మీ పిల్లలు బయటకెళితే ఏం చేస్తారో మీకు తెలుసా?

       ఏమిటీ బొమ్మరిల్లులో జయసుధ డైలాగ్ లు గుర్తుకొస్తున్నాయా? నిజమే మన పిల్లలు మన ఇంట్లో, మన ఎదురుగా ఉన్నట్లే అన్ని చోట్ల ఉంటారనుకొంటాము. కాని అది తప్పు చాలా మంది పిల్లలు బయటకు వెళ్ళేక వేరే విధంగా ప్రవర్తిస్తారు. అది ఎవరూ ఏమీ అనరులే అన్న భావం కావచ్చు. తోటి స్నేహితులతో కలిసినపుడు వాళ్ళ ప్రభావం వలన అయిఉండవచ్చు. కారణం ఏదైనా వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది
       చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తే రిక్షాలలో గాని, ఆటోలలో గాని, బస్ లలో గాని స్కూల్ కి పంపుతుంటాము. కొందరు ఆటోలలో పరిమితికి మించి ఎక్కించుకొని వెళుతుంటారు. పిల్లలు ఆటోలలో కిక్కిరిసి కూచుని, బయటకు వేళ్ళాడుతూ ఉంటారు. తోటి వాళ్ళతో కబుర్లు చెబుతూ సరిగా పట్టుకోక పోవడం జరుగుతుంటుంది. పొరపాటున ఏదైనా ఎత్తుపల్లాలు, గోతులు వచ్చినపుడు కుదుపులకు పడిపోయే ప్రమాదం ఉంది. మన ఇంటిదగ్గర తక్కువమంది ఎక్కి ఉండచ్చు, కాని చివరికి చాలామందిని ఎక్కిస్తున్నాడేమో గమనించుకోవాలి. అదేవిధంగా ఓవర్ లోడ్ చేసి ఎత్తులు వచ్చినపుడు, ఆగిపోయినపుడు, రిక్షాలను, ఆటోలను పిల్లలచేత నెట్టిస్తుంటారు. పిల్లలకు కూడా ఇది సరదాగా అనిపిస్తుంది. కాని అది ప్రమాదకరం.   

       అంతేకాదు పిల్లలు ఆటోలను పక్కనుంచి పోయే వాహనాలను దాటించమని డ్రైవర్స్ ని తొందరపెట్టడం, అదేవిధంగా పక్కనుంచి వెళ్ళేవాళ్ళపై కామెంట్స్ చేయడం, ఆటోలు, బస్ లలో టిఫిన్స్ చేయడం, మిగిలిన పదార్ధాలను బయటకు పారబోయడం, చేతులు కడగటం చేస్తుంటారు, సాయంత్రం బాటిల్ లో మిగిలిన నీటిని బయటకు వంపడం చేస్తుంటారు. అది పక్కనుంచి వెళ్ళేవారిపై పడే ప్రమాదం ఉందని అలా చేయకూడదని మనం నేర్పుతుండాలి. మనకి కూడా అలాటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది.
       కొంతమంది పిల్లలు ఇంట్లో పులి వీధిలో పిల్లిలా ఉంటారు. వీళ్ళతో పెద్ద ప్రమాదం లేదు కాని కొందరు మాత్రం ఇంట్లో పిల్లి, బయట పులి లా ఉంటారు, బయటకు వెళితే విపరీతంగా అల్లరి చేస్తారు. అందులో మిగిలిన అందరినీ చూస్తే మరీ అందరూ కలిసి అల్లరి చేస్తుంటారు. మనం ఇలాటివి గమనించుకుంటుండాలి.  
                   కొంతమంది ఇతరుల నుంచి త్వరగా అనవసరమైన మాటలు, అసభ్యకరమైన మాటలు నేర్చుకొంటారు. అవి మాట్లాడకూడదని వాళ్ళకి తెలియదు . తోటివాళ్ళను చూసి వాళ్ళు మాట్లడుతుంటారు అవి గమనిస్తూ ఎప్పటికప్పుడు సరిదిద్దుతుండాలి. అలాగే క్లాస్ లో టీచర్స్ పై కామెంట్స్ చేయడం అవీ చేస్తున్నపుడు మనం తప్పని  చెప్పి సరిచేయాలి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం