జ్ఞానం-పరిజ్ఞానం- తర్కం- లేటరల్ థింకింగ్:


శ్రీ యండమూరి లోయ నుంచి శిఖరానికి నుంచి 
జ్ఞానం-పరిజ్ఞానం- తర్కం- లేటరల్ థింకింగ్:
నాలెడ్జ్ వేరు. తెలివి (ఇంటెలిజెన్స్) వేరు. చదువు వల్లా, పరిశీలన వల్లా వచ్చేది నాలెడ్జ్. తెలుగులో దీన్ని పరిజ్ఞానం అంటారు. సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ.
ఒక లెక్కకి జవాబు గానీ, లేదా ఒక సమస్యకి పరిష్కారంగానీ కనుక్కోవటానికి సరయిన రీతిలో తన కున్న ‘నాలెడ్జ్’ ఉపయోగించుకోవటాన్ని ‘తెలివి’ అంటారు.
(a+b)² ఎంత? అన్న ప్రశ్నకి a²+b²+2ab అని చెప్తే అది నాలెడ్జ్. “(b+a)² ఎంత?” అంటే, 'నాకు తెలీదు' అని చెప్తే, ఆ కుర్రవాడికి తెలివి లేదన్నమాట. రెండిటికీ ‘అదే’ జవాబు అని తెలుసుకోవటం తెలివి. ఇది ఏ కాలేజీలోనూ చెప్పరు.
ఒక ప్రశ్నకి ఎంత తొందరగా సమాధానం చెప్పగలము (లేదా, ఒక సమస్య కి ఎంత తొందరగా రియాక్ట్ కాగలము) అన్నది ప్రతి స్పందన. sin θ/cos θ = tan θ అన్నది నాలెడ్జ్. (sin θ/cos θ) x (tan θ/tan² θ)=1 అని ‘ఎంత తొందరగా’ సమాధానం చెప్పగలమూ అన్నది ప్రతి స్పందన (reflex action). తెలివి, పరిజ్ఞానం ఉన్నా, సమాధానం ఆలస్యం గా చెప్పేవాడిని 'ముద్ద పప్పు' అంటాము.
ఒక పని చేయగా చేయగా వచ్చేది అనుభవం. మనసు పెట్టి ఆ పని శ్రద్ధగా చేయటం వల్ల వచ్చేది నైపుణ్యం (స్కిల్), దానికి కామన్‌సెన్స్ కలిస్తే వచ్చేది పరిపక్వత (మెచ్యూరిటి).
మొత్తం అన్నీ కలిపితే అది ‘జ్ఞానం’.
నాలెడ్జ్ లేకుండా, కేవలం తెలివి వున్నవాడిని 'అతి తెలివిగాడు’ అంటాము. ఏప్రిల్ ఒకటిన పాస్ ఉండి కూడా, టికెట్ కొని బస్ కండక్టర్‌ని ఫూల్ చేసానని సంబర పడేవాడు ఈ కేటగిరీ.
తెలివి లేకుండా కేవలం నాలెడ్జ్ వున్న వాడిని ‘శుష్క పండితుడు’ అంటాము. Give one example. శుష్కపాండిత్యం అంటే అది.
జ్ఞానం లేని వ్యక్తిని స్టుపిడ్ అంటారు. ‘ఫలానా వ్యక్తి మరణించాడ’ని ఫేస్‌బుక్‌లో వస్తే “లైకులు” కొట్టటం; క్రింద సంతకం పెట్టకుండా సెలబ్రెటీలకి పండగ రోజు శుభాకాంక్షలు పంపటం స్టుపిడిటికి ఉదాహరణ.
అన్నీ ఉండి సంస్కారం లేకపోతే అతడిని మూర్ఖుడు అంటాము. “ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత సంస్కార రహితుడూ, మరియు నాగరికత లేని మూర్ఖుడు ఎవరు?” అన్న ప్రశ్నకు ఒక మేగజైన్ పాఠకుల నుంచి సమాధానాలను ఆహ్వానించింది. ఎన్నుకున్న అత్యుత్తమ జవాబు: ‘అర్థరాత్రి పూట రైల్లో సెల్‌ఫోన్లో గట్టిగా మాట్లాడే వ్యక్తి' .
ఫ్యాను విప్పి, మిస్టేక్ ప్లగ్‌లో వుందో, వైర్‌లో వుందో తెలుసుకో గలగటం నాలెడ్జ్. కరెంటు వైరుని ముట్టుకోకుండా వుండటం మెచ్యూరిటీ. తొందరగా రిపేరు చేయటం నైపుణ్యం. అన్నిటి కన్నా ముందు, అసలు కరెంటు ఉందా లేదా అని చూసుకోవటం కామన్ సెన్స్.
అవన్నీ కలిస్తే వచ్చేది జ్ఞానం.
ఇప్పుడు ఒక్కొక్క విషయాన్నే విడి విడిగా పరిశీలిద్దాం.
నాలెడ్జ్:
విద్యార్థులు పరీక్షలవగానే పాఠం మర్చి పోతున్నారు. చదువుని జ్ఞానంగా మార్చుకోకపోతే, ఎంత చదివినా వేస్టే.
“చదువు పూర్తయి కాలేజీ నుంచి బయటకు వచ్చాక బుర్రలో ఏమి మిగిలిందో అదే – చదువు.”
నాలెడ్జ్‌ని సరీగ్గా ఉపయోగించుకోవటమే జ్ఞానం అని పైన తెలుసుకున్నాం.
టెక్నిక్స్ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందా?
చెప్పటం కష్టం. అనంతపురంలో మెమొరి టెక్నిక్స్ మీద ఒక నిర్వాహకుడు బోర్డుపై రకరకాల గళ్ళు గీసి సభికుల్ని వివిధ అంకెలతో నింపమన్నాడు. రెండు నిమిషాల తరువాత అవే అంకెల్ని వరుసగా చెప్పేశాడు. ఒక్కొక్కర్నీ ఒక్కొక్క వస్తువు పేరు చెప్పమని యాభై వస్తువుల పేర్లు అదే క్రమంగా చెప్పాడు. సభికులందరూ కరతాళ ధ్వనులు చేశారు.
“మీ పిల్లలు కూడా ఇంత అద్భుతమైన మెమొరీని వారం రోజుల్లో పొందగలుగుతారు” అన్నప్పుడు మాత్రం ఒక వ్యక్తి నిలబడి “…గతoలో మీరు ఈ విధంగానే ప్రకటించినప్పుడు మా అబ్బాయిని చేర్పించాను. ఏ ఉపయోగమూ కనపడలేదు” అన్నాడు.
ఈ అనూహ్య పరిణామానికి అందరూ బిత్తరపోయారు.
"లోపం నాదికాదు. సరిగ్గా నేర్చుకోని మీ అబ్బాయిది" అన్నాడు ఆ నిపుణుడు. నిలబడ్డ వ్యక్తి కూడా అంత ధీమాగానే "మీరు చెప్పిందంతా కరెక్టుగా అమలు జరిగేటట్లయితే మీ పిల్లలకి ర్యాంక్ రావాలి కదా. వారికెందుకు రాలేదు?" అని ప్రశ్నించాడు.
స్టేజి మీదున్న నిపుణుడు ఈ పరిణామాన్ని ఊహించలేదు. సభలో కలకలం రేగింది. ప్రశ్నించటానికి నిలబడిన వ్యక్తి ముందే ప్రిపేరై వచ్చినట్టున్నాడు "…అంకెలు, వస్తువులు గుర్తు పెట్టుకోవడానికి, తిరిగి చెప్పటానికీ మీ టెక్నిక్స్ సరిపోతాయేమో గానీ తెలివికీ, సైన్స్ గుర్తు పెట్టుకోవడానికీ ఏ మాత్రమూ పనిచేయవు. కావాలంటే నేనొక పద్యం చెపుతాను. మీకు అరగంట టైమిస్తాను. తిరిగి ఆ పద్యాన్ని మళ్ళీ నాకు చెప్పండి” అన్నాడు.
సభలో కొందరు చప్పట్లు కొట్టారు. ఈ లోపులో సభని నిర్వహిస్తున్న నిర్వాహకులు పరిగెత్తుకువచ్చి ఏదో సర్ది చెప్పి ఆ నిలుచున్న ఆయన్ని కూర్చోపెట్టారు.
ఆలోచిస్తే ఇదంతా నిజమే కదా అనిపించింది. ఈ మెమొరి టెక్నిక్సూ ఇవన్నీ పెగ్గింగ్ సిస్టం ద్వారా గుర్తు పెట్టుకునేలాగ చేస్తాయే తప్ప, జ్ఞానాన్ని పెంపొందించే విధంగా సహాయ పడవనిపించింది.
అయితే ఈ మెమొరి టెక్నిక్స్‌ వల్ల, అబాకస్‌ల వల్ల మెదడు ‘చురుగ్గా’ మారుతుంది. ముఖ్యంగా ‘తన మీద తనకి’ నమ్మకం ఏర్పడుతుంది. సభా పిరికితనం పోతుంది. ముందే చెప్పినట్టు జ్ఞానం వేరు, పరిజ్ఞానం వేరు.
సేమ్యాలు, యాలకులు, పంచదార కలసిన పాయసం జ్ఞానం..! తెలివి పంచదార. పాలు నాలెడ్జ్. సేమ్యాలు అనుభవాలు. యాలకులు తర్కం. జీడిపప్పు లేటరల్ థింకింగ్..! ఉట్టి సేమ్యాలు తినలేము. పది యాలకులు నోట్లో వేసుకుని నమలలేము. గుప్పెడు పంచదార తింటే మొహం మొత్తుతుంది. విడివిడిగా ఏవీ బాగోవు. అన్నీ కలిపితే వచ్చేది మధురమైన పాయసం - జ్ఞానం..!
తర్కం:
దాదాపు పది సంవత్సరాల క్రితం అబాకస్ వారు, తమ వార్షికోత్సవ సభకి ఆహ్వానించటం కోసం మా ఇంటికి వారి పిల్లల్తో వచ్చారు. పిల్లలిద్దరూ చాలా చురుగ్గా వున్నారు. పెద్ద పెద్ద గుణింతాలక్కూడా క్షణాల్లో జవాబు చెప్పారు. అయితే “ఒక పిల్లి ఒక అడుగు ఎత్తు మీద నుంచి దూకితే ఒక కాలు విరిగితే రెండు అడుగుల మీదనుంచి దూకితే ఎన్ని కాళ్ళు విరుగుతాయి” అన్న ప్రశ్నకి ‘రెండు’ అన్నారు.
ఆ దంపతులు తమ తప్పు గ్రహించారు. అయిదు సంవత్సరాల తరవాత తిరిగి మళ్ళీ వారు నిర్వహించిన ఫంక్షన్‌కి వెళ్ళినపుడు, స్టేజి మీద ఈ విషయం వారే ప్రస్తావిస్తూ ‘…తమ ఆలోచనా విధానాన్ని మార్చుకున్నామనీ, తాము నిర్వహించే అబాకస్ తరగతులలో అప్పటినుంచీ లెఖ్ఖలతో పాటు తర్కాన్ని కూడా ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టామ’ని చెప్పినప్పుడు మనస్పూర్థిగా సంతోషించాను. తప్పులని సరిదిద్దు కోవటం కన్నా గొప్ప ప్రగతి మరేముంటుంది?
తర్కాన్ని ఇంగ్లీష్‌లో ‘లాజిక్’ అంటారు. మనకి తెలియనిది చాలా ఉండొచ్చు. కానీ లాజిక్ లేకుండా ఏదీ ఉండదు.
మన అయిదు వేళ్ళూ సమానంగా ఎందుకు వుండవు? ఎందుకు పశువులు మాటి మాటికీ నాలుకతో ముక్కు రంధ్రాల్ని శుభ్రం చేసుకుంటాయి? టైట్గా మూత వున్న గోధుమ పిండి డబ్బాల్లోకి పురుగులు ఎలా చేరతాయి?
- బంతిని పట్టుకొన్నప్పుడు మన అన్ని వేళ్ళూ సమానంగా వుండటం గమనించ వచ్చు. కోతులు చెట్లకొమ్మల్ని పట్టుకొని ఎగిరే క్రమంలో ఉపయోగ పడే సూత్రం కూడా ఇదే. వేళ్ళన్నీ ఒకే పొడవులో ఉoడి వుంటే, ప్రతి దినం మన చిటికిన వేలికి దెబ్బ తగులుతూనే వుంటుంది.
- గోవుల ముక్కు దగ్గర వుండే గ్లాండ్స్ తిండి జీర్ణం అవటానికి సహాయం చేస్తాయి. అంతే కాకుండా పశువులు తరచూ వూపిరి తిత్తుల వ్యాధులతో బాధ పడుతూ వుంటాయి. ముక్కు తుడుచు కోవటానికి వాటి దగ్గర కర్చీఫులు ఉండకపోవడం కూడా ఒక కారణo.
- గోధుమపిండి డబ్బాల్లో పెట్టి మూత పెట్టక ముందే వాటిల్లో పురుగుల తాలూకు గుడ్లు వుంటాయి. అవి లోపల పరిణితి చెందుతాయి.
ఇలా ప్రతిదానికీ తర్కం ఉన్నది. ఈ ప్రపంచంలో చాలా విషయాలు మన ప్రస్తుత తర్కానికి/జ్ఞానానికి అందక పోవచ్చు.
లేటరల్ థింకింగ్:
లేటరల్ థింకింగ్ అంటే, మరింత కొత్తగా ఆలోచించే విధానం. "నేల మీద పది కాకులున్నాయి. ఢామ్మని పేల్చి ఒక దాన్ని చంపితే ఎన్ని ఉంటాయి?" అన్న ప్రశ్నకి, "శబ్దానికి అన్నీ ఎగిరిపోతాయి" అనటం మామూలు తెలివి. "చచ్చిన కాకి ఉంటుంది" అనటం తర్కం. "…చెప్పలేము. ఆ శబ్దానికి మరొక దానికి హార్ట్-అటాక్ రావొచ్చుకదా" అని చెప్పటం లేటరల్ థింకింగ్.
లేటరల్ థింకింగ్ లో కాస్త అతి తెలివి కూడా ఉంటుంది. దాదాపు నలభై సంవత్సరాల క్రితం వ్రాసిన ఈ కథ లేటరల్ థింకింగ్ కి ఉదాహరణ.
రోజంతా యాచించినా ఏమీ దొరక్కపోయే సరికి ఒక బిచ్చగాడు భగవంతుడ్ని “దేవా! ఈ రోజు నాకేదన్నా దొరికేట్టు చేయి. అందులో సగం నీకిస్తాను" అని కోరుకున్నాడు. అతడికి సంభ్రమం కలిగేలా రోడ్డుమీద ఒక సంచి దొరికింది. అందులో రెండు వందల వరహాలున్నాయి. ఆ ఆనందంలో అతడు వారం రోజుల్లో మొత్తం ఖర్చుపెట్టేశాడు.
ఆ తరువాత పాపభీతి పట్టుకుంది.
భగవంతుడికి వందరూపాయలు బాకీ పడ్డానన్న భయంతో రాత్రి పూట నిద్ర పట్టడం మానేసింది.
అంతలో అతడికి ఒక ఆలోచన వచ్చి, “భగవంతుడా, ఇంకో రెండొందల వరహాలు దొరికేలా చెయ్యి. అందులో సగం నీకిస్తాను” అన్నాడు. ఆ రోజు అతడికేమీ దొరకలేదు. భగవంతుడికి బాకీ తీరిపోయిందన్న సంతృప్తితో హాయిగా నిద్ర పోయాడు.
వంటలో కూడా లేటరల్ థింకింగ్ వుంటుంది. బీరకాయ తొక్కతో అద్భుతంగా పచ్చడి చేసేవాళ్ళున్నారు. 1970 లో కలకత్తాలో ఒక చైనా వంటవాడికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. కార్న్ ఫ్లోర్‌లో చికెన్ ముక్కల్ని వేపి, అల్లం వెల్లుల్ని ముక్కలుగా తరిమి అందరూ వాడే మసాలాకు బదులు సోయాసాస్ కలిపి ఒక కొత్త రకం వంటకం తయారు చేశాడు. అది ఎంత పాపులర్ అయిందంటే కొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి రుచికరమైన డిష్‌గా విశ్వవ్యాప్తం అయిపోయి, దాంట్లోనే వెజిటేరియన్ కూడా వచ్చింది. ఆ డిష్ పేరు చికెన్ మంచూరియా.
కొత్తగా హొటల్ స్థాపించిన నా స్నేహితుడుకి ఒక సలహా ఇచ్చాను. కాఫీ ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడి వెయిటర్ “షుగర్ మీడియమా, ఫుల్లా, తక్కువా? లైట్‌గానా, స్ట్రాంగ్‌గానా” అనడుగుతాడు. బిర్యానీ ఆర్డరు చేస్తే ఎంత కారంగా ఉండాలో మననే అడిగి తెలుసుకుంటాడు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఆ హోటల్ త్వరలోనే మంచి పేరు సంపాదించుకుంది. లేటరల్ థింకింగ్‌కి ఇదో ఉదాహరణ.
తెలివి + నాలెడ్జ్ + ప్రతిస్పందన + అనుభవం + వత్తిడిలో ఆలోచించే విధానం + లాజిక్ + సమయస్పూర్తి + లేటరల్ థింకింగ్ = జ్ఞానం.
టమోటా ఒక ఫ్రూట్ అని గ్రహించటం నాలెడ్జ్. దాన్ని ఫ్రూట్‌సలాడ్‌లో వెయ్యక పోవటం తర్కం. పంచదార పాకంలో వేసిన టమోటాని ఫ్రూట్ సలాడ్‌ మీద అందంగా అమర్చటం లేటరల్-థింకింగ్. అది దరిద్రంగా ఉంటుందని గ్రహించటం జ్ఞానం. టమోటాల కన్నా చెర్రీస్ రుచి అని తెలుసుకోవటం రేషనల్ థింకింగ్. అంతా చేసి, చివర్లో ఆ ఫ్రూట్ సలాడ్ని పెనం మీద వేపటం స్టుపిడిటీ.
యండమూరి కి కృతజ్ఞత లతో అందరికీ ఉపయోగిస్తుందని 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం