ఆయన పుట్టారు..... లోకం నవ్వింది. ఆయన వెళ్ళిపొయారు.... లోకం ఏడ్చింది.
సినీ వినీలాకాశంలో దృవతారగా నిలచిన అక్కినేని, పలు రంగుల, హంగుల మాయా ప్రపంచంలో,
వివాదాలకు, విభేదాలకు దూరంగా, తామరాకుపై నీటి బొట్టులా నిలిచారు.అనేక ఒత్తిళ్ళు కలిగినా ఏ ఇజాలనూ , భేషజాలను దరికి రానీయక నిజాయితీ గా బ్రతికిన " బుద్ది మంతుడు" ఆయన.
ఆయన ఆడితే అందరి కళ్ళూ ఆయన మీదే , అందరి కాళ్ళు ఆయన తోనే ఎందుకంటే "చెంగావి రంగు చీర కట్టుకుని ", " కడవెత్తుకొని వెళ్ళే పడుచు పిల్లలతో", స్టెప్పులు వేసి, తెలుగు పాటకు నృత్య రీతులు నేర్పిన "దసరా బుల్లోడు" ఆయనే.
"
పూసింది పూసింది పున్నాగ " అంటూ ఆడుతూ, పాడుకొనే తెలుగింటి ఆడపిల్లలు అందరూ " సీతారామయ్య గారి మనవరాళ్ళే " .
"
పచ్చ బొట్టూ చెరిగిపోదూలే " అంటూ మనందరి మనసులలో ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిదే , మరువలేనిదే .
ఏ పాఠశాలలో , ఏ కళాశాలలో చదవక పోయినా, " ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులూ " , అనుకొని తన నిజ జీవితంలో ఎదురైన సంఘటనలే పాఠాలుగా మలచుకొన్నారు.
మనకున్న దానిలో ఇతరులకు పంచాలనే "మంచి మనసు" తో విద్యా సంస్థలు, కళాశాలలు నెలకొల్పిన "ధర్మదాత"
.
"గుండమ్మ" లాటి అత్తగారు ఉందో లేదో గాని "మిస్సమ్మ" లాటి అనుకూలవతిని భార్యగా పొందారు. కొడుకులూ కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళూ, మనవలూ, మనవరాళ్ళు తో ఆనందాలు నిండిన ఆయన ఇల్లు నిజంగా "రావుగారిల్లే"
, ఒక "ప్రేమ మందిరమే" .
తన నటనా వైదుష్యంతో మనలకు " ప్రేమాభిషేకం" చేసారు.
"జగమే మాయ, బ్రతుకే మాయ " అంటూ వేదాంత సారాన్ని బొధించారు.
తీవ్ర అనారోగ్యాన్ని కూడా జయించారు. ఆయన మృత్యుంజయుడే అనుకొన్నాము. మరి ఇంతలో ఏమయిందో, "ఈ లోకంతో నాకింక పని ఏముంది ’ అనుకొన్నారో, నిండు జీవితాన్ని మెండుగా గడిపి, " టాటా, వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవు " అని కనిపించని "కీలుగుర్రం" ఎక్కి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిన " బహు దూరపు బాటసారి "
మొన్నే ప్రెస్ మీట్ లో నేనింకా కనీసం ఆరేళ్ళు బ్రతుకుతాను అన్న మాటలు స్వర్గంలో దేవతలు ఈయనింకా రారులే అనుకొని ఉంటారు. హఠాత్తుగా దివికి వచ్చిన ఆయన్ని చూసి " ముందు తెలిసెనా ప్రభూ నీ మందిర మిటులుంచేమా" అని స్వాగతం పలకడానికి హడావిడి పడుతున్నారేమో !
కామెంట్‌లు