కార్తీక సోమవారం

కార్తీక మాసం అనగానే గుర్తుకు వచ్చేది సోమవారం ఉపవాసం ఉండడం , కార్తీక పురాణం చదవడం , శివాలయానికి వెళ్ళడం . మా చిన్నతనంలో నేను మూడు , నాలుగు తరగతులు చదివే రోజుల్లో కాకినాడ , రామారావు పేటలో ఉండే వాళ్ల్లం . నేను , మా తమ్ముడు రామారావు పేట స్కూల్ లో చదివేవాళ్ళం . దానినే ఇసక తిప్ప స్కూల్ అనేవారు . అక్కడ స్కూలు , ఈశ్వర పుస్తక భాండాగారం మాత్రమె ఉండేవి . మిగిలిన కాళీ అంతా ఇసకపర్ర . అందుకే ఆ పేరు వచ్చింది . కార్తిక మాసం వస్తే ప్రతి రోజు కార్తీక పురాణం చదివే వాళ్ళం . అందులో పోటీ కొద్దీ ఒకేరోజు రెండు, మూడు రోజులవి కూడా చదివేసి నేను ఇన్నో రోజంటే , నేను ఇన్నో రోజని అనుకునేవాళ్ళం . సోమవారం తప్పనిసరిగా ఉదయం నుంచి ఉపవాసం ఉండే వాళ్ళం . కేవలం ఉదయం పాలు తాగి స్కూల్ కి వెళ్లి వచ్చి ,మద్యాహ్నం మళ్లీ పాలు తాగి సాయంత్రం వరకు ఉండే వాళ్ళం . మధ్యలో ఏమి తినకూడదని అంటే అలాగే చేసేవాళ్ళం . సాయంత్రం వచ్చి స్నానం చేసి శివాలయానికి వెళ్ళే వాళ్ళం . వస్తూ ఎప్పుడు చీకటి పడుతుందా , నక్షత్రాలు కనపడతాయా అని ఎదురు చూసే వాళ్ళం . ఆకలికో మరి ఎందుకో ఎటు చూసినా చుక్కలు కనపడేవి . అమ్మ చూసి నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు అన్నం పెట్టేది . అంత వరకు నిష్టగా ఉండే వాళ్ళం . ఒకోసారి  సోమవారం ఉదయం స్కూల్ కి వెళ్లి వచ్చాక పాలు తాగి సినిమాకి వెళ్ళేవాళ్ళం . అప్పట్లో కల్పన టాకీస్ లో ఎక్కువ రామారావు సినిమాలు వచ్చెవి. ఇద్దరం నడిచి వెళ్లి మాయాబజార్ , పాతాళ భైరవి లాటి సినిమాలు చూసి సాయంత్రం నడుచు కుంటూ ఆకాశంలో చుక్కల కోసం వెతుక్కుంటూ వచ్చే వాళ్ళం . తరువాత రోజుల్లో మిగిలిన వేమీ చేయక పోయిన కార్తీక మాసం సోమవారం ఉపవాసం మాత్రం అలవాటు అయిపోయింది .
                     కాకినాడ తరువాత కాజులూరు లో ఉండేవాళ్ళం . అక్కడ ఊరికి రెండు , మూడు కిలోమీటర్ల దూరంలో ఆత్రేయ గోదావరి పాయ ప్రవహిస్తోంది . కార్తీక మాసంలో తెల్లవారు ఝామున నాలుగింటికి చలిలో అమ్మ గోదావరి స్నానానికి వెళుతుంటే కూడా నేనే తోడుగా వెళ్ళేవాడిని . ఆ చలిలో స్నానం చేయలేక పోతే గట్టున నిలబడే వాడిని , మళ్లీ పుణ్యం గుర్తుకొచ్చి గబగబా వెళ్లి వణుకుతూ రెండు మునకలు వేసి వచ్చే వాడిని . అక్కడే ఉన్న శివాలయానికి వెళ్ళే వాళ్ళం . కార్తీక మాసంలో ఆ ఊరిలో తప్పకుండా ఒకరోజు లక్ష పత్రి పూజ చేసే వారు . ఆ రోజున బ్రాహ్మణ కుటుంబాలన్నీ కలిసి పూజ చేసుకొనే వారు . రాత్రి భోజనాలు అక్కడే ఏర్పాటు చేసేవారు . అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేయడం చాలా బాగుండేది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం