వెర్రి తలలు వేస్తున్న వినాయక చవితి ఉత్సవాలు 1



వెర్రి తలలు వేస్తున్న వినాయక చవితి ఉత్సవాలు  చదివారు కదా ! తరువాత భాగం చదవండి .
నెమ్మదిగా కాలం గడిచే కొద్దీ వినాయక చవితి ఉత్సవాలలో మార్పులు వచ్చాయి . పౌరాణిక నాటకాలు తగ్గి ,సాంఘిక నాటకాలు , రికార్డింగ్ డాన్స్ లు మొదలయాయి. కాని అవి మరి అంత అసభ్యంగా ఉండేవి కాదు . చక్కని పాటలకు డాన్స్ చెసెవారు. క్రమేపి 16 m .m  సినిమాలు రంగప్రవేశం చెసాయి. దానితో హరికధలు వినేవారు కరువయ్యారు . వాటితో పాటు ఒగ్గు కధలు , మొదలైన గ్రామీణ , జానపద కళలు కనుమరుగయ్యాయి . అయినప్పటికీ నేడు జరుపుతున్న వినాయక ఉత్సవాలు (కొన్ని చోట్ల ) వెగటు కలిగిస్తున్నాయి . పల్లెల్లో రాజకీయ పార్టీలు , కులాలు , వీధుల వారిగా వినాయకులను నిలపడం . పట్నాలలో వీధికి నాలుగు చోట్ల నిలపడం జరుగుతోంది . అది భక్తితో కాక ఒకరిపై ఒకరు పోటీ కోసం అన్నట్లు కనపడుతోంది . ఎత్తు, ఆర్భాటం , హడావిడి ఇలా ప్రతి విషయంలో పోటి పడి విగ్రహాలను నిలుపుతున్నారు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సినిమాలలోని పాటలు ముఖ్యంగా ఐటెం సాంగ్స్  చెవులు అదిరేలాటి పెద్ద పెద్ద స్పీకర్స్ తో వినిపిస్తున్నారు . కనీసం చుట్టుపక్కల ఇళ్ళలో చదువుకొనే విద్యార్ధులు , చంటి పిల్లలు , వృద్ధులు , హృద్రోగులు ఉండవచ్చును అన్న ఇంగిత జ్ఞానం లేకుండా రాత్రి వరకు మోగిస్తున్నారు .
                 ఇక చందాలు    విషయానికి వస్తే విసిగించి , విసిగించి వసూలు చేయడం , అది కూడా ఒకరో ఇద్దరో కాదు చాలామంది రావటం జరుగుతోంది . వసూలు చేసిన డబ్బులు ఎంత వరకు ఆ దేముడికి ఖర్చు పెడతారో ఆయనకే తెలియాలి . పందిళ్ళ దగ్గర భక్తుల కంటే పని పాట లేనివారే ఎక్కువ కనపడుతుంటారు . వారి ముందు నుంచి మహిళలు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు .
               విగ్రహాల తయారీ కూడా అది సృజనాత్మకత అనుకోవాలో ఏమో కనిపించిన ప్రతి వస్తువు తోనూ తయారు చేస్తున్నారు . మొక్కజొన్న కండెలు, అరటిపళ్ళు , మరమరాలు, కాదేదీ  తయారికి అనర్హం అన్నట్లుగా ఉంది . నిమజ్జనం దగ్గరకు వచ్చేసరికి అదొక ఉత్సవంలా కాక మందు కొట్టి , వంటి నిండా రంగులు పులుముకొని , పెద్ద పెద్ద శబ్దాలతో , బాంబులు మొదలైన బాణసంచా కాల్పులతో చూడటానికి చిరాకు తెప్పించేలా రోడ్డును పూర్తిగా ఆక్రమిస్తూ , వెళ్లేవారికి ఇబ్బంది కలిగిస్తూ అసభ్యకరమైన డాన్స్ లు చేస్తూ సాగుతున్నారు . ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తోంది .
( అందరూ పైన చెప్పిన విధంగా చేస్తున్నారని చెప్పటం లేదు . కాని చాల మంది ఇదే విధంగా చేస్తున్నారు . బహుశా ఇది మీలొ కొందరికైనా అనుభవమే అనుకొంటు న్నాను . ఇది గమనించి పరులకు ఇబ్బంది కలిగించ కుండా మన భక్తి ప్రకటించు కోవచ్చును . అని నా అభిప్రాయం )

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం