మనసుంటే మార్గముండదా ?
బతకడానికి లక్ష మార్గాలు ఉన్నాయి. మనం నిజంగా ఆలోచిస్తే ఎన్ని మార్గాలైనా కనపడతాయి. కాని మనలో చాలామంది తప్పుడు పనులు చేస్తునో, లేక బతకడానికి ఏ దారి కనపడక ఆత్మహత్యలు చేసుకొంటున్నామనో అంటుంటారు. కాని అది నిజం కాదు. చిన్న ఉదాహరణ చూపిస్తా, చూడండి.
కాకినాడలో వాకలపూడి బీచ్ కి అందరూ వెళతారు కదా!. అక్కడ లైట్ హౌస్, శివాలయం ఉన్న ప్రాంతం అంతా కూడా సూర్యారావుపేట అంటారు. అదొక మత్స్యకార గ్రామం. వాళ్ళ జీవన శైలిని ఒక్కసారి పరిశీలించండి. అక్కడ అందరూ సముద్రంపైన చేపలవేటకు వెళతారు. సుమారు పద్నాలుగు ఏళ్ళు వచ్చాయంటే వలలు వేసుకొని, బోట్ మీద వేటకు తయారు. బోట్ కి అయిదుగురు, ఆరుగురు ఎక్కుతారు. డీసెల్ ఆయిల్, తిండి, నీళ్ళు మొదలైన సామగ్రి తీసుకొని తెల్లవారుఝామున బయలుదేరితే, సాయంత్రానికి గాని ఒక్కోసారి మర్నాడు కాని తిరిగివస్తారు. వేటలో దొరికిన చేపలను ఒడ్డుకు రాగానే అమ్మి, వచ్చిన సొమ్మును పిల్లలతో సహా సమాన వాటాలు వేస్తారు. ఆ రకంగా కొంచెం పెద్దపిల్లలు సంపాదన మొదలుపెడతారు.
ఒడ్డున చేపలు అన్నింటిని కొని కొందరు వ్యాపారులు వాటిని పెద్ద పెద్ద కంటైనర్స్ లో ఐస్ ముక్కలతో బాక్స్ ల మధ్యన చేపలు ఉంచి పైకి ఎక్స్ పోర్ట్ చేస్తారు. ఐస్ పెద్దపెద్ద బ్లాక్స్ ని గునపాలతో బద్దలుకొట్టి , ముక్కలు చేసి బాక్స్ ల్లో నింపుతారు. అపుడు చిన్న చిన్న ముక్కలు విరిగి, ఎగిరి చుట్టూ పడుతుంటాయి. కొంచెం పది, పన్నెండు ఏళ్ళు ఉన్న పిల్లలు, ఆడపిల్లలు ఒక్కొక్క ప్లాస్టిక్ బకెట్ పట్టుకొని ఇక్కడికి చేరతారు. ఆ ముక్కలను బకెట్స్ లోకి ఏరుకొని నిండగానే బయట బుట్టలలో చిల్లరగా చేపలు అమ్ముకొనేవాళ్ళకు అమ్మేస్తారు. బకెట్ ఐస్ ఐదు రూపాయలకో , పది రూపాయలకో అమ్ముతారు.
కొందరు పిల్లలు మధ్యాహ్నం ఇంట్లో పెద్దవాళ్ళచేత , ఇంట్లో శనగలు, బఠానీలు ఉడకపెట్టించి, లేదా బజ్జీలు వంటివి తయారుచేయించి, సాయంత్రం బీచ్ దగ్గర చేరి అమ్ముకొంటారు. మరీ చిన్న పిల్లలు మన దగ్గర చేరి డబ్బులు అడుక్కొంటారు. ( ఇది అనుసరించదగ్గది, అభినందించ దగ్గది కాదు కాని వాస్తవం ) .
ఆ గ్రామం చుట్టూ ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. సుమారు పది వరకూ పామాయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైన ఆయిల్స్ తయారు చేస్తాయి. ఆ గ్రామం దగ్గర రోడ్లన్నీ ఆయిల్స్ తీసుకొని వెళ్ళే లారీలతో నిండి ఉంటుంది. అక్కడ కొన్ని రకాల సంపాదనలు ఉన్నాయి వీళ్ళకి. పిల్లలు ప్లాస్టిక్ కవర్స్ పట్టుకొని లోడింగ్ కోసం ఆగి ఉన్న లారీల దగ్గరకు వెళతారు. లారీలకు ఆయిల్ బయటకు పంపే గొట్టాలు ఉంటాయి కదా వాటిలో అన్ లోడ్ చేసినా మిగిలిన ఆయిల్స్ కొంచెం ఉంటాయి. వాటిని గొట్టాలలోకి చేతులు పెట్టి ఊడ్చి, ఈ ప్లాస్టిక్ కవర్ల లోకి తీస్తారు. కవర్ నిండగానే అది ఒక కే.జీ వరకు వస్తుంది. దగ్గరే ఉన్న కాకా హొటల్స్ కి పదికో, ఇరవైకో అమ్మేస్తారు. ఇంక డ్రైవర్స్ కి , క్లీనర్స్ కి సిగరెట్స్ లాంటివి తెచ్చి పెట్టి కొందరు సంపాదిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఆ ఒక్క గ్రామం లోని పిల్లలే ఇన్ని సంపాదనా మార్గాలు వెతికితే, మనసు పెట్టి పని చేయాలనుకొంటే మార్గాలే దొరకవా? ఆలోచించండి.