పరస్పర సహకారం

                                                         

                     మొన్న ఇస్రో వారు సార్క్ దేశాల ప్రయోజనార్ధం ఉపగ్రహాన్ని ప్రయోగించినపుడు యావత్తు ప్రపంచం మన దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.  పొరుగుదేశాలకు ఉచితంగా మన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందించడంలో మన ఉదారతను ఉచితరీతిని అందరూ కొనియాడారు . ప్రధాన మంత్రి పదవిలోకి  రాగానే పొరుగుదేశం బాగుంటే మనము బాగుంటాం అంటూ ఈ  ప్రాజెక్టును మొదలు పెట్టించిన నరేంద్రమోడీకి   అభినందనలు వెల్లువెత్తాయి.  ఇరుగు చల్లన... పొరుగు చల్లన  అనే  నానుడి ని తలకెక్కించుకొని పొరుగుకే అగ్ర తాంబూలం అంటూ ఈ ప్రాజెక్ట్ ను తలపెట్టిన భారతీయతకు నిజమైన నివాళులు అర్పించాలి అందరూ. అసలు ఈ  'ఇజం ' మన భారతీయుల నైజం .
                    నన్ను  అడిగితే ఇది మన తర తరాలలో రక్తంలో ఇంకిపోయినదని అనుకొంటాను . ఇప్పుడంటే నేను, నా  భార్య , నా పిల్లాడు , నా పిల్ల అనే కేవలం తన కుటుంబ కేంద్ర స్వార్ధపూరిత మనస్తత్వాలు పెరిగిపోయాయి కానీ అనాది నుంచి మనది వసుధైక కుటుంబం అనే భావన కాదా .
                  పిండి వంటలు వండినా , ఊరగాయలు పెట్టినా ఒకరికి ఒకరు రుచులు చూడటం కోసం ఇచ్చిపుచ్చుకోడాలు ఆనవాయితీ . చివరికి వండిన కూరలు దగ్గరి నుంచి పొరుగు వారికి పంచందే తోచదు కొందరికి.  అయినా పొరుగింటి పుల్లకూర రుచి అని సామెత కూడా ఉందాయె. పెళ్ళిళ్ళకి   వెళ్ళేటప్పుడు ఇరుగు పొరుగు   ఒకరి కొకరు నగలు , పట్టుచీరలు ఎరువు తీసుకోడం , ఎరువు ఇవ్వడం ఎప్పటి నుంచో మన వాళ్లకి అలవాటే . పట్టుచీర ఎరువిచ్చి పీట పట్టుకు  తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ జాగ్రత్త వాళ్ళది మరి.
                మా చిన్నపుడు మా నాయనమ్మ వాళ్లకి మర కత్తి పీట ఉండేది . అది ఏడాది అంతా మూలన కూర్చున్నా వేసవిలో డానికి డిమాండ్ బాగా పెరిగిపోయేది . ఆవకాయల సీజన్ రాగానే ఇరుగు పొరుగు ఇళ్లలో ఎవరు ముందు ఆవకాయలు మొదలెట్టినా దాన్ని ముక్కలు తరగడానికి  పట్టుకెళ్ళేవారు . వాళ్ళ పని అయ్యాక మర్యాదగా   తిరిగి ఇచ్చేస్తే బాగుండేది. కానీ అది అక్కడినుంచి వేరేవాళ్లు  పట్టుకుపోయేవారు. అలా అది వీధులు దాటిపోయేది. తీరా మా ఇంటిలో ఆవకాయలు పెట్టేరోజు కత్తిపీట కోసం ముందు తీసుకువెళ్లిన వాళ్ళ ఇంటికి   వెళితే  అక్కడ ఉండేది కాదు , వేరెవరో తీసుకున్నారని చెప్పేవారు. అలా అలా అది చేతులు మారుతూ ఎక్కడికో చేరేది .  దాని ఆచూకీ తెలుసుకొనేసరికి మా తల ప్రాణం తోకకి వచ్ఛేది .
                అంతెందుకు ఆరోజుల్లో అందరికి నూతులే కదండీ . బకెట్  తో తోడుకోడమే ఎంత లోతున్నా . తాడు తెగిపోడం , బకెట్ జారి పోడం కూడా సర్వసాధారణంగా జరిగేది. దాన్ని తీయడం కోసం గేలం కూడా అందరిళ్ళలో ఉండేది కాదు ఎవరో ఒకళ్ళిద్దరి ఇంట్లో ఉంటే ఊరందరు దాన్నే వాడేవారు.
                పండగ అయినా పబ్బమయినా , పెళ్లిళ్లు , పేరంటాలయినా ఎవరింటిలో వచ్చినా పని అందరిదీ అన్నట్లు ఉండేవారు. అప్పడాలు వత్తడం , వడియాలు పెట్టడం , పిండివంటలు చేయడం లో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకొనేవారు. దీనికి కావలసిన పెద్ద పెద్ద మూకుళ్ళు, వగైరాలు ఎవరి దగ్గరున్నా అందరికి ఇచ్చేవారు . ఒకోచోట అందరికి ఇళ్లలో సరిగా సదుపాయం లేకపోతే సదుపాయం ఉన్న ఇంటికి వెళ్లి చేసుకొనేవారు. అలాగే కారాలు కొట్టుకోవాలంటే రోళ్ళు ఉన్న వాళ్ళ ఇంటికి రోకళ్ళు పట్టుకొని వెళ్లిపోడమే . పెళ్లి పీటలు కూడా ఊరికి ఒకళ్ళు , ఇద్దరు దగ్గరే ఉండేవి. అవసరానికి అందరికీ అదే ఉపయోగపడేది.
               వస్తుసహాయం ఒకటేనా ఊరగాయలు పెట్టేటప్పుడు ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళందరూ కలిసి ముక్కలు కొట్టడం, మాగాయ ముక్కలు గీయడం చేసేవారు. ముఖ్యంగా మా పిల్లలకి మంచి కాలక్షేపం . రోజు ఎవరొకరు ఒరే ఈరోజు మాఇంట్లో ముక్కలు గీయాలని పిలుపులు, గీసిపెట్టినందుకు కొంచెం పండిన కాయలు బహుమానం ఇచ్ఛేవారు. ఇదే వంకని కొంచెం బాగున్నా పక్కన పెట్టేసే వాళ్ళం పండింది అంటూ .
             
              అంతేనా ఎవరింట్లో అయినా చావులు , ఆపదలు వచ్చినా వీధి వీధి అంతా వెన్నంటి సహాయం చేసేవారు . విచారంలో ఉన్న వాళ్లకి ధైర్యవచనాలు చెప్పేవారు. ఇంట్లో పొయ్యి వెలిగించనవసరం లేకుండా ఇరుగు పొరుగులే కాస్త ఎంగిలి పడేలా చేసేవారు. చెప్పండి ఇప్పుడు పరస్పర సహకారం మన నరనరాల్లో జీర్ణించుకుపోలేదా. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం