భోగ భాగ్యాలనిచ్చే భోగి పండుగ
భోగ భాగ్యాలనిచ్చే భోగి పండుగ
పల్లె సీమల్లో పంట చేతికి వచ్చి , గాదెలన్నీ నిండే ఈ రోజుల్లొ పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ
చేసుకొనే పండుగ నేడు. అందరి జీవితాలలో నూతన కాంతిని నింపే "సంక్రాంతి" పండుగలో
మొదటి రోజు ఈ రోజు. దీనినే మనం భోగి పండుగగా పిలుస్తాము.
"భోగి" అనగానే ముందు గుర్తుకు
వచ్చేది భోగి మంటలే. దీనిలో మన పూర్వీకుల దూరదృష్టి, శాస్త్రీయతా దృక్పధం దాగి ఉంది. భోగిమంటలలో వేసే రకరకాల చెట్ల కొమ్మలు సాధారణంగా ఔషధీయుతమయినవి కావటం వలన వాటిని మండించడంతో వాయురూపంలో వాతావరణంలోకి చేరి సూక్ష్మజీవి నాశకాలుగా పని
చేస్తుంది. తద్వారా మన ఆరోగ్యానికి పరోక్షంగా సహకరిస్తుంది. అనారోగ్యాలను పారదోలుతుంది. మనం ఎంతో పరమపవిత్రంగా భావించే ఆవు పేడతో చేసిన భోగి పిడకలు దండలు గుచ్చి చిన్నపిల్లలతో ఆ
మంటలలో వేయించడం కూడా అందుకే. అంతే కాక మానవుడు ఆదినుంచీ పంచభూతాలయిన అగ్ని, వాయువు,పృధ్వి, ఆకాసము,జలము లను పూజించేవాడు. అగ్ని దేవతారాధనలో భాగమే ఈ భోగిమంటలు వేయటంగా భావించవచ్చు. ఏది ఏమైనా సామూహికంగా అందరూ కలిసి, కలపను సేకరించి ,ఒకే చోట వీధిమొదట్లో తెల్లవారుఝామునే లేచి భోగిమంటలు వెలిగించి, చుట్టూ చేరి ఆనందంగా చలి కాగుతూ ఉండటం చూడతగ్గ ముచ్చట కదా!
ఇంట్లో పాతసామానులు మంటల్లో వేసి కాల్చివేయడం అనేది మన లోని పాత చెడు ఆలోచనలను దగ్ధం చేసి నూతన ఆలోచనలకు నాంది పలకాలని చెప్పటానికి ప్రతీకగా మనం భావించ వచ్చు. ఉదయం నుంచీ భోగిమంటల దగ్గర చేరటం, అందరూ అభ్యంగన స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి హడావిడిగా
తిరగటం
చూస్తే
కూడా పండుగే. కొత్త పంటలు చేతికి రాగానే కొత్త బియ్యం, కొత్త బెల్లం, పాలు, పెసరపప్పు ఉపయోగించి కొత్త కుండలో పొంగించే పొంగలిలా అందరి జీవితాలలో ఆనందం వెల్లి విరియాలని, ఆయురారోగ్యాలతో, అతి మధురంగా పొంగిపొర్లాలనే ఆకాంక్ష నిండి ఉంటుంది.
అందరికీ భోగి శుభాకాంక్షలతో
మీ కాకినాడ
కాజా
కామెంట్‌లు