మోక్షగుండం మనవారే ....


అవునండీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన తెలుగువారే. ఆయన పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం. వారి పూర్వీకులు కర్ణాటక లోని కోలారు జిల్లా  ముద్దనహళ్ళిలో స్థిరపడ్డారు. ఇక్కడే మన విశ్వేశ్వరయ్య గారు 15 – 9 - 1861  జన్మించారుతండ్రి శ్రీనివాస శాస్త్రి , తల్లి వెంకట లక్ష్మమ్మ. తండ్రి ఆయుర్వేద వైద్యులు. చిన్నతనంలోనే తండ్రి మరణంతో , తల్లి సంరక్షణలోనే ఆయన పెరిగారు. కడు పేదరికంలో పాఠశాల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి . కాని చదువులో చాలా చురుకుగా ఉండటంతో ఉపాధ్యాయుల అభిమానానికి పాత్రుడయ్యి, పాఠశాల చదువును చిక్ బళ్ళాపూర్ లో పూర్తి చేసుకొన్నారు.
                   బెంగుళూర్ లోని మేనమామ వద్ద ఉండి పైచదువులు చదివారు. ఇంట్లోని రాగి పాత్రలు అమ్మి ఫీజులు చెల్లించి చదివారు. స్కూల్ ఫైనల్ పరీక్షకు ఫీజు కట్టేందుకు కుదరక పోతే పరీక్షకు హాజరు కానివ్వమన్నారు. పాపం పై అధికారులను ప్రాధేయపడి పరీక్షలు వ్రాసారు. మైసూర్ సంస్థానంలో ప్రధముడిగా నిలిచారు. గణితంలో మక్కువతో బి. గణితం చదివారు. అక్కడ ప్రిన్సిపాల్ గారి ఆదరణ పొందారు. ఆయన కోటుకు ఉన్న బంగారు బొత్తాములు విశ్వేశ్వరయ్యకు చెందాలని వీలునామాలో వ్రాసారంటే చూడండి. ఎంత ఇష్టమో ఈయనంటే. మైసూర్ సంస్థానం వారి సాయంతో పూణేలో 1883 లో ఇంజనీరింగ్ చదివారు.

       బొంబాయిలో  1884 లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరి, పంజారా నదీ జలాలను సైఫన్ పద్దతిలో గ్రామాలకు సరఫరా చేసే ప్రాజెక్ట్ పూర్తిచేసారు. సుక్కూర్ ప్రాజెక్ట్ ఆయన చేతులమీద నిర్మాణమయ్యింది. ప్రపంచంలోనే మొదటిసారిగా స్వయంచాలక కవాటాలను ఆయన నిర్మించారు. అరేబియా దేశంలోని ఏడెన్ లో ఎడారి ప్రాంతం కావటంతో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది. ఈయన దానికి భూగర్భ జలాశయ నిర్మాణంతో సమస్యను తీర్చారు.

       బాలగంగాధర తిలక్ తో కలిసి పూణేలో డక్కన్ క్లబ్ స్థాపించారు. హైదరాబాద్ కు మూసీ నది వరదల వలన చాలా నష్టం జరిగేదినిజామ్ నవాబ్ కోరిక మేరకు సమస్యను విశ్వేశ్వరయ్య తీర్చారు.
       మైసూర్ సంస్థానంలో దివాన్ గా చేరి చాలా రకాలుగా సేవలు అందించారు. సంస్థానంలో 6%  గా ఉన్న అక్షరాశ్యతా శాతాన్ని 18% కు పెంచారు. బెంగుళూర్ నందు  1914 లో మెకానికల్ ఇంజనీరింగ్ శిక్షణా సంస్థను, మైసూర్ నందు  1916 లో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. మైసూర్ లో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసారు. కావేరి నది మీద ఆనకట్టకృష్ణరాజ సాగర్  నిర్మించారుచాలా సినిమాల చిత్రీకరణ జరుపుకున్న బృందావన్ గార్డెన్స్ ఈయన నిర్మించినదే. మైసూర్ సంస్థానంలో భద్రావతిలో ఉక్కు కర్మాగారం , మైసూర్ సాండల్ సోప్ కర్మాగారం, ప్రింటింగ్ ప్రెస్ లు, సిల్క్ పరిశ్రమలు, జాలీ మోటార్ సైకిళ్ళు తయారీ పరిశ్రమ, ప్రీమియర్ మోటార్స్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, విశాఖ హార్బర్, తుంగభద్రా ప్రాజెక్ట్ , బీహార్ లో గంగానదిపై వంతెన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో ఈయన ఆలోచనల నుంచి పుట్టినవే. హైదరాబాద్, విశాఖ, నాసిక్, గ్వాలియర్, బొంబాయి, మైసూర్, బెంగుళూర్, కరాచీ, గోవా, భోపాల్ మొదలైన ఎన్నో నగరాల అభివృద్ధిలో ఈయన మేధాసంపత్తి నిండి ఉంది.  

       నిజాయితీ లో కూడా ఈయన పేరెన్నిక గన్నవారు. పర్యటనలు జరిపేటప్పుడు ప్రభుత్వం ఇచ్చే కొవ్వొత్తులు కేవలం ప్రభుత్వ పని చేస్తున్నంత సేపే వెలిగించి పని కాగానే తన స్వంత డబ్బులతో కొనుక్కొన్న కొవ్వొత్తి వెలిగించుకొని తన పనులు చేసుకొనేవారట. ఇప్పుడలాటి వారిని అసలు ఊహించగలమా? అందుకే ఆయన "భారతరత్న" మయ్యారు.1955  లో భారత ప్రభుత్వం ఈయనకు "భారతరత్న" ఇచ్చి గౌరవించింది. ఈయన బ్రిటిష్ ప్రభుత్వంచే కూడా  1911లో  " కంపానియన్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ " బిరుదునూ,1915 లో బ్రిటిష్ రాణిచే " సర్ " బిరుదునూ పొందారు. నిండు నూరేళ్ళు గడిపి  04-04-1962 కన్ను మూసారు.


ఈయన మీద గల గౌరవంతోనే సెప్టెంబర్ 15  ను " వరల్ద్ ఇంజనీర్స్ డే " గా జరుపుకుంటున్నాము

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం