శ్రీరాముడు మాన్యుడా ? సామాన్యుడా?
శ్రీరాముడు మానవ రూపంలో ఉన్న దేముడిగా భావిస్తాము అందరూ . మరి మానవ రూపంలో ఉన్నపుడు దేముడైనా , రాముడైనా సామాన్యుడిగానే బతికాడు. సామాన్యులలో ఏఏ మంచి లక్షణాలు ఉంటే మాన్యులు అవుతారో చేసి చూపించాడు.
నలుగురు అన్నదమ్ములలో ఒకడిగా పుట్టి అన్నగా ఆదర్శంగా నిలిచాడు. అన్నదమ్ముల అన్యోన్యానికి ప్రతీకగా నిలిచారు. చిన్ననాటనే రాజరిక ఆచారాలననుసరించి విలువిద్య మొదలైన యుద్ధవిద్యలు నేర్చాడు. విశ్వామిత్రుని కోరిక మేరకు యజ్ఞవాటికను రక్షించడానికి వెళ్ళి రాజధర్మాన్ని అనుసరించాడు. రాక్షసులను వధించి యాగసంరక్షణను చేసాడు. స్వయంవరంలో శివధనుస్సును విరిచి పరాక్రమంతో సీతను గెలిచాడు. సీతను పరిణయమాడి ఏకపత్నీవ్రతుడుగా ప్రపంచానికి మంచి దారిచూపాడు. తండ్రి మాటను జవదాటక రాజ్యాన్ని పరిత్యజించి , అడవులకు బయలుదేరాడు. కఠినమైనదైనా, కష్టసాధ్యమైనదైనా భర్తను అనుసరించింది ఆ సీతా మాత. సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేసాడు ఆ రామయ్య. బంగారుజింక లోకంలో ఉండదని తెలిసీ భార్యకోరిక తీర్చాలని వెళ్ళాడు. సీతాపహరణం అనంతరం ఆమెను వెదకుతూ హనుమంతుడు, సుగ్రీవుని కలిసాడు. స్నేహధర్మం కోసం వాలిని చంపి
కిష్కింధారాజ్యానికి రాజును చేసాడు. వానరుల సాయంతో సీతాన్వేషణను కొనసాగించాడు. యుద్ధంలో తన యుద్ధకౌశలాన్ని చూపి రావణున్ని చంపి సీతను తెచ్చాడు. ప్రజారంజకంగా పాలించి రామరాజ్యం స్థాపించాడు.
శ్రీకృష్ణుని వలే ఏ మాయలు, మహత్యాలు చూపలేదు. మామూలు మానవునిలా బతికాడు. సామాన్యులలో మాన్యునిలా వెలిగాడు. ప్రతివారి గుండెలలో వెలిసాడు. బడి లేని ఊర్లు ఉన్నాయి కాని రాముని గుడి లేని ఊర్లు లేవు . అందుకే రాముడు సామాన్యులలో మాన్యుడు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు.