అంతర్యామి .. రెండవ భాగము



బ్రహ్మ సృష్టిద్దాం అనుకొన్న ఆ జంతువు పేరు " మానవుడు"
ఇంతవరకూ బాగానే ఉంది. కాని బ్రహ్మ తలపులొ మరొకటి ఉంది. తాను కొత్తగా సృష్టించే జంతువు  లోకంలో అన్ని జంతువుల కన్నా తెలివైనదీ , మిగిలిన జంతువులన్నింటినీ అజమాయిషీ చేయగలదీ కనుక ఆ జంతువును దేవతల వలె స్వర్గ సౌఖ్యాలు, సుఖ సంతోషాలు, సకల భోగాలు, అందుబాటులోకి తేవాలని తలంచాడు.  ఈ ఆలోచన దేవతలకు తెలిసింది. వారిలో కలకలం రేగింది. ఇప్పటికే జంతువులన్నింటి కన్నా  తెలివి, భాష, ఆధిపత్యం అన్నీ ఇస్తున్నారు. ఇంక ఇవన్నీ కూడా ఇస్తే దేవతలతో సమానం అయిపోతారు. మన ప్రాముఖ్యత ఏమిటి? స్వర్గలోక సౌఖ్యాలు అన్నీ వాళ్ళకి కూడా అందుబాటులోకి వస్తే ఎలా అని అందరూ ఒకచోట  సమావేశం అయారు. ఈ సుఖసంతోషాలు, స్వర్గలోక సౌఖ్యాలు మానవులకు అందుబాటులో ఉంచరాదని, వారి అన్వేషణ ద్వారా మాత్రమే సాధించాలని, అందుకే వాటిని ఎక్కడో భద్రంగా దాచి ఉంచాలని నిర్ణయించారు దేవతలు.
ఎక్కడ ఉంచాలి?
 "అంతరిక్షంలో దాస్తేనో " అన్నారు ఒకరు.
 "అబ్బే లాభం లేదు, మనిషి రాకెట్స్ కనిపెడతాడు. అక్కడ లాభం లేదు" అన్నారు మరొకరు.
"పోనీ సముద్రగర్భంలో దాస్తేనో " అన్నారు ఒకరు.
"లేదు, మానవుడు జలాంతర్గామిని తయారు చేస్తాడు. అక్కడా లాభం లేదు " అన్నారు మరొకరు.
"హిమాలయాలలో దాచుదాం, చంద్రుడి మీద దాచుదాం, ఇలా ఎన్నో ప్రదేశాలు దాచడం కోసం ఆలోచించినా అన్నీ మానవుడికి అసాధ్యం కాదు ఎలాగైనా కనుక్కుంటాడు. అని అందరూ అనుకొన్నారు. సరే మరి ఎక్కడ దాస్తే మనిషి వెతకడానికి ఆస్కారం లేదో చెప్పండి అక్కడే దాచుదాం అన్నాడు బ్రహ్మ.
ఇంతలో ఒకరికి మంచి ఆలోచన వచ్చింది. అందరితో చెప్పాడు. ఆ ప్రదేశం అయితే మానవుడు వెతకడని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. బ్రహ్మకు కూడా నచ్చింది ఆ ఆలోచన. సరేనని దానిని ఆచరణలో పెట్టాడు ఆయన. మానవ సృష్టి అలా ప్రారంభమయింది.
( ఇంతకీ ఆ ప్రదేశం ఏమిటి? ఎక్కడ దాచారు ? మనిషి దానిని కనుక్కోగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానం  నా తదుపరి పోస్ట్ లో చదవండి.)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం