వేసవి పగళ్ళు .... వెన్నెల రాత్రుళ్ళు ....


వేసవి కాలం అనగానే నాకు గుర్తుకువచ్చేది మా చిన్నతనంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళడమే. పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరికి దగ్గరలోని ఊరు చాలా చిన్న పల్లెటూరు. ఒక పక్కన ఎత్తైన కొండలు, ఒక పక్క పంటచేలు, దూరంగా గోదావరిగట్టిగా వంద, రెండొందల గడప కలిగిన ఊరది. కొండల దగ్గర ఎక్కువగా మామిడి, జీడి మామిడి తోటలు ఉంటాయి. అది ఒక జమిందారీ గ్రామం. జమిందార్లు ఒక పెద్ద భవంతి కట్టించారు. వాళ్ళు రాజమండ్రిలో ఉంటూ అటూ , ఇటూ తిరుగుతూ ఇక్కడ పొలాలు, తోటలు చూసుకొంటూ ఉండేవారు. బ్రాహ్మణుల్లో జమిందార్లు చాలా తక్కువ. అందులో వాళ్ళు ఒకరు. చాలా మంది బ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళని ఆశ్రయించి జీవనం గడుపుతుండేవారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ వాళ్ళ దివాణంలో పనిచేస్తుండేవారు. గుమాస్తాలందరికీ వరుసగా ఇళ్ళు కట్టించి, కుటుంబానికి ఒక ఆవును ఇచ్చేవారు. గుమాస్తాలు జమిందార్ల పొలాలు, తోటలు పంటల వ్యవహారాలు చూస్తుండేవారు. పనివాళ్ళచేత పనులు చేయిస్తుండేవారు
       అలా ఎప్పుడో వెళ్ళి అక్కడే స్థిరపడిన కుటుంబాలలో మా అమ్మమ్మ గారి కుటుంబం ఒకటిఒకేచూరు క్రింద వరుసగా ఏడు ఇళ్ళు ఉండేవి. అందులో ఒక ఇంట్లో ఉండేవారు. మా మామయ్య జమిందార్లు దగ్గర గుమస్తాగా పనిచేసేవారు. మేము వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా అమ్మమ్మ ఇంటికి వెళ్ళడంతో ఎక్కువ అక్కడే అలవాటు. జమిందార్లకు పిల్లలంటే  ఇష్టం .అందులోనూ మేము కాకినాడ వాళ్ళం అవటంతో కొంచెం చురుకుగా ఉండేవాళ్ళం. ( సాధారణంగా కాకినాడ వాళ్ళు కొంచెం చురుకెక్కువని అందరూ అంటారు.)  దానితో వాళ్ళు దివాణంలో ఉన్నరోజులలో రాత్రి పనివాళ్ళచేత మాకు కబురు పంపేవారు. నేను , మా తమ్ముడు వెళ్ళేవాళ్ళం. మూడంతస్తుల మేడ అది టెర్రస్ పైన వరసగా పెద్ద పెద్ద పట్టెమంచాలు వేయించి పరుపులు, తెల్లటి దుప్పట్లు వేసి ఉండేవి. వాళ్ళతో సమానంగా మాకు కూడా మంచాలు , పరుపులు వేయించేవారు. పనివాళ్ళు కిందన చాపలు వేసుకొని పడుకొనేవారు.  మంచాల పక్కన స్టూల్స్ మీద్  పెద్ద ఇత్తడి చెంబులతో మంచినీళ్ళు, రాత్రి కబుర్లలో నంచుకొంటూ తినటానికి తినుబండారాలు ఉండేవి.

 అక్కడనుంచి మాతో కబుర్లు చెప్పించుకొంటూ, సినిమాలలో పాటలు పాడిస్తూ ఉండేవారు. అప్పట్లో శంకరాభరణం సినిమా కొత్తగా వచ్చింది. ఎక్కువగా సినిమాలో పాటలు పాడిస్తుండేవారు. మధ్యలో జంతికలు. సున్నుండలు, అరిసెలు, మొదలైన తినుబండారాలు వాళ్ళతో పాటు పెడితే , తినేవాళ్ళం. అపుడపుడు వేడివేడి యాలకుల పాలు ఇచ్చేవారు.
 అలా పాటలు, కబుర్లతో ఎత్తైన మేడ మీద చల్లటి గోదావరి పైనుంచి వచ్చే గాలి, పండు వెన్నెలలో హాయిగా నిద్రపోయేవాళ్ళం. వారితో అంత చనువు ఉండటంతో మాకు పనివాళ్ళు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారు. అందువలన పగటి సమయంలో ఎండగా ఉన్నపుడు జమిందార్లు ఉన్నా , లేకపోయినా మేము మేడ ఎక్కి విశాలమైన వరండాలలో చల్లటి గాలిలో ఆడుకొని, కాసేపు పడుకొని హాయిగా గడిపేవాళ్ళం. మాకు వేసవి కష్టం తెలిసేది కాదు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం