అవునంటే కాదనిలే.....

                                         
       "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అనే పాటలోఅవునంటె కాదనిలే.. కాదంటె అవుననిలేఅన్నారు సినీకవి. పాపం అది కేవలం ఆడవారికే కాదండీ , మగవారికి కూడా వర్తిస్తుంది.
       సాధారణంగా మనకి మనసులో ఒకటి ఉంటుంది. కాని దాన్ని బయటకు చెప్పలేము. మనం అనుకొనేదానికి వ్యతిరేకంగా చెప్తాం. ఎవరింటికైనా వెళ్ళాము అనుకోండి. వాళ్ళు టిఫినో , కాఫీనో ఇస్తున్నారనుకోండి. అబ్బే ఎందుకండీ శ్రమ, వద్దు ,వద్దు అంటుంటాము చేయి మాత్రం అందుకొంటుంది. అంటే మనసులో తీసుకోవాలని ఉంది. కాని పైకి అలా మర్యాద కోసం అంటాం అన్నమాట.
       కొంతమంది మగవాళ్ళు స్నేహితులతో గొప్పగా " మా ఇంట్లో నేను ఎంత చెపితే అంత, మా ఆవిడని నోరు ఎత్తనీయను తెలుసా? " అన్నారనుకోండి తప్పకుండా ఇంట్లో పిల్లిలా ఉంటాడని, వాళ్ళ ఆవిడ కొంగుచాటు భర్తేనని లెక్క. ( అంటే హెన్ పెక్డ్ అన్నమాట). ఇంట్లో నిజానికి ఈయన మాట ఎవరూ వినరు, అలా వినాలని అనుకొంటాడు, కనీసం అలా బయట చెప్పుకుంటాడు.
       కొందరు ఆడవాళ్ళు ఎదురింటికో, పక్కింటికో ఏదైనా అమ్మకానికి వచ్చినపుడు ఇరుగుపొరుగు కొంటూ, మీరూ తీసుకోండి అంటే " అమ్మో! మా ఆయన ఏమంటారో. ఆయనని అడగందే ఏమీ చేయను." అంటారు. నిజానికి ఆవిడకు వస్తువు కొనడం ఇష్టం లేక అయి ఉండవచ్చు. కాని వాళ్ళ ఆయన మీదకు తోసేస్తారు. వాళ్ళ ఆయన అంత శాసించేవాడు అయిఉండక పోవచ్చును. ఈవిడ చేతిలో అప్పడాలకర్ర చేత దెబ్బలు తినేవాడే అయిఉంటాడు.
       కొంతమంది వాళ్ళు చేసిన చిన్నచిన్న పనులను కూడా చిలవలు పలవలు కల్పించి చెప్తారు. కాని "నాకు ఇంత చేసి అంత చెప్పుకోడం ఇష్టం ఉండదు. నాకు గొప్పలు చెప్పుకోడం అంటే చిరాకు" అంటారు. కాని మనసులో వాళ్ళు చేసిన చిన్న పనికే అందరూ గుర్తించేయాలనిఆస్కార్ లు, నోబుల్ ప్రైజ్ లు ఇచ్చేయాలని అనుకొంటారు
       రాజకీయ నాయకులను చూడండి. ప్రసంగాలలో " మేమేమీ పదవీ కాంక్షతో రాలేదు. ఏదో ప్రజలకు సేవ చేద్దామని వచ్చాము. అంతే కాని కోట్లు సంపాదించేద్దామని కాదు. " అంటారు. పదవిలోకి వచ్చాక చేసేది అది కాదా?
       ఎవరైనా " మీకోసమే చెప్తున్నా . ఇందులో నాకేమన్నా లాభం ఉందా " అన్నారంటే నిజంగానే అది వాళ్ళకోసమే చేసుకొంటున్నారని అర్ధం.
       రోగులను హాస్పటల్ లో చేర్చి కొంచెం కోలుకున్నాడు అనుకొన్నపుడు ఇంటికి తీసుకుపోదాం అనుకొంటాం. డాక్టర్స్, నర్స్ లు మాత్రం " ఇంకో రెండు, మూడు రోజులు ఉంచండి. ఇక్కడ అయితే మా అబ్జర్వేషన్ లో ఉంటాడని, మాకేదో డబ్బులు వస్తాయని కాదు" అంటారు. కాని నిజానికి రూమ్ రెంట్ కోసమే అలా అంటారని అనుకోవచ్చును.
       మనం ఇంట్లో పనులు చేయిస్తుంటే మేస్త్రీ గాని , వడ్రంగి కాని , పెయింటర్ కాని సామానులు కొనడానికి వాళ్ళకి తెలుసున్న షాప్ లకే తీసుకు వెళ్తారు. అక్కడ మనం ఎపుడు వినని బ్రాండ్ అయినా " ఇది చాలా మంచిదండి. నేను ఎపుడు ఇదే వాడతాను. " అంటాడు. మరో బ్రాండ్ బాగా తక్కువన్నా సరే " మీ ఇష్టమండి, ఇది అయితే నెం 1 . మీ కోసమే చెప్తున్నా , నాకేమీ ఇందులో లాభమేమీ లేదు. " అన్నాడంటే ఇందులో బాగా కమిషన్ వస్తుంది కాబట్టి ఇదే కొనిపించడానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధం.
       ఇవన్నీ సరదాగా వ్రాసినవి అన్ని సందర్భాలలో అంతే అని కాదు లెండి. అయినా ఎవరి మాటో నాకెందుకు నాకు మాత్రం మా ఆవిడ అంటే చాలా భయం. ఆవిడ గీసిన గీత దాటను.





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం