కప్పల తక్కెడ
ఏ పేపర్ చూసినా, ఏ చానల్ పెట్టినా ఒకటే వార్తలు. ఎన్నికల కాలం ఎన్ని ’కలల" కాలం కదా. ప్రతీ పార్టీ నుంచి వలసలు. ఆ పార్టీ తీర్థం పుచ్చుకొన్న ఫలానా నాయకుడు. ఈ పార్టీ కండువా కప్పుకొన్న ఫలానా నాయకుడు అంటూ. నిన్నటి వరకూ విమర్శించిన పార్టీ నేడు ఆశ్రయం ఇస్తోంది. ఇందులో చేరటం ఆ పార్టీని తిట్టడం. నిన్నటి వరకూ బాగున్న పార్టీ ఈ రోజెందుకు చెడ్డదయిందో మరి. నిన్నటి వరకూ చెడ్డదయిన పార్టీ నేడు ఎందుకు మంచిదయిందో. ఈ పార్టీల ఫిరాయింపులు చూస్తుంటే కప్పల తక్కెడ గుర్తు వస్తోంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నా పావులు సామాన్య ప్రజలే. వాళ్ళ కోరికలు తీర్చుకోడం కోసం పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలని కాదు. వాళ్ళ రాజకీయ అవకాశాలు మెరుగుపరుచుకొనేందుకు, వాళ్ళకి ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తే ఆ పార్టీ లోకి దూకేయడమే. జట్లు మారడం లేదు ఆటగాళ్ళు మారుతున్నారు అంతే. వాళ్ళు తన్నే బంతి సామాన్యుడే. వాళ్ళ కాలి తన్నులు తింటూ , వాళ్ళకి గోల్సు సంపాదించిపెట్టవలసినది మామూలు ప్రజలే. తన్నులు వీళ్ళకి, ప్రయోజనాలు నాయకులకి.