అద్దం లాంటి మనసు.


నాకు ఎందుకో అద్దం అంటే చాలాఇష్టం. అద్దం ఉన్నదున్నట్లు చూపిస్తుందని అయి ఉండవచ్చు. నిజమే అద్దం మనుషులలాగా ఎదుటి వాడి మెప్పు కోసం అబద్ధం చెప్పదు. అంతేకాదు మనం నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. అంతే కాని లోకంలో కొందరిలా మనని చూసి నవ్వదు. అద్దానికి కుల,మత,వర్ణ,భాషా,లింగ బేధాలు లేవు మనుషుల లాగా. అది అందరినీ ఒకేలా చూస్తుంది. అందరినీ ఒకేలా చూపుతుంది.

       మనం కూడా ఒకొక్కపుడు మన మనసుకి అబద్దం చెప్పుకొని మనని మనమే మోసం చేసుకొంటుంటాం, కాని పాపం అద్దం మాత్రం అలా చేయదు. అది ఉన్నదున్నట్లు మొహం మీదే చెప్తుంది, అదే చూపుతుంది. అందుకే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అద్దం అంటే ఎంతో ఇష్టం. ఎటొచ్చీ మన కుడి ఎడమలను మాత్రం తారుమారుగా చూపుతుంది. అయినప్పటికీ మనని మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో చూడటానికి ఒక అవకాశం ఇస్తోంది కదా!. దానిని బట్టి మనం ఎలా ఉంటే ఇతరులకు చూడటానికి బాగుంటామో తెలుసుకోడానికి కుదురుతోంది అద్దం వలనే. అద్దం ముందు నిలుచుని మనని మనం చూసుకొంటూ ఉంటే మనతో మనం మాట్లాడుకోవచ్చును అనిపిస్తుంది నాకు. ఒంటరిగా ఉన్న భావన తొలగిపోడానికి అద్దం చూసుకొంటే మనకో తోడు ఉన్నారన్న భావం కలుగుతుంది.

       అద్దం ముందు నిలుచుని మనతో మనం మాట్లాడుకొంటే మనంచేసిన తప్పు ఒప్పు జడ్జ్ చేసుకోవచ్చును . అద్దం నన్ను అలాగే చేస్తుంది. నేను చేసిన పనులు లేదా ఇతరులతో నా ప్రవర్తన అన్నింటినీ నిజాయితీగా నిలదీస్తుంది. మళ్ళీ అలా చేయకు అని హెచ్చరిస్తుంది కూడా. అందుకే నేను అద్దానికి భయపడతాను కూడా.


       ఒకరకంగా చెప్పాలంటే అద్దం మనకు ఆదర్శం కూడా మనమందరం అలా ఉండటానికి ప్రయత్నించాలి. ఇతరులు ఏమనుకొంటారో అని కాకుండా నిజాన్ని ముఖం మీద చెప్పగలగాలి. అంతే కాని నిజానికి మొహమాటం అనే ముసుగు వేసి అబద్దం చెప్పకూడదు


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం