తాటి ముంజలు తిన్నారా?
సాధారణంగా తాటి ముంజలు అనగానే నగరాలలోని వాళ్లకి గుర్తుకొచ్చేవి ఇవే కదా? వేసవి కాలం ఎండలో వెళుతుంటే రోడ్డు పక్కన చల్లటి చెట్టు నీడన కూర్చుని గంపలో తెచ్చిన తాటి ముంజలను చాకచక్యంగా కత్తితో చెక్కి దానిలోంచి ముంజలను తీసి తాటి ఆకులలో పెట్టి ఇస్తుండే వాళ్ళు మనకు తెలుసు
అవి తెచ్చుకొని ఇలా వలచుకొని తింటూ ఉంటాము. అవి చాలా చల్లగా , రుచిగా ఉంటాయి . కాని తాటి ముంజలను తినడంలో అసలు మజా వేరే ఉంది. వీటిని చూడండి.
ఇలా కత్తితో చెక్కిన ముంజలకు రెండు, లేదా మూడు కన్నులు ఉంటాయి . వీటిని మన బొటనవేలితో పొడుచుకుని తినాలి. అలా పొడవగానే చివ్వున ముంజల రసం మీదకు చిమ్ముతుంది జాగ్రత్త . అది బట్టల మీద పడిందంటే మరక పడిపోతుంది . దానిని జాగ్రత్తగా నోటి దగ్గరకు తెచ్చుకొని నాలుకతో అందుకొని తినాలి. ఒక్కో కన్నుని అలా పొడుచుకొని తింటుంటేనే మరి బాగుంటుంది .
చూడండి ఈ పిల్లలు ఎలా తింటున్నారో . మీకూ తినాలని ఉంది కదూ .