గుర్తుకొస్తున్నాయి... పద పదవె వయ్యారి గాలి పటమా..
గాలి పటాలు (పతంగులు) ఎగరేద్దాం
రండి.
సంక్రాంతి రోజుల్లో సందడి చేసేవి ఈ గాలిపటాలు కూడా. మన ప్రాంతంలో తక్కువ గాని తెలంగాణా లో సంక్రాంతి రోజుల్లో
పతంగులు ఎగరేయని కుర్రాడుండడు. ఇప్పుడు బజారు కెళితే బోలెడు రంగు రంగుల గాలి
పటాలు. వివిధ ఆకారాలలో దొరుకుతున్నాయి. ఈ గాలి పటాలు ఎగరేయటం అనేది చాలా దేశాలలో ఉంది రకరకాల్ పేర్లతో పిలిచినా తయారీలో వాడే వస్తువులు,
ఆకారాలు మారినా గాలి పటం తయారు చేయడం దాన్ని ఎగరేయడం ఎవ్వరికైనా సరదానే అని చెప్పవచ్చు.
గాలి పటాలు ఎగరేయటం పోటీలు కూడా జరుగుతాయి. మా చిన్నపుడు మేము స్వంతంగానే తయారు చేసుకొనే
వాళ్ళం. పాత న్యూస్ పేపర్స్ , కొబ్బరి ఈనెలు, ఉడక బెట్టిన మైదా పిండి ఉపయోగించి తయారు చేసేయడమే.
దీర్ఘ చతురస్రాకారంగా ఉండే పేపర్ ని పొడవు అంచుని వెడల్పు అంచుతో సమానంగా మడతపెట్టే వాళ్ళం. ఎక్కువ ఉన్న పేపరును చించేసే వాళ్ళం. పేపర్ నలుచదరంగా తయారయేది. ఒక పొడవు కొబ్బరి ఈనెను తీసుకొని నలుచదరపు కర్ణంగా, నిలువుగా
కాగితం ముక్కల సహాయంతో అంటించే వాళ్ళం. అది గాలిపటానికి వెన్నెముకలా ఆధారంగా నిలిచేది. మరొ ఈనెను వంచి దారం కట్టి, విల్లు ఆకారంలో తయారు చేసే వాళ్ళం. విల్లు పొడవు అంటే దారం పొడవు ఈ కాగితానికి మరో కర్ణంలా వుండేలా అమర్చి, దాన్ని కూడా కాగితం ముక్కలతో అంటించడమో, లేక సూది,
దారంతో పేపర్ కి కుట్టడమో చేసేవాళ్ళం. రెండు కర్ణాలు కలుసుకొనే చోట దారాన్ని కట్టే వాళ్ళం. ఇక గాలి పటం తయారయినట్లే. దానికి దారపు కండెల నుంచి తీసిన పొడవు దారం కడితే సరిపోయేది (దాన్నే మాంజా
అంటారు). దానికొక తోక కూడా తగిలించాలండోయ్. అబ్బో తోకల్లో మళ్ళీ ఎన్ని రకాలో ఎగరటానికి ఈ తోక చాలా అవసరం అయేది. గాలి పటం పరిమాణం బట్టి తోక పొడవు మారుతుంది. తోకకు మళ్ళి చిన్నచిన్న
తోకలు తగిల్చే వాళ్ళం. ఇదీ గాలి పటం తయారీ .
ఇక కాళీగా వుండే మైదానాలు , పాఠశాల మైదానాలు, చెట్లు, కరెంట్ తీగలు లేని చోట్లు వెతుక్కుని అక్కడ ఎగరేసేవాళ్ళం.
అక్కడ
మొదలయేది పోటీ . నా గాలి పటం బాగుంది. అంటే కాదు నాది అని.
యెగరేయడం కూడా ఒక కళే అది అందరికీ
వచ్చేది
కాదు. మొదట్లో ఎగరేసే నిపుణుల వెనకాలా తిరుగుతూ, వాళ్ళు దారం వదులుతూ వుంటే చూసి నేర్చుకొనే వాళ్ళం. గాలి వాలుని బట్టి ఎప్పుడు దారం వదలాలి, ఎప్పుడు లాగాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఎవరి గాలి పటం ఎత్తుకు
ఎగురుతుందో అని పోటీలు జరిగేవి . గాలి పటాన్ని రకరకాలుగా విన్యాసాలు చేయించేవారు. కొందరు అవతలి
వారి గాలి పటాన్ని తెంపేయడం, చిక్కులు పెట్టేయడం చేసేవారు కూడా. దారానికి గాజు పొడిని, జిగురులో
కలిపి
పూసి దానితో అవతలి వారి దారాన్ని తెంపేవారని చెప్పేవారు కూడా.
గాలి పటాలను పిల్లలు సరదాగా ఎగరేయడమే కాదు. వాతావరణంలో జరిగే మార్పులు , మబ్బుల గురించి తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు కూడా ఎగరేస్తారట .
కామెంట్‌లు