతి అనుకుంటా చదువుతున్నాను . రామారావుపేట మున్సిపల్ స్కూల్లో . దానినే ఇసకతిప్ప స్కూల్ అనేవారు . అప్పుడు ఈశ్వరపుస్తక భాండాగారం , స్కూల్ మాత్రమే ఉండేవి . ప్రహారీ కూడా ఉండేది కాదు. స్కూల్ లోపల , బయట అంతా ఇసుక ఉండేది . మేము రామారావుపేట శివాలయం ఎదురు వీధిలో ఉండేవాళ్ళం . ఇంటికి తాతగారో ఎవరైనా చుట్టాలో వచ్చినపుడు అయిదు పైసలో , పది పైసలో పిల్లల చేతిలో పెట్టేవారు . ( అపుడు ఒక పైసా , రెండు పైసలు , మూడు పైసలు , అయిదు , పది , ఇరవై పైసల బిళ్ళలు ఉండేవి లెండి వాటికి విలువ కూడా ఉండేది ). ఎవరైనా మన చేతిలో డబ్బులు పెట్టడం ఆలశ్యం . అవి వీధి చివర సత్యం కిళ్ళీకొట్టులో బిస్కట్లుగా గాని బిళ్ళలుగా గాని రూపాంతరం చెందేవి . అప్పడప్పుడు స్కూల్ దగ్గర దుంపలుగా కూడా ఖర్చు అయేవి . పాపం మా అమ్మ మాకు డబ్బులు జాగ్రత్త చెప్పాలని దేముడి దగ్గర ఒక చిన్న చెంబు పెట్టి ఎవరైనా డబ్బులు ఇస్తే దానిలో వేయాలని చెప్పేది . అలాగే వేసేవాళ్ళం . రోజూ ఒకసారి ఆ డబ్బులు ఉన్నాయో , లేవో అని చూసేవాళ్ళం . ఎవరూ తీసేవాళ్ళు క...