తరాలు -- అంతరాలు
నేను పదవ తరగతి చదివే రోజుల్లో అది అయాకా ఏ కోర్సులు ఉంటాయో, ఏవి తీసుకుంటే బాగుంటుంది, ఆ కోర్సులో ఏఏ సబ్జక్ట్స్ ఉంటాయి తెలీదు. ఆ కోర్సు చదివిన తరువాత దానివల్ల ఏ ఉద్యోగాలు వస్తాయి కూడా తెలీదు. ఇంటర్ లో చేరాక అందులో ఏముంటాయో తెలిసింది. ఇంటర్ తర్వాత ఏమి చేస్తావు అంటే సమాధానం ఉండేది కాదు. ఏదో డిగ్రీ అయిందనిపించడం తర్వాత ఉద్యోగాలు వెదుక్కోవడం అలా ఉండేది.
ఈ
కాలం పిల్లలు అభిమన్యుడు లాటి వాళ్ళు. తల్లి గర్భం నుంచి అర్జునుడు చెప్తున్న పద్మవ్యూహచేధన విని నేర్చుకొన్నట్లుగా వీళ్ళు కూడా పుడుతూనే అన్నీ నేర్చేసుకొంటున్నారు. మా మేనల్లుడు ఎల్.కె.జి చదివేటప్పుడే కాకినాడలో ఉన్న అన్ని స్కూల్స్ గురించె చెప్పేవాడు. ఆ స్కూల్ లో హోమ్ వర్క్ ఇవ్వరుట. ఈ స్కూల్ లో భోజనం కూడా
అక్కడే నట అంటూ.
వాడు ఇప్పుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. వాడికి బొజ్జ నిండా కబుర్లు, బుర్రనిండా ఆలోచనలే. వాడు చూసిన కొత్త సినిమా గురించి చెబుతూ ఆ
సినిమాలో మహేష్ బాబు నాకు లానే తల గోక్కుంటూ ఆలోచిస్తాడు. అదీ ఇదీ అంటూ కబుర్లు చెప్తున్నాడు. నువ్వూ హీరో అవరా ఎందుకొచ్చింది అన్నాను సరదాగా. వెంటనే వాడు ఛీ నేనేం అవను నేను ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చదువుతాను అన్నాడు. అదేం సినిమా హీరో అయితే
బాగుంటుంది కదా బొలెడు డబ్బు, పేరు వస్తుంది అన్నాను.
వాడు ఏమీకాదు , నాలుగు సినిమాలు చేసాక చాన్సులు రాకపోతే నా పని కూడ ఉదయ్ కిరణ్ లా అయిపోతుంది. అన్నాడు.
ఆ
మాటలు విన్న నాకు అసలు ఆ వయస్సులో మాకు అంత ఆలోచనలు ఉండేవా? అనిపించింది. అదే జనరేషన్ గేప్ అనుకొన్నాను.
( ఆ మాటలు విన్న నాకు మరొక ఆలోచన తొలిచి వేస్తోంది. అన్ని సమస్యలకు ఆత్మహత్యే సమాధానమా అనిపించింది. అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? తర్వాత పోస్ట్ లో చర్చిద్దాము)