కొత్త పంచాంగం......


       ఉగాది వచ్చింది కదా ! కొత్త పంచాంగాలు వచ్చాయి. గడచిన సంవత్సరంలో జరిగిన మంచి చెడులు మర్చిపోయి , రాబోయే సంవత్సరంలో శుభాశుభాలు, లాభనష్టాలు, ఆదాయవ్యయాలు అందరూ చూసుకొంటూ ఉంటారు. కోటి ఆశలతో సంవత్సరమైనా బాగుండాలని, మనలోని ఊహలకు కొత్తరూపు దాల్చాలని, రకరకాల కోరికలతో పంచాంగాన్ని తెరచి ఆశగా చూస్తుంటారు.
       నా భార్యామణికి కొత్త పంచాంగం రావటం ఆలశ్యం వెంటనే తెరచి తనవి, నావి రాశిఫలాలు చూసేస్తుంది. అక్కడితో ఆగదు, అన్ని రాశిఫలాలు కూడా చూసేస్తుంది. రాశి వాళ్ళకి ఎలా ఉందో , ఎవరి ఆదాయవ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్యం, అవమానాలు రకంగా ఉంటాయో అన్నీ చూసి చెప్తుంది. నిన్న ఆదివారం ఖాళీ దొరికితే అలాగే కొత్తపంచాంగం తీసుకొని అన్ని రాశుల వాళ్ళవి ఫలితాలు చదివేసి కొంతసేపు విశ్లేషణ చేసేసింది. ఆఖరున ఒక సందేహం వెలి బుచ్చింది. చాలా రాశుల వాళ్ళకి ఆదాయం 6  వ్యయం 12 అని రాసారు కదా, మనకి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఎలా ఖర్చు పెడతారండీ అంటూ

       అవును రోజులలో అందరికీ కూడా రాశి ఫలాలలో రాసినా రాయకపోయినా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం అలవాటు అయింది. మన జేబులో డబ్బు ఖర్చు కాకుండా ఉంటే ఎంత అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఉదయం లేచిన దగ్గరనుంచి చూస్తే పాల పేకెట్స్ రోజూ వేసేస్తాడు. చివరన నెలకు అయినదంతా తీసుకొంటాడు . రోజూ చిల్లరమార్చుకొని ఉంచక్కరలేదు. సరే పేపరు వాడు కూడా అంతే నెలంతా వేసి తర్వాత నెలలో బిల్లు ఇస్తాడు. బియ్యం కొట్టు వాడు, కిరాణాషాప్ వాడు అరువులు ఇచ్చేస్తున్నారు. కావలసినవి తెచ్చుకోడం తరవాత చెల్లించడం.
       కేబుల్ , నెట్ అన్నీ పోస్ట్ పెయిడ్సే ముందు వాడేసుకో, తర్వాత చెల్లించు పద్ధతే. పేపరు చదువుతున్నా, టి. వీ  పెట్టినా వివిధ రకాల కంపెనీలు, షాపుల వాళ్ళు ఇచ్చే ప్రకటనలు. రూపాయి మాత్రమే చెల్లించండి, . సి లు, టి.వి. లు, మోటారుసైకిళ్ళు, కార్లు అన్నీ పట్టుకుపొండి, మిగిలిన సొమ్ము సులభవాయిదాలలో చెల్లించండి అంటూఇప్పుడు చెల్లించనక్కరలేదు కదా నెమ్మదిగా ఇవ్వచ్చు అనుకొంటూ సగటు జీవి కనిపించినవన్నీ కొనుక్కుపోతున్నాడు.
       స్థలాలు, ఇళ్ళు, అపార్ట్ మెంట్లు అన్నీ ఇన్ స్టాల్ మెంట్ పద్ధతులు వచ్చేసాయి కదా! అలా ఇవ్వకపోతే వాళ్ళ వ్యాపారం సాగటంలేదు మరి. మనకీ కోరికలు ఎక్కువ మన దగ్గర ఉండే సొమ్ము తక్కువ . ఇద్దరికీ కుదిరింది. ఇన్ స్టాల్ మెంట్ లో ఇస్తే ఇండియాను కొనేయటానికీ మనం రెడీనే .
       అంతెందుకు పక్కింటి పిన్నిగారి చెల్లి తెస్తుందనో, ఎదురింటి వదినగారి ఆడపడుచు అమ్ముతుందనో ఆడవాళ్ళు చీరలు చూడటానికి వెళుతుంటారు కదా. ( పెద్దపెద్ద షాపులలో కొనుక్కున్నప్పటికీ కూడా, ఇలాటి చోట బేరాలు ఆడి, వందరకాలు చూసి నాలుగు చీరలు కొనుక్కోవటం . అదో తుత్తి). నలుగురు అయిదుగురు వెళ్ళటం, ముందు చూద్దాం ఏమేం రకాలు ఉన్నాయో అనుకొంటూ. వాళ్ళు అన్ని రకాలు చూపించి, చీర మీ కోసమే తెచ్చేనండీ అనీ, కంపెనీ వాడు మీ కోసమే తయారుచేసాడండీ అని నాలుగు కబుర్లు చెప్పేటప్పటికి, కనీసం రెండు, మూడు చీరలు కొనుక్కొని వస్తారు. పైగా ఇప్పుడేమీ ఇవ్వక్కరలేదండీ నెలనెలా కొంత ఇవ్వచ్చుట అని మనకి వెన్నరాయటం. అక్కడికేదో ఆవిడ ఉత్తినే ఇచ్చినట్లు కొనేస్తారు.
       మగ వాళ్ళు మాత్రం తక్కువ తినలేదు లెండి. ఆఫీస్ లో ఎవరో తెలిసిన వాడు తెచ్చాడనో, స్నేహితుడు తీసుకో మన్నాడనో అప్పుడప్పుడు అవసరం లేనివి ఇలా కొనడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే మన జేబులోంచి ఇప్పటికిప్పుడు ఇవ్వనక్కరలేదు కదా నెమ్మదిగా చెల్లించవచ్చును అన్న ధీమా. ఇప్పుడు చెప్పండి. అందరి రాశి ఫలాలు ఆదాయం 6 వ్యయం 12 కాదంటారా?
       
ఉచిత బ్రాహ్మణ వధూవరుల సమాచారం కోసం చూడండి.
 kakinadakajatalambralu.blogspot.in 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం