నదుల పుట్టుక , మహాత్ముల పుట్టుక తెలుసుకోలేము

నదుల పుట్టుక , మహాత్ముల పుట్టుక తెలుసుకోలేము అంటారు . నిజమే వాటిని కనుక్కోవటం కష్టం . కాని మనకు దగ్గర లోని నదుల జన్మస్థానాలు తెలిసినపుడు మాత్రం తప్పక చూసి రావాలి. మడికేరి కి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో తల కావేరి అని కావేరి నది జన్మ స్థలం ఉంది . అది తప్పక చూడవలసిన ప్రదేశం . అందుకే బయలుదేరాం. దారిలోనే భాగ్ మండల్ వస్తుంది . భాగ్ మండల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తలకావేరి ఉంది ఇది బాగా ఎత్తైన కొండల మీద ఉంటుంది . ఇక్కడ కావేరి నది పుట్టి కొండలు , గుట్టల లోంచి ప్రవహించి నదిగా మారింది . 

కావేరి జన్మ స్థలం లో కావేరి మాత కు దేవాలయం నిర్మించారు . ఇక్కడికి చేరేసరికి మధ్యాహ్నం అయింది . బాగా ఎండ గా ఉంది . ఇదే దేవాలయం ముఖద్వారం . 


దేవాలయం లోనికి కేవలం సంప్రదాయక దుస్తులు కాని , మగ వారు పూర్తి ఫేంట్ , షర్టు వేసుకోవాలి . షార్ట్లు లు లాంటివి  వేసుకోరాదు . ఆడ వారు చీర , లంగా జాకెట్ , పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చును . మోకాళ్ళు కనిపించేలా పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకోవడం నిషిద్దం. ఒక వేల అటువంటి దుస్తులు ధరించి వచ్చిన వారికి ముఖద్వారం వద్దనే పంచె కండువా అద్దెకు ఇస్తారు. కొంత సొమ్ము చెల్లించి వాటిని మన దుస్తుల పైన చుట్టుకొని దర్శనానికి వెళ్ళాలి . 

ఇదే తల కావేరి దేవాలయం . చక్కగా, చాల పరిశుభ్రంగా ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు . మబ్బులు తేలి ఆడుతూ వస్తున్నాయి. వాతావరణం చల్లగా మారిపోతోంది . అప్పటి కప్పుడు ఇలా మారి పోతూ ఉంటుందట . 



ఇక్కడ మరి ఎక్కడ నుంచి వస్తుందో నీరు కాని ఒక గోముఖం నుండి సన్నని ధారగా చిన్న కుండం లోనికి అలా పడుతూ ఉంటుంది . దాని చుట్టూ మెట్లు కట్టారు . మనం దిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకో వచ్చును. ఇక్కడ కావేరి మాత దేవాలయం మరి ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి . వాటిని దర్శించుకోన్నాము . 
                                                   


పక్కనే బ్రహ్మగిరి అనే ఒక కొండ శిఖరం ఉంది దానిపైకి ఎక్కడానికి మెట్ల దారి ఉంది . ఇక్కడ పైన అగస్త్య మహాముని తపస్సు చేసుకోన్నాడని చెప్తారు. మెట్లు సుమారు 350 వరకు ఉన్నాయి . అవి ఎక్కడానికి బాగానే ఉన్నాయి . కాని బాగా నిటారుగా ఉండటం వలన ఎక్కడం కొంచెం కష్టం అనిపిస్తుంది గట్టిగా 20 మెట్లు ఎక్కేసరికి ఆయాసం వస్తుంది . కాని పైకి ఎక్కాలనే ఉత్సాహంగా ఉంది. బాగానే ఎక్కాము . పట్టుకొని ఎక్కడానికి పక్కన రెయిలింగ్ కూడా కట్టారు. 


ఎక్కుతూ ఉండగానే మబ్బులు కమ్ముకుని వచ్చేసాయి. ఒక్కసారిగా వాతావరణం మారి పోయింది. చల్లటి గాలులతో చలి కలిగించేలా అయిపోయింది. గబగబా పైకి ఎక్కాము . కిందికి చూస్తుంటే దేవాలయం అవి మబ్బులతో కప్పు బడి ఉన్నాయి. 
 










మెట్లు ఎక్కుతుంటే పక్కన కొన్ని చోట్ల చిన్న చిన్న రాళ్ళు ఒక దానిపై ఒకటి అమర్చి కనిపించాయి. మాతో పాటు వచ్చిన కొందరు కూడా వెళ్లి అలా అమర్చి వచ్చారు . ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగితే అలా రాళ్ళను పేరిస్తే తొందరలో ఇల్లు కట్టుకొంటారట . అది ఒక నమ్మకం. ఇలా చాలా పుణ్యక్షేత్రాలు  దగ్గర చేస్తారట. 














బ్రహ్మ గిరి పైన చిన్న ప్రదేశం ఉంటుంది . ఇక్కడకి వెళితే మాత్రం మనకు తిరిగి రావాలనిపించదు . అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ చోటు కేరళ, తమిళనాడు , కర్ణాటక మూడు రాష్ట్రాల కు మధ్యలో ఉంది. మిగిలిన రాష్ట్రాల లోనికి వెళ్ళకుండా కంచె వేసి ఉంది. ఇది తప్పక వెళ్ళవలసిన ప్రదేశం . మేము దిగి వచ్చే టప్పటికి పరిస్థితి ఇది వర్షంలో తడిసి ముద్దయి కారు లోనికి ఎక్కాల్సి వచ్చింది . అక్కడ అలాగే అప్పటి కప్పుడు వాతావరణం  మారిపోయి వర్షం కురుస్తుందట .

 
మరి మీకు చూడాలనివుంది కదూ . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం