ఇంటర్నేషనల్ జ్యుయలరి బాక్స్

ఇంటర్నేషనల్ జ్యుయలరి బాక్స్ అని పేరు గాంచిన ప్రదేశం ఏమిటో తెలుసా ? కర్నాటక రాష్ట్రం లోని బేలూరు . హలేబిడ్ లను ఇంటర్నేషనల్ జ్యుయలరి బాక్స్  అంటారు. ఎందుకు అంటే సుమారు 9౦౦ సంవత్సరాలకు పూర్వమే ఇప్పుడు మనం ఎక్కడా చూడని నగల డిజైన్స్ అన్నీ శిల్పాలలో చెక్కి ఉంచారు. ఇక్కడ మనం అనేక రకాల గాజులు, వడ్డాణం, మొదలైన నగల డిజైన్స్ వారు చెక్కిన స్తంబాలపై గమనించవచ్చును . పురాతన, శిల్ప కళా సౌందర్యానికి పేరు పొందిన బేలూర్, హలేబిడ్ లను తిలకించాలని అనుకొన్నాము. బెంగుళూరు నుంచి బయలుదేరాము . ఈ రెండు ప్రదేశాలు హసన్ జిల్లాలోని ముఖ్యపట్టణం హసన్ కి చెరో వైపు ఉన్నాయి. ఉదయాన్నే బెంగుళూరు లో బయలుదేరాము. సుమారు 1 8 6 కి.మీ దూరం లో హసన్ ఉంది. ఇక్కడ నుంచే ఆ రెండు ప్రదేశాలు వెళ్ళాలి.
ఇదే హసన్ బస్ స్టాండ్ చూడటానికి ఒక ఎయిర్ పోర్ట్ అనిపించింది . చాలా పెద్దదిగా , విశాలంగా ఉంది . హసన్ అనే పేరు ఆ పట్టణంలో ఉన్న హసనాంబా దేవి గుడి వలన వచ్చిందట. ఈ నగరం చాలా పూర్వం గంగ వంశపు రాజులచే పాలింపబడినది. తరువాత హోయసల, విజయనగర సామ్రాజ్యాలలో భాగంగా ఉంది . చివరకు మైసూర్ రాజ్యంలో భాగంగా ఉంటూ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కర్ణాటక రాష్ట్రంలో ఒక పట్టణం అయింది. ఇది బెంగుళూరు , మంగుళూరు నేషనల్ హైవే 48 పైన ఉన్న నగరం . ఇక్కడ నుంచి బీరార్ , మంగుళూరు , మైసూరు , మొదలైన అన్నీ ముఖ్య నగరాలకు రోడ్ మరియు రైలు మార్గాలున్నాయి . దేశం లోని చాలా నగరాలకు చేరడానికి మార్గం ఉంది. ఈ జిల్లాలో హోయసల రాజుల కాలంలో మరియు చాళుక్యుల కాలంలో ఇతర రాజుల కాలంలో నిర్మించిన అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ జిల్లాలోనే ప్రముఖ జైన పుణ్యక్షేత్రం అయిన శ్రావణ బెలగోళ , బేలూర్, హలేబిడ్ తదితర అనేక పుణ్య క్షేత్రాలు ఉండటం చేత టూరిజం ముఖ్య ఆదాయ వనరుగా కలిగి ఉంది. 
ఇక్కడ కొండలచేత చుట్టుముట్టి ఉండటం వలన ఇక్కడ ఎక్కువగా పవన విద్యుత్ కేంద్రాలు కనిపిస్తాయి. 

హసన్ ఇస్రో వారి మాస్టర్ కంట్రోల్ కేంద్రం కూడా కలిగి ఉంది. ఇక్కడ నుంచే భారత దేశం తరపున ప్రయోగించే పలు ఉపగ్రహాలు నియంత్రించ బడుతు ఉంటాయి.

హసన్ కర్ణాటకలోని ప్రముఖ వ్యవసాయ ప్రాంతం కూడా ఇక్కడ ఎక్కువగా కాఫీ, మిరియాలు, రాగులు, కూరగాయలు, చెరకు ఎక్కువగా పండింపబడతాయి . ఇది మాజీ ప్రధాని దేవెగౌడ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం