ఉత్తరధృవం... దక్షిణధృవం

  
       సాధారణంగా ఒక చేతి వేళ్ళు అన్నీ ఎలా సమానంగా ఉండవో, ఒక తల్లి బిడ్డలు కూడా అలా ఉండరు. చాలా మందిని చూస్తూ ఉంటాము కదా! ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి. ఎవరి వరకూ ఎందుకూ మా పిల్లల సంగతే చూద్దాం. ఒకళ్ళకి ఒకటి నచ్చితే, ఒకళ్ళకి అది నచ్చదు. మా అబ్బాయి ఆకుపచ్చ అరటి పళ్ళు తింటాడు. మా అమ్మాయి మామూలువి తింటుంది. వాడు బూస్ట్ తాగుతాడు. మా అమ్మాయి బ్రూ కాఫీ తాగుతుంది. ఒకళ్ళు గోధుమ నూక ఉప్మా తింటే , ఒకళ్ళు కరాచీ నూక ఉప్మా తింటారు. అబ్బాయి మడత కాజా తింటే, అమ్మాయి అది తినదు. గొట్టంకాజానే తింటుంది. ఒకళ్ళు పెరుగు పోసుకుంటారు. మరొకళ్ళు మజ్జిగ పోసుకుంటారు
మా అబ్బాయి రాత్రి ఎక్కువ సేపు ఉండలేడు. త్వరగా పడుకొని తెల్లవారుఝామున లేచి చదువుతాడు. మా అమ్మాయి అలా కాదు రాత్రి ఎంత సేపైనా సరే చదువుకొని పడుకోవాలి అంతే తెల్లవారుఝామున లేవలేదు పాపం. మా అమ్మాయి దస్తూరీ ముత్యాల కోవలా ఉంటుంది. మా అబ్బాయి రాసింది మళ్ళీ వాడే వచ్చి చదవాలిమా అమ్మాయికి డబ్బు జాగ్రత్త ఎక్కువే . మా అబ్బాయి చేతిలో డబ్బు ఉండదు.
       ఇన్ని తేడాలున్నా ఒక్కచోట మాత్రం ఇద్దరూ ఒక్కటే అవుతారు. నా చేత ఏదైనా కొనిపించుకోడానికి మాత్రం ఇద్దరూ ఒక్కటే. చెల్లి అడిగింది మాత్రం కొనకపోతే ఎలా నాన్నా అంటూ మా అబ్బాయి. అన్నయ్యకి మాత్రం రెండు వేలు లేనిదే షర్ట్ ఎలా వస్తుంది నాన్నా అంటూ అమ్మాయి కుమ్మక్కయిపోతారు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం