ఎందుకో ఏమిటో...
ఎందుకో ఏమిటో...
చిన్న పిల్లల్ని చూడండి. వారి చేతిలోని బొమ్మ కాని చాక్లెట్ కాని సరదాగా అడిగాం అనుకోండి. అమ్మా నాది అంటారు. ఆ వయస్సులో మనం చూసేవి అన్నీ మనవే, మనవి మాత్రమే అనే భావన ఉంటుంది. అది ఆ వయసు రీత్యా సహజం. వయసు పెరిగే కొద్దీ అందరితో పంచుకోవటం, సమానత్వ భావం మొదలయినవి అలవడుతుంటాయి.
మనం చూస్తూ ఉంటాం బస్ గాని రైల్ గాని ఎక్కినపుడు మన సీటును మన స్వంత ఆస్తిగా భావిస్తుంటాము. కాని మన ప్రయాణం అయే వరకే అనుకోము. మన ముందు, మన తర్వాతా కూడా అదే సీట్ ను చాలా మంది పంచుకొని ఉంటారు. కొందరిలో ఇంకా ఆ చిన్నపిల్లల మనస్తత్వం మారదెందుకో. ఈ గాలి , ఈ నేలా, ఈ ఊరూ, మనందరిదీ . వెండి వెన్నెల జాబిలిని చూస్తూ ప్రయాణిస్తూ ఉంటే మనతోనే వస్తున్నట్లు ఉంటుంది. కాని అది నిజం కాదు కదా? జాబిలి మన ఒక్కరి సొంతం కాదు కదా? ప్రకృతి సౌందర్యం నిండి ఉన్న ప్రదేశాలను చూస్తే ఎవరికైన మనసు పరవశిస్తుంది . మన సంస్కృతి, సాంప్రదాయాలు,మన ఊరు, మన పండుగలూ, మన దేవాలయాలు అన్నీ అందరివీ, అందరికీ. చూసినపుడు అందరికీ మనసు స్పందిస్తుంది. అయితే భావవ్యక్తీకరణలో భేధాలు ఉండవచ్చు. ఏది ఏమైనా మన లోని సంకుచిత భావాలను భోగి మంటలలో వేసి, నూతన పరిచయాలకు,వినూత్న ఆలోచనలకు, సృజనశీలతకు దారులు పరుద్దాం. శాంతి సౌహార్ద్రాలతో , సర్వ మానవ సౌభ్రాతత్వంతో మెలగుదాం.
మీ కాకినాడ కాజా
కామెంట్‌లు