గంగిరెద్దుల విన్యాసాలు

గంగిరెద్దుల విన్యాసాలు







సంక్రాంతి రోజులలొ ఎదురుచూసే వేడుక మరొకటుంది తెలుసా? అదేనండీ గంగిరెద్దులతో రకరకాల విన్యాసాలు చేయించే గంగిరెద్దులవాళ్ళ రాక. గంభీరంగా తల ఊపుతూ, మెడలో చిన్న చిన్న చిరుమువ్వల రవళితో, పరమేశ్వరుని వెన్నంటే నడిచి వచ్చే నందీశ్వరునిలా వచ్చే గంగిరెద్దును శివుని వాహనమైన నందిగానూ, దాని చేత విన్యాసాలు చేయించేవారిని సాక్షాత్తూ హిమశైల వాసి పరమేశ్వరునిగా పూజించే
సాంప్రదాయం మనది.
చక్కగా అలంకరించబడిన గంగిరెద్దులను చూస్తే భక్తి భావం కలుగక మానదు. మూపురాన్ని కప్పుతూ రంగురంగుల వస్త్రవిశేషాలతో, మెడలో గలగలలాడే ఇత్తడి గంటలతో, కొమ్ములకు కుచ్చుల అలంకారాలతో, కాళ్ళకు సిరిగజ్జెలతో శివుని వెంట నడిచే నందీశ్వరునిలా వచ్చే గంగిరెద్దులను చూస్తే కనుల పండుగగా
ఉండేది.
ఇంక గంగిరెద్దులను ఆడించేవారిని చూస్తే పంచె కట్టుకొని చొక్కా పైన పాత కోటు వేసుకొని తలపాగా ధరించి పొడవైన సన్నాయి ఊదుతూ ఒకరు, లయబద్దంగా డోలు వాయిస్తూ ఇంకొకరూ, గంగిరెద్దులను నడిపిస్తూ
మరొకరూ వచ్చేవారు.
            మన ఇళ్ళు సిరి సంపదలతో తులతూగాలని, పాడిపంటలతో, పిల్లాపాపలతో కళకళలాడాలని, ధాన్యరాశులతో గాదెలు నిండాలని, చిన్నాపెద్దా ఆయురారోగ్యాలతో ఉండాలనీ కోరుతూ, మనని దీవిస్తూ
ఉండగా, వారి సన్నాయి నాదానికి, డోలుతో వాయిస్తున్న వాదానికి అనుగుణంగా తధాస్తు అన్నట్లుగా తల ఊపుచూ దీవెనలిచ్చే గంగిరెద్దులను చూస్తే పూజ్యభావము కలగడం తద్యం. (అందుకే నేమో అవతలివారి మాటలకు కాదనకుండా ఒప్పుకొనేవారిని గంగిరెద్దులా తలాడిస్తాడంటారు )
            అయ్య గారికి దండం పెట్టు, అమ్మ గారికి దండం పెట్టు అంటూ వాటిని ఆడించేవారు అంటే ముందు కాళ్ళు ఎత్తి చూపడం, దగ్గరకు చేర్చి దండం పెట్టడం చేస్తాయి. గంగిరెద్దుల వాళ్ళు కింద పడుకొని గుండెలపైకి
ఎక్కించుకొంటుండేవారు . నాలుగు కాళ్ళు ఒకే చోట చేర్చి నుంచోడం వంటి రకరకాల విన్యాసాలు చేసేవి.
            చివరలో అందరి మెప్పు పొందేక బొంతలు కుట్టి గంగిరెద్దునకు కప్పడానికి పాత చీరలూ, వారికి పాత బట్టలూ అడిగేవారు. వారు ఇచ్చిన ధనమో, ధాన్యమో, పాత దుస్తులో తీసుకొని పదే పదే దీవిస్తూ వెళ్ళేవారు.

            పిల్లలందరం రెండు, మూడు వీధులు వారి వెంట వెళ్ళేవారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం