.....పూరీ జగన్నాథ రథ యాత్ర......

.
జగన్నాధ ఆలయాన్ని శ్రీక్షేత్రం, శంఖు క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రమని పిలుస్తారు..37,000 చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుత వాస్తుకట్టడం జగన్నాథుని ఆలయం.
ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నమహారాజు కట్టించాడట. ఆయనకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదితీరాన ఓ కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమని అజ్ఞాపించాడట కానీ దాన్ని మలచడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో వచ్చి తాను మలుస్తానని చెప్పాడట. అయితే తాను తలుపులు మూసుకుని విగ్రహాలు చెక్కే సమయంలో ఎవరు రాకుడదని షరతు విధించాడట. ఉత్సుకత ఆపుకోలేని రాజు పదిహేనోరోజున తలుపులు తెరపించడంతో అయన వాటిని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడట. దాంతో అలాగే ప్రతిష్టించారన్నది స్థలపురాణం. గోపురాలతో పెద్ద మండపాలతో దాదాపు 120 గుళ్ళు ప్రాంగణంలో ఉన్నాయి.
బలభద్ర, సుబద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటికి తీసుకు వచ్చి భక్తులకి కనువిందు చేస్తారు. ఊరేగించడానికి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాడ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్యశిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం తయారీకి, 763 ఖండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు. .
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూడులై యాత్రకు సిద్ధంగా ఉండగా, పూరీ సంస్థానాధీశుడు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను 'చెరా పహారా' అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణాలు చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరీ కళ్ళాపిజల్లి హారతిచ్చి 'జై జగన్నాథా' అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్ళను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు.
ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాదుడి గుడి నుంచి మూడుమైళ్ళ దూరంలో ఉండే 'గుండీచా' గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటలు పడుతుంది. వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమిరోజున తిరుగుప్రయాణం మొదలవుతుంది. దీన్ని 'బహుదాయాత్ర' అంటారు. ఆరోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి రోజున స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు దీన్నే 'సునావేష'గా వ్యవహరిస్తారు. ద్వాదశిరోజున విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే.
Like
పూరీ జగన్నాథ దేవాలయం (శ్రీక్షేత్రం)
జగన్నాథుడంటే విశ్వానికి అధిపతి అని అర్ధం. అలాంటి జగన్నాథుడు కొలువైన పురమే “పూరీ”
ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.
వైష్ణవాలయాల్లో పూరీ జగన్నాథ్ కి విశిష్ట స్తానముంది. ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్ ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది.
పూరీ జగన్నాథ దేవాలయం, ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీపట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ఎప్పటికప్పుడు కొత్తగా చేసే రథాలతో ఆ ఉత్సవ తీరు అద్భుతం. మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలు రెండూ ఒకటిగా వుండే ఏకైక ఆలయం. అంతే కాదు మహావిష్ణు అవతారాల్లో ఒకటైన కృష్ణుడు ఇక్కడ తన దేవేరులతో కాక, సోదరుడు బలరాముడు.. సోదరి సుభద్రలతో దర్శనమిచ్చే అరుదైన పుణ్యధామం.. పూరీ జగన్నాథ్ దేవాలయం.
ఒరియా సాంప్రదాయంలో జగన్నాథుడిగా కృష్ణుడు (కుడి వైపున ఉన్నది). మధ్యలో ఉన్నది సుభద్ర, ఎడమవైపున ఉన్నది బలరాముడు.
ప్రస్తుతం ఉన్న దేవాలయం గంగ వంశానికి చిందిన కళింగ ప్రభువైన అనంత వర్మ చోడగంగ ( క్రీ.శ 1078—1148) ప్రారంభించాడు. ప్రస్తుతం ఉన్న చాలా నిర్మాణాలు మాత్రం అనంగ భీమదేవుడిచే క్రీ.శ. 1174 లో నిర్మించబడ్డాయి, ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి పద్నాలుగేళ్ళు పట్టింది. ప్రాణప్రతిష్ట క్రీ.శ 1198 లో జరిగింది.

ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవ భక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాథ స్వామి సుభద్రా బలరాముల తోడి వెలసి యున్నాడని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్న ఆయన వారిని దర్శించడానికి అక్కడికి వెళతాడు. జగన్నాథుడు ఆయన భక్తిని పరీక్షించాలని అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. రాజు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగి స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటాడు. ఒక రోజు కలలో రాజుకు జగన్నాథుడు కనిపించి సముద్రపు అలల్లో రెండు కొయ్య దుంగలు ఒడ్డుకు కొట్టుకు వస్తాయనీ వాటి నుంచి తమ విగ్రహాలను చెక్కించమని కోరాడు.
అలా కొట్టుకువచ్చిన కొయ్యలను రాజు వెలికితీసి రాజ్యం లోకి తీసుకెళ్ళగానే సాక్షాత్తూ విశ్వకర్మ యే శిల్పి రూపమున వచ్చి తాను ఆ దారువులలో దేవతా మూర్తులను చెక్కెదనని అభయమిచ్చాడు. కానీ ఆయన ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారం ఆయన ఒక గదిలో చేరి తలుపులు బిగించి శిల్పాలు చెక్కుతాడు. ఆయన చెప్పేవరకూ ఎవరూ ద్వారములు తెరువ కూడదని కోరాడు. పని ప్రారంభించి పది రోజులైంది.
ఒక రోజు రాజమాత లోపల యున్న శిల్పి పది రోజులుగా భోజనం లేకుండా ఉంటాడని భావించి తలుపులు తెరవమన్నది. తల్లి మాట కాదనలేని రాజు అలాగే తలుపులు తెరిపించాడు. కానీ అక్కడి శిల్పి అదృశ్యమయ్యాడు. అప్పటికే చేతులూ, కాళ్ళు తప్ప మిగతా భాగాలన్నీ పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను ఏమిచేయాలో రాజుకు తోచలేదు. వాటిని అలాగే ప్రతిష్టించాలను దైవవాణి ఆజ్ఞాపించడంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టించారు.
ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిదేళ్లకొకసారి ఏ ఏడాదిలో ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో.. అప్పుడు 'నబకలేవర' ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను మారుస్తారు. ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి వాటిస్థానే కొత్తవి చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కానీ, తీసి వేయటం జరుగదు. వాస్తవానికి మహావిష్ణువును జగన్నాథుడితో పాటు పద్మనాభుడని కూడా పిలుస్తారు. విష్ణువు నాభిలోంచి బ్రహ్మ పుట్టాడని చెబుతుంది విష్ణు పురాణం. అందుకే జగన్నాథుడి విగ్రహాలను మార్చినా, నాభి మాత్రం అలాగే వుంచుతారు. జగన్నాథుడి నాభిలో బుద్ధుడి దంతం పొందుపరచబడి వుండేదన్న మరో కథనం కూడా ప్రచారంలో వుంది. అందుకే ఇక్కడి మూర్తి నాభికి అంతటి విలువని చెబుతారు. బుద్ధడి దంతానికీ ఇక్కడి ఆలయంలోని స్థూపానికీ సంబంధముందని కూడా చెబుతారు. బుద్ధుడి దంతం కూడుకున్న స్థూపం.. తర్వాతి కాలంలో శ్రీలంకలోని కాండీకి తరలించబడిందని అంటారు.
ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే 'చందన యాత్ర' రథాల నిర్మాణం మొదలు పెట్టడాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం 'స్నానయాత్ర' పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున జగన్నాథ తదితర ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో 'డోలయాత్ర' వర్షాకాలంలో 'ఝులన్‌' యాత్ర పండుగలు చేస్తారు.
నిర్మాణం
భారతీయ సంస్కృతిలో అదో అద్భుతం. పౌరాణిక చారిత్రిక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం.
ఈ ఆలయం 4,00000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైనా ప్రాకారం కలిగి ఉంది. లోపల సుమారు 120 దాకా ఆలయాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళా నైపుణ్యం, సాంప్రదాయిక ఒరిస్సా ఆలయ శిల్పకళతో ఈ ఆలయం భారతదేశంలో అతి పురాతమైన కట్టడాల్లో ఒకటి.
సింహ ద్వారం
ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది.
పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు
1. ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి"వ్యతిరేకదిశ" లో ఉంటుంది.
2. ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణం లో ఎక్కడ ఉన్నా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.
3. మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.
4. పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయం మీద వెళ్ళవు.
5. గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా, ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు.
6. ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలనే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు.
7. జగన్నాథుని ఆలయంలోని వంటశాలలోచక్కల నిప్పు మీద 7 మట్టిపాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేదివేడి అవుతుంది. ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.
జగన్నాథ రథయాత్ర
ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు.. ఈ యాత్ర వేడుకలు తొమ్మిరోజుల పాటూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. కుల- మత- వర్గ బేధాలను మరచి దేశవిదేశీ భక్తులు పోటెత్తుతారు. బలభద్ర, సుభద్రా సమేత జగన్నాథుడ్ని తనివితీరా దర్శిస్తారు. రథోత్సవం అంటే అదే. అశేష భక్తజనులను ఒక్కసారిగా దర్శించాలంటే ఆ ఉత్సవాలకు వెళ్తే సరి. ప్రపంచంలో భక్తజనం పోటెత్తే.. కొన్నంటే కొన్ని ఉత్సవాల్లో దీనికి ప్రత్యేక స్థానముంది. ఆ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే జనసంద్రాన్ని దగ్గరుండి చూడ్డం. సోదర తత్వానికీ, మత సామరస్యానికీ ప్రతీక అయిన జగన్నాథ్ రథయాత్ర విశేషాలు జగన్నాథ్ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుంచి మధుర వరకూ చేసే యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి.. రథంలో పత్రిష్ఠించి యాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయ్యే యాత్ర.. కిలో మీటరు దూరంలోని 'గుండీచ' మందిరం వరకు సాగుతుంది. రథయాత్ర ప్రారంభంమయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని.. రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైనా.. దేవుడి ముందు సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఈ ఆచారం పాటిస్తుడటం విశేషం. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు.
రథయాతల్రో జగన్నాథుని రథాన్ని 'నందిఘోష్‌' గా వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి పదహారు చక్రాలుంటాయి. బలభద్రుడి రథాన్ని 'తాళ్‌ధ్వజ్‌' పేరుతో పిలుస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీన్ని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. తాళ ధ్వజ్ కు 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని 'దర్ప దళన' అంటారు. ఈ రథానికి 12 చక్రాలుంటాయి. .దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు.. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
ఆలయ వంటశాల మరియు మహాప్రసాదం
జగన్నాథ ఆలయ వంటశాల భారత దేశంలోనే అతి పెద్ద వంటశాల.సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మి దేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం వుంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతుంటారు.మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మిదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్నా గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.ఇక్కడ ఐదు ప్రత్యేక ముహుర్తా లలో రత్నవేది మరియు భోగ మండపాల లో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి 56 రకాల నైవేద్యాలు ఉన్నాయి.ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు పెట్టె కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహా ప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు. అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
జై జగన్నాధ్ !

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం