మామూలు..మామూలుగా .....
ఈ రోజు ఏప్రిల్ 23 కదా మామూలుగా ఎప్పటిలాగే ప్రతి ఏడాది లాగే విద్యా సంవత్సరం ఆఖరి రోజు. రేపటి నుంచి వేసవి శలవులు కదా. అందరూ పరీక్షలు అయిపోయిన ఆనందం, రేపటి నుంచి హాయిగా ఆట పాటలతో సంతోషంగా గడపవచ్చనే ఊహలతో పిల్లలందరూ ఎగురుకుంటూ ఇళ్ళకు వెళ్ళి పోయారు. మేము మామూలుగా శలవులలో ఎలక్షన్స్ ఉండటం వలన వాళ్ళకి కావలసిన రూమ్ లు, బెంచీలు, బల్లలు , కుర్చీలు సర్దించి బయలుదేరాము. ఎవరెవరికి ఎక్కడ డ్యూటీలు పడతాయో అనుకొంటూ. మేము మామూలుగా ఏ ఊర్లూ కదలము. కాని ఈ సారి మా కజిన్ గృహాప్రవేశం బెంగుళూరులో ఉండటం వలన ఈ రోజే శేషాద్రి ఎక్స్ ప్రెస్స్ కి బయలుదేరుతున్నాం. స్కూల్ నుంచి వచ్చి అన్నీ సర్దుకొని రెడీ అయాము. మామూలుగా కాకినాడ వాళ్ళు చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు సాధారణంగా తీసుకువెళ్ళే " కాకినాడ కాజాలు" తీసుకొచ్చాను. మన బ్లాగ్ కాదండీ తయారుచేసిన కాజాలు. మామూలుగా స్కూల్ కి వెళ్ళినట్లుగానే ఓ గంట ముందు రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము. మామూలుగా లేట్ కాకుండా 5.35 కే బండి బయలుదేరింది. మాకు నలుగురికీ రిజర్వేషన్ ఉంది. మాతో పాటు చేయించి అనుకోకుండా కాన్సిల్ చేయించడం వలన మా మేనల్లుడికి మాత్రం లేదు. వాడిని విజయవాడలో మా చెల్లెలు ,బావ గారికి అప్పచెప్పాలి. సరే మామూలు టికెట్ కొని ఎక్కేసాము. రాజమండ్రి వెళ్ళేసరికి టి.టి.ఈ వచ్చాడు. మామూలుగా సినిమాలలో చూపించినట్లుగా బ్రహ్మానందం వాళ్ళలా లేడు. నల్లగా, బొజ్జతో, బట్టతలతో, సీరియస్ గా ఉన్నాడు. మా టికెట్లు చూసాడు. మా మేనల్లుడి టికెట్ చూపించాము. కేన్సిల్ చేసిన టికెట్స్ చూపించాము “ఆఖరినిమిషంలో మామూలు టికెట్ కొన్నాము. పదేళ్ళవాడిని వేరే కూర్బోబెట్టలేము కాదా అని మాతో కూర్చోబెట్టుకున్నాము. విజయవాడ వరకే” అని మామూలుగా అలవాటుగా పాఠం చెప్పినట్లు చెప్పాను. అతను మాత్రం అబ్బే కుదరదండీ డిఫరెన్స్ కట్టాలండీ అన్నాడు. సరే చెప్పండి. అన్నాను. “చాలా అవుతుంది. అలా ఎందుకండీ మామూలుగా కూర్చోబెట్టుకోండి. ఎంతో కొంత ఇవ్వండి” అన్నాడు మామూలుగానే సీరియస్ గా. నాకు మామూలుగానే వెంటనే అర్ధం అయింది. “మామూలు”
అడుగుతున్నాడని. సరే అని నేను ఇచ్చిన “వంద నోటు”
కోటు జేబులో పెట్టుకొని చాలా మామూలుగా వెళ్ళి పోయాడు. మేము మామూలుగా కూర్చొని వచ్చేసాము. ట్రైన్ మామూలుగానే కొంచెం లేట్ లో నడుస్తోంది. మామూలుగానే రేణిగుంట అవుటర్ లో అరగంట ఆపాడు. మామూలుగా తిరుపతి కొంచెం లేట్ గా చేరింది.తిరుపతి నుంచి చిత్తురు రోజూ మామూలుగా వెళ్ళి ఉద్యోగం చేసుకొనే వాళ్ళు మామూలు సీజన్ టికెట్ తో చాలా మామూలుగా మా కంపార్ట్మెంట్ లోకి ఎక్కేసారు. ఇది రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అంటే , మాకు ఇది మామూలే అని మామూలుగానే కూర్చోండిపోయారు.
మాకు ఇది మామూలే అని మామూలుగానే కూర్చోండిపోయారు.
నేను బెంగుళూర్ వెళ్ళినా మన బ్లాగ్ మాత్రం మామూలుగానే వ్రాస్తుంటాను. మీరు కూడా మామూలుగానే చదువుతారు కదూ.